Sajjala fires on CBN: ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్‌పై ఏపీ ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. దాంతోపాటు ఏపీ ప్రభుత్వంపై ఇటీవల చిరంజీవి చేసిన వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పవన్‌ను దగ్గర పెట్టుకొని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారంటూ సజ్జల విమర్శించారు. తాడేపల్లిలో మీడియాతో సజ్జల మాట్లాడారు. (Sajjala fires on CBN)
పుంగనూరులో జరిగిన ఘటనలు ప్రజలందరూ చూశారని సజ్జల గుర్తు చేశారు. చంద్రబాబు సైగలు చేయడం, తరమండి అని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. పుంగనూరు ఘటనలో నిర్దోషినని చెప్పుకునేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అల్లర్లు సృష్టించి అరాచకాలకు పాల్పడింది చంద్రబాబు, ఆయన గ్యాంగేనని సజ్జల స్పష్టం చేశారు. ఘటన సమయంలో చంద్రబాబు వికృత ఆనందం కనిపించిందని చెప్పారు.
రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు మాట్లాడారని సజ్జల తెలిపారు. కుట్ర కోణం లేకుండా ఈ ఘటనలు జరుగుతాయా? అని నిలదీశారు. రాష్ట్రం తగలబడాలని పుంగనూరు నుంచి ప్లాన్ చేశారని ఆరోపించారు. నాయకుడంటే ఆపడానికి ప్రయత్నిస్తాడు కానీ చంద్రబాబు రెచ్చగొట్టాడన్నారు. చంద్రబాబు హయాంలో ఉన్న పోలీసులే ఇప్పుడు ఉన్నారని గుర్తుంచుకోవాలన్నారు. పోలీసులంటే చంద్రబాబుకు చులకన భావం ఉందన్నారు.
14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని సజ్జల పేర్కొన్నారు. పక్కా ప్లాన్ ప్రకారం రాళ్లు, కర్రలతో దాడి చేశారన్నారు. ఉగ్రవాద, ఉన్మాద ముఠాగా దాడులు చేశారని, ఉన్మాదులుగా వ్యవహరించిన వారు కార్యకర్తలా? అని ప్రశ్నించారు. పోలీపులు గాయపడినా సంయమనం పాటించారని అభినందించారు. టీడీపీ అధ్యక్షుడు ఉన్మాది శిక్షణలో తయారైన ఉన్మాదులంటూ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. పుంగనూరు ఘటనలో ఆధారాలతో సహా దొరికారని సజ్జల చెప్పారు. పోలీసులు నిగ్రహంగా ఉండటంతో చంద్రబాబు పాచిక పారలేదని చెప్పారు.
చిరు తమ్ముడు బీజేపీతోనే ఉన్నారు..
ఏపీ ప్రభుత్వంపై పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్ చిరంజీవి తీరుపై సజ్జల స్పందించారు. వాల్తేరు వీరయ్య 200 డేస్ ఈవెంట్ లో మాట్లాడిన చిరంజీవి.. ఏపీ రాజకీయ నేతలను ఉద్దేశించి.. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, పేదల గురించి ఆలోచించాలంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి విషయాలపై ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీపై పడతారేంటి? అని వ్యాఖ్యానించారు. అదేదో పెద్ద సమస్యలా చూపించకండి అని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. నటీనటుల రెమ్యూనరేషన్ పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడతాయి? అని ప్రశ్నించారు. డిమాండ్, ఆదరణ ఉన్నప్పుడు నటీనటులకు రెమ్యూనరేషన్లు ఎక్కువే ఉంటాయన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ప్రభుత్వాలను గుండెల్లో పెట్టుకుంటారని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవి వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలంతా భగ్గుమన్నారు. తాజాగా సజ్జల కూడా స్పందించారు. ఎవరి తరపున చిరంజీవి మాట్లాడారో? తెలియాలన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రయత్నాలు చేయాలంటే చిరంజీవి తమ్ముడు బీజేపీతోనే ఉన్నారని గుర్తు పెట్టుకోవాలన్నారు. పవన్ ద్వారా చిరంజీవి కేంద్రంతో మాట్లాడి ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించవచ్చని సజ్జల రామకృష్ణారెడ్డి సలహా ఇచ్చారు.