Groundnut Farmers: అనంతపురం: రాయలసీమలో వేరుశనగ రైతుల పరిస్థితిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) మాజీ సభ్యుడు యం.వీ.యస్. నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం దంచర్ల గ్రామంలో వేరుశనగ పంట తీవ్రంగా ఎండిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు. పంట ఎదుగుదల దశలోనే మొక్కలు వాడిపోవడం, ఆకులు ఎండిపోవడం, పొలాల్లో నేల తేమ లేకపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోందన్నారు.
దంచర్లలోనే కాదు.. రాయలసీమ అంతటా ఇదే పరిస్థితి?
దంచర్ల గ్రామంలో కనిపిస్తున్న పంట పరిస్థితి ఒక్క గ్రామానికే పరిమితం కాదని నాగిరెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమలోని అనేక వర్షాధార ప్రాంతాల్లో వేరుశనగ రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని అన్నారు. వేరుశనగ పంట నష్టపోతే అది కేవలం పంట నష్టం మాత్రమే కాదని.. రాయలసీమ రైతుల జీవనాధారంపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు.
4.13 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు
2022-23 సాగు గణాంకాలను పరిశీలిస్తే రాయలసీమలో వేరుశనగ పంటకు ఉన్న ప్రాధాన్యత స్పష్టమవుతుందని నాగిరెడ్డి తెలిపారు. ఆ ఏడాది రాయలసీమలోని ఎనిమిది జిల్లాల్లో కలిపి సుమారు 4.13 లక్షల హెక్టార్లు అంటే 10.20 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు జరిగిందని పేర్కొన్నారు.
జిల్లాల వారీగా 2022-23లో వేరుశనగ సాగు విస్తీర్ణం ఇలా ఉంది:
- అనంతపురం – 195.96 వేల హెక్టార్లు
- శ్రీ సత్యసాయి – 74.50 వేల హెక్టార్లు
- కర్నూలు – 59.34 వేల హెక్టార్లు
- చిత్తూరు – 37.25 వేల హెక్టార్లు
- అన్నమయ్య – 21 వేల హెక్టార్లు
- నంద్యాల – 9.99 వేల హెక్టార్లు
- వైఎస్సార్ కడప – 9.29 వేల హెక్టార్లు
- తిరుపతి – 5.44 వేల హెక్టార్లు
అందులో అనంతపురం జిల్లాలోనే సుమారు 4.84 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు జరిగిందని ఆయన తెలిపారు.
ఈ ఏడాది వేరుశనగ సాగు ఎంత?
ఈ ఖరీఫ్ సీజన్‌లో వేరుశనగ సాధారణ సాగు అంచనా 3.87 లక్షల హెక్టార్లు కాగా, సెప్టెంబర్ 9, 2026 నాటికి కేవలం 1.475 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగు జరిగిందని నాగిరెడ్డి వెల్లడించారు. అంటే సాధారణ సాగులో ఇది కేవలం 38 శాతం మాత్రమే. 2022-23తో పోలిస్తే ఈ ఏడాది వేరుశనగ సాగు విస్తీర్ణంలో భారీ తగ్గుదల కనిపిస్తోందని ఆయన అన్నారు.
సెప్టెంబర్ 9 నాటికి జిల్లాల వారీగా సాగు
2026 సెప్టెంబర్ 9 నాటికి రాయలసీమలో వేరుశనగ సాగు పరిస్థితి ఇలా ఉందని నాగిరెడ్డి తెలిపారు:
- అనంతపురం – 51,048 హెక్టార్లు
- శ్రీ సత్యసాయి – 44,208 హెక్టార్లు
- కర్నూలు – 21,615 హెక్టార్లు
- అన్నమయ్య – 5,556 హెక్టార్లు
- నంద్యాల – 3,701 హెక్టార్లు
- చిత్తూరు – 3,681 హెక్టార్లు
- వైఎస్సార్ కడప – 3,091 హెక్టార్లు
- తిరుపతి – 1,942 హెక్టార్లు
సాగు విస్తీర్ణమే కాదు.. పంట పరిస్థితిపైనా సర్వే చేయాలి
ప్రస్తుతం అసలు సమస్య సాగు విస్తీర్ణం తగ్గడమే కాకుండా, ఇప్పటికే సాగు చేసిన పంట పరిస్థితి ఎలా ఉందనేదని నాగిరెడ్డి పేర్కొన్నారు. ఎన్ని ఎకరాల్లో సాగు తగ్గింది? ఎక్కడ ఎంత పంట ఎండిపోతోంది? ఎంత పంట నష్టం జరిగే అవకాశం ఉంది? అనే వివరాలను జిల్లా, మండలం, గ్రామ స్థాయిలో ప్రభుత్వం పారదర్శకంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. కేవలం సాగు విస్తీర్ణాన్ని నమోదు చేయడం సరిపోదని.. పొలాల్లో ఉన్న వేరుశనగ పంట పరిస్థితిని కూడా శాస్త్రీయంగా అంచనా వేయాల్సిన అవసరం ఉందన్నారు.
రైతు పెట్టుబడులన్నీ నష్టపోయే ప్రమాదం
వేరుశనగ సాగు కోసం రైతులు ఇప్పటికే విత్తనాలు, దుక్కులు, కూలీలు, ఎరువులు, పురుగుమందులు, కలుపు నివారణ వంటి వాటిపై భారీగా పెట్టుబడులు పెట్టారని నాగిరెడ్డి తెలిపారు. పంట చేతికి రాకముందే ఎండిపోయే పరిస్థితి ఏర్పడితే రైతులు పెట్టిన పెట్టుబడి మొత్తం నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. దిగుబడి తగ్గడంతో పాటు అప్పులు తీర్చలేని పరిస్థితి ఏర్పడవచ్చని, తదుపరి పంటకు పెట్టుబడి పెట్టడం కూడా కష్టమవుతుందని పేర్కొన్నారు. దీంతో రైతు కుటుంబాల్లో పిల్లల విద్య, వైద్యం, కుటుంబ నిర్వహణ వంటి ఖర్చులు మరింత భారంగా మారే ప్రమాదం ఉందన్నారు.
రైతుతో ఆగని నష్టం.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
వేరుశనగ పంట విఫలమైతే దాని ప్రభావం రైతు కుటుంబాలకే పరిమితం కాదని నాగిరెడ్డి అన్నారు. రైతు కూలీలకు ఉపాధి తగ్గడంతో పాటు విత్తనాలు, ఎరువుల వ్యాపారులు, వ్యవసాయ యంత్రాల యజమానులు, రవాణా రంగం, గ్రామీణ చిన్న వ్యాపారాల ఆదాయాలపై కూడా ప్రభావం పడుతుందని వివరించారు. అందువల్ల వేరుశనగ పంట నష్టాన్ని ఒక రైతు వ్యక్తిగత సమస్యగా కాకుండా అనంతపురం–రాయలసీమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభంగా ప్రభుత్వం గుర్తించాలని కోరారు.
ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి
వేరుశనగ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు.
- మండలాల వారీగా వేరుశనగ పంట పరిస్థితిపై ప్రత్యేక క్షేత్రస్థాయి సర్వే నిర్వహించాలి.
- ఎండిపోతున్న పంటలను గ్రామాల వారీగా గుర్తించాలి.
- పంట నష్టం అంచనా వేసి నమోదు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి.
- అర్హులైన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం అందించాలి.
- పంట నష్టపోయిన రైతుల బ్యాంకు రుణాల విషయంలో రీస్ట్రక్చరింగ్, అవసరమైన రుణ సదుపాయాలు కల్పించాలి.
- తదుపరి పంటకు అవసరమైన విత్తనాలు, పెట్టుబడి సహాయం అందించాలి.
- పశువులకు మేత, తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలి.
- కరువు ప్రభావిత ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచాలి.
- వర్షాధార వేరుశనగ సాగుకు కరువు తట్టుకునే రకాలు, నేలలో తేమ సంరక్షణ, సూక్ష్మ నీటిపారుదల, శాస్త్రీయ సాగు పద్ధతులపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి.
ప్రత్యేక కరువు సహాయ ప్యాకేజీ ప్రకటించాలి
దంచర్ల గ్రామం, గుంతకల్లు మండలంలో కనిపిస్తున్న ఎండిపోయిన వేరుశనగ పంటను ప్రభుత్వం తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నాగిరెడ్డి కోరారు. రైతు పెట్టుబడి పెట్టి పంట పండిస్తే రైతుతో పాటు ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని.. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించక పంట దెబ్బతిన్నప్పుడు మొత్తం నష్టాన్ని రైతు ఒక్కడే భరించే పరిస్థితి ఉండకూడదన్నారు.
వేరుశనగ రైతును ఆదుకోవడం అంటే అనంతపురం రైతును మాత్రమే ఆదుకోవడం కాదు.. రాయలసీమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కాపాడటమే అని నాగిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి వేరుశనగ పంట నష్టాన్ని అంచనా వేయాలని, నష్టపోయిన రైతులకు ప్రత్యేక కరువు ఆర్థిక సహాయ ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వ హామీల మేరకు చెల్లించాల్సిన సొమ్మును కూడా వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. రైతు పంటను కాపాడటం.. రాయలసీమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కాపాడటమే అని ఆయన స్పష్టం చేశారు.
Read also: Groundnut: వేరుశెనగ తినడం మిస్ అవుతున్నారా? కండరాల బలం చేకూరాలంటే తప్పక తినాలి..!
Groundwater: కొబ్బరికాయ, వేపపుల్లతో వాటర్ పాయింట్ గుర్తించడం నిజమేనా? శాస్త్రం ఏమి చెబుతోంది? బోరు వేయించే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
Groundwater Crisis: భూగర్భ జలాల అధిక వినియోగం వల్ల కుంగిపోతున్న మెక్సికో సిటీ.. ప్రపంచానికి భారీ హెచ్చరిక






