కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో పార్టీకి దేశ వ్యాప్తంగా ఊపు వచ్చిందని విశ్లేషణలు వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పిన అంచనాలకు మించి కాంగ్రెస్ పార్టీ సీట్లు సాధించడం విశేషం. దీంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చేసింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం పక్కనే ఉన్న తెలంగాణపై (Telangana Congress) పడుతుందా? ఈ ఏడాదే తెలంగాణలో ఎన్నికలు వస్తున్న తరుణంలో అసలు కాంగ్రెస్ (Telangana Congress) పార్టీకి పూర్వ వైభవం సాధ్యమేనా? నేతల కుమ్ములాటలు విడిచి గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తారా? శ్రేణులను, సీనియర్ నేతలను ఒక్క తాటిపైకి తెచ్చి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విజయం దక్కేలా చేయగలరా? ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) నేతలు, కార్యకర్తల్లో ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీకే (BRS Party) ప్రజలు పట్టం కడతారని సీఎం కేసీఆర్ (CM KCR) నమ్మకంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో క్షేత్రస్థాయిలో బలమైన ఓటు బ్యాంకు ఉంది. దీన్ని క్యాష్ చేసుకోవాలంటే నేతలు కష్టపడాల్సి ఉంటుంది. అంతేకాదు.. ముఖ్యమంత్రి కాగలిగిన సత్తా ఉన్న నేత అధ్యక్షుడిగా అందరినీ కలుపుకొని పోయి రాజకీయాలు చేయాల్సి ఉంటుంది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి (YSR) ఉండగా ఇదే జరిగింది. సీనియర్లు, జూనియర్లు తనను నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేస్తూ.. అధిష్టానానికి విధేయుడై వైఎస్ అనుకున్నది సాధించారు. సంక్షేమ సారథిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.
అలాంటి చరిష్మా ఉన్న నేత ఇప్పటి కాంగ్రెస్‌లో దాదాపు లేరనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్‌రెడ్డి.. (Revanth Reddy) అందరినీ కలుపుకొని పోవడంలో విఫలమవుతున్నారు. పార్టీ పదవుల పంపకం సందర్భంగా సీనియర్లంతా అలిగి నానా యాగీ చేసిన విషయం తెలిసిందే. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న చందంగా సొంత పార్టీలోనే ఎక్కువ శాతం మంది రేవంత్‌ను వ్యతిరేకిస్తున్నారు. సీనియర్ల దెబ్బకి అప్పటి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ పోస్టు ఊడింది. ఈ సమస్యను సరిదిద్దలేకపోతున్నారనే కారణం చేతనో, ఈ గొడవలు తలకేసుకొని మోయడం తన వల్ల కాదని మాణిక్కం ఠాగూరే తప్పుకున్నారో తెలియదు గానీ.. మొత్తానికి మాణిక్‌రావ్ థాక్రే ఇన్‌చార్జ్‌గా నియమితులయ్యారు.
అప్పటి నుంచి కాస్త సీనియర్లు సైలెంట్ అయినట్లు కనిపిస్తున్నారు. అయితే, ఎన్నికల సందర్భంగా అందరూ ఒక్కతాటిపైకి వచ్చి అభ్యర్థులను గెలిపించుకోవడం అనేది అతి పెద్ద సవాల్. ఒకవైపు రేవంత్ రెడ్డి మాత్రం.. కాంగ్రెస్ గెలిచేస్తుంది.. తాను ముఖ్యమంత్రి అవుతానన్న చందంగా వ్యవహరిస్తుండడం చాలా మంది కాంగ్రెస్ పెద్దలకు మింగుడు పడటం లేదు. ఈ క్రమంలో సహాయ నిరాకరణ చేస్తున్నారు. రేవంత్ వెనక ఉన్న వర్గమంతా చంద్రబాబుదేనని, (Chandrababu) ఆయనకు సహకరించడం వల్ల కాంగ్రెస్ ఉనికికే ప్రమాదమనే ఆలోచన కూడా చాలా మందిలో ఉంది. అందుకే రేవంత్‌ను తమ నాయకుడిగా చాలా మంది ఇప్పటికీ అంగీకరించడం లేదు. కోమటిరెడ్డి బ్రదర్స్‌లో రాజగోపాల్‌రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ఏకంగా పార్టీ కూడా మారిపోయిన సంగతి తెలిసిందే.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండా సురేఖ, సీనియర్ నేత వీహెచ్, భట్టి విక్రమార్కతో పాటు ఇంకా చాలా మంది కాంగ్రెస్ నేతలు ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాను సీఎం అంటే తాను సీఎం అన్నట్లు నేతల వైఖరి ఉంటోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నాయా? అనేది ప్రశ్నార్థకమే. మునుగోడు ఉప ఎన్నికలో ఏకంగా మూడో స్థానానికి కాంగ్రెస్ పడిపోయిన సంగతి తెలిసిందే. బై ఎలక్షన్‌లో కోమటిరెడ్డిని ఓడించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీకి గంపగుత్తగా ఓట్లు పడేలా చేశారన్న టాక్ నడిచింది.
తెలంగాణలో త్రిముఖ పోరు గ్యారెంటీ అని విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో డీకే శివకుమార్, సిద్ధరామయ్య, ఇతర ముఖ్య నేతలు అంతా ఒక్కతాటిపైకి వచ్చి పార్టీని గెలిపించడంలో విజయవంతం అయ్యారు. రాహుల్ గాంధీ పాదయాత్ర కూడా ప్లస్ అయ్యింది. బీజేపీ పాలనపై వ్యతిరేకత, కమీషన్లు తీసుకొనే సీఎం అనే అపవాదు కూడా కారణాలుగా నిలిచాయి. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా లాంటి హేమా హేమీలు ప్రచారం చేసినా గెలుపు దక్కలేదు.
తెలంగాణలో బీజేపీ (Telangana BJP) పవనాలు ఎంత వీచినా 10 సీట్లకు మించి రావడం కష్టమేనని విశ్లేషణలు వస్తున్నాయి. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, షర్మిల పార్టీ, పొంగులేటి ప్రభావం, ఎంఐఎం, చిన్నా చితక పార్టీలు ఓట్లు చీలిక ఎలాగూ ఉంది. మొత్తంగా చూస్తే.. బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన డోకా ఏమీ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కర్ణాటక ఫలితాల ప్రభావం ముమ్మాటికీ తెలంగాణపై పడే చాన్సే లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
Read Also : Journalist Health Camp: బెజవాడలో జర్నలిస్టులకు ఉచిత హెల్త్ క్యాంప్..