Amaravati: రాజధాని అమరావతిలో (Amaravati) పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కల సాకారం దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి. అమరావతిలో (Amaravati) పేదలకు ఇంటి స్థలాల కేటాయింపుపై సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్5 జోన్‌లో పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వొచ్చని, అలా చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని తాజాగా బుధవారం అత్యున్నత ధర్మాసనం తీర్పు ప్రకటించింది.
రాజధాని అమరావతిలో నిరుపేదలకు ఇంటి స్థలాలను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అరవింద్ కుమార్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆర్5 జోన్‌లో పట్టాల పంపిణీ విషయంపై సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చే హక్కు ఏపీ ప్రభుత్వానికి ఉందంటూ ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది.
చట్ట ప్రకారం 5 శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) ఇంటి స్థలాలు ఇవ్వాలనే నిబంధన ఉందని ధర్మాసనం తెలిపింది. అయితే, కేసు తుది ఉత్తర్వులకు లోబడి ఇంటి పట్టాలపై హక్కులు వర్తిస్తాయని అత్యున్నత ధర్మాసనం తేల్చి చెప్పింది. విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వ సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 34 వేల ఎకరాల్లో 900 ఎకరాలు మాత్రమే పేదలకు కేటాయించినట్లు ఆయన కోర్టుకు తెలిపారు.
పది మంది రైతులు మాత్రమే ఇక్కడికి వచ్చారని, సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 53.1డీ ప్రకారం పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ఆయన వాదనలు వినిపించారు. పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వొద్దంటూ వేసిన పిటిషన్లకు విచారణ అర్హత లేదని ఈ సందర్భంగా కోర్టుకు విన్నవించారు. అలాగే.. ఆర్5 జోన్ లో పట్టాలు ఇవ్వడాన్ని ఆపడానికి వారికి ఏ అధికారం ఉందని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ-సిటీకి ఏ రకంగా ఇబ్బంది కలుగుతుందని ప్రశ్నించారు.
ఇక సీఆర్డీఏ తరఫున సీనియర్ లాయర్ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. మాస్టర్ ప్లాన్ లో ఎటువంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేశారు. చట్టం ప్రకారమే 5 శాతం ఈడబ్ల్యూఎస్‌లకు ఇంటి స్థలాలు ఇవ్వాలని, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వమే భూ సేకరణ జరుపుతోందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న ధర్మాసనం.. అమరావతిలో పేదల ఇంటి స్థలాలు పంపిణీకి అనుమతిస్తూ తీర్పు వెలువరించింది.
మొదటి నుంచి అమరావతిలో పేదలకు ఇంటి స్థలాల వ్యవహారంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. భూములిచ్చిన రైతులు కౌలు ఆశిస్తున్నారు. రైతులు తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా ప్రతిపక్ష టీడీపీ అధినేత అండతో కోర్టుల్లో పోరాటం చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
చంద్రబాబు అండతో కోట్లాది రూపాయలు కోర్టు లాయర్ల ఫీజులు చెల్లిస్తూ వృథాగా ప్రయాస పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లి వాటిని పరిష్కారం చేసుకోవాలని అనేకసార్లు కోరినా కొందరు టీడీపీ సానుభూతిపరులైన రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ముసుగులో ఈ రకమైన పోరాటం కొనసాగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో చంద్రబాబు, టీడీపీకి మింగుడు పడని పరిస్థితి ఏర్పడుతోంది.
Read Also: Telangana Congress: కర్ణాటక ప్రభావం తెలంగాణపై ఉంటుందా?