Vidadala Rajini: ప్రభుత్వాస్పత్రుల్లో ఆరోగ్య పథకాల పోస్టర్లు.. మంత్రి కీలక ఆదేశాలు!

Vidadala Rajini: ఏపీ ప్రభుత్వం వైద్య శాఖకు ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని (Vidadala Rajini) చెప్పారు. వైద్య ఆరోగ్య రంగం పరంగా రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధులకు అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు, సౌకర్యాలు మెరుగు పడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశిస్తున్నారని మంత్రి రజిని (Vidadala Rajini) పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల తీరులో గణనీయమైన మార్పులొచ్చాయనే విషయాన్ని నిరూపించేలా ఉండాలని మంత్రి వైద్యాధికారులతో చెప్పారు. మంగళగిరి ఏపీఐఐసీ టవర్స్ లోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మంత్రి విడదల రజిని సమీక్ష నిర్వహించారు.

ఆస్పత్రిలోకి అడుగుపెట్టగానే రోగికి తాను పొందబోయే సౌకర్యాల గురించిన ప్రాధాన్యాంశాల పోస్టర్లను ప్రతి ఆస్పత్రిలో ప్రదర్శించేలా చూడాలని మంత్రి సూచించారు. ఇంతకుముందెన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య ఆరోగ్య రంగానికి ఇస్తున్న ప్రాధాన్యం, కేటాయిస్తున్న నిధులు, సిబ్బంది నియామకం.. లాంటి వాటి విషయంలో ఒక చరిత్ర సృష్టించారని విడదల రజిని చెప్పారు. ఇది అందరూ గుర్తెరిగేలా ఈ పోస్టర్లను ఏర్పాటు చేయాలని చెప్పారు.

రోగి ఆస్పత్రికి వచ్చినప్పటి నుంచి ఇంటికి వెళ్లే దాకా పూర్తి ఆరోగ్యంతో, సంతోషంతో, తాను మంచి సేవలు పొందానన్న సంతృప్తితో వెళ్లేలా చూడాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖపై ఉందని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం విషయంలో చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరముందని మంత్రి రజిని ఆదేశించారు. పారిశుద్ధ్యం, పరిపాలన, ఆస్పత్రుల నిర్వహణ, రోగులకు బలవర్థకమైన ఆహారం పంపిణీ …ఇవన్నీ సరిగా అమలవుతున్నదీ, లేనిదీ అధికారులు తరచూ చూడాలని మంత్రి ఆదేశించారు.

తనిఖీల సంఖ్య పెంచాలని, తనిఖీల సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏ మాత్రం అక్రమాలు, అవకతవకలు జరిగినట్లు పసిగట్టినా సంబంధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి ఆస్పత్రిలో మాతాశిశు సంరక్షణ వార్డుల వద్ద బాలింతలకు ప్రత్యేకించే విధంగా పింక్‌ కలర్‌ కర్టెన్లు ఏర్పాటు చేసి, పాలిచ్చే తల్లులకు తగినంత మరుగు ఉండేలా చూడాలని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం పెద్ద మొత్తం కూడా వెచ్చించాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు.

విశాఖ కేజీహెచ్‌ ఈ నాలుగేళ్లలో ఎంతో అద్భుతంగా మారిందని, ఇలాంటి సౌకర్యాలు ఇప్పటికే అక్కడ ఏర్పడ్డాయని మంత్రి ఈ సందర్భంగా ఉదహరించారు. ముఖ్యంగా మహిళా వార్డుల వద్ద క్లోజ్డ్‌ డస్ట్‌బిన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆస్పత్రుల పనితీరుపై కేటాయించే మార్కుల విషయంలో పారదర్శకత ఉండాలని , పనితీరు అన్నివిధాలా బాగున్నప్పుడే మార్కులు ఇవ్వాలని మంత్రి రజిని అధికారులకు సూచించారు. తరచూ తనిఖీల ద్వారా ఆస్పత్రుల పనితీరును మెరుగుపరచాలని మంత్రి ఆదేశించారు.

ప్రభుత్వ నిధులతో పాటు అవసరమైతే దాతల నుంచి సహకారాన్ని తీసుకుని, 16 టీచింగ్‌ ఆస్పత్రుల వద్ద ఇన్సినిరేటర్స్‌ ఏర్పాటు చేసి, వ్యర్థాల ప్రక్షాళన చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆస్పతుల్లో సిబ్బంది నుంచి ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ తీసుకోవాలని, తదనుగుణంగా జీతానికి దీన్ని లింక్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. రోగులకు బలవర్ధక ఆహారాన్ని అందించాలన్న లక్ష్యంతో గతంలో రూ.40గా ఉన్న డైట్‌ ఛార్జీలు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి రూ.80కు పెంచిన నేపథ్యంలో మెనూ చార్టులో నిర్దేశించిన మేరకు మూడుపూటలా నాణ్యమైన ఆహారం ఇస్తున్నదీ, లేనిదీ తనిఖీ చేయాలని మంత్రి ఆదేశించారు.

Read Also : Gangamma Jatara: అంగరంగ వైభవం.. గంగమ్మతల్లి జాతరకు భారీగా తరలి వచ్చిన భక్తజనం

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles