English Medium exam: రాష్ట్రంలో 3, 6, 9 తరగతుల్లో చదువుతున్న 7 లక్షల మంది విద్యార్థుల్లో 6 లక్షల (85.7%) మంది విద్యార్థులు తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే స్టేట్ అసెస్‌మెంట్ సర్వే పరీక్షకు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 3, 2023న రాష్ట్రంలోని 27,406 పాఠశాలల విద్యార్థులు వ్రాయనున్నారని, ప్రభుత్వ పాఠశాలల నుండి ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు “ఇంగ్లీష్ మీడియంలో జాతీయ స్థాయి అసెస్‌మెంట్ సర్వే” పరీక్షలో పాల్గొనడం ఇదే మొదటిసారి. (English Medium exam)
ఇది ప్రతి ఒక్కరికీ కొత్త అనుభవం అయినందున విద్యార్థులు, ఉపాధ్యాయులలో ఒక ఆందోళన ఉంటుంది కాబట్టి, విద్యార్థులను పరీక్ష కోసం ప్రేరేపించడానికి కలెక్టర్లు, డీఈవోలు ప్రేరణ కల్పించాలని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ కోరారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో ఆందోళనను తగ్గించి ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు వారికి ప్రేరణ తరగతులు నిర్వహించాలని కలెక్టర్లు, డీఈఓలు, ఇతర ఉన్నతాధికారులను ఆయన కోరారు. విద్యార్థులు పరీక్షలకు మరింత సన్నద్ధమయ్యేందుకు వీలుగా పాఠశాలలు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 2 వరకు ప్రతిరోజు మాక్ టెస్ట్‌లు నిర్వహించాలని ఆయన సూచించారు.
2020-2021 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీషు బోధనా మాధ్యమాన్ని ప్రారంభించిన రాష్ట్ర విద్యాశాఖకు ఈ పరీక్ష ఒక ముఖ్యమైన మైలురాయి అని ఆయన పేర్కొన్నారు. 2020-2021లో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రారంభించిన సదరు 6 వ తరగతి బ్యాచ్ విద్యార్థులు వచ్చే ఏడాది 10వ తరగతి పరీక్ష ఇంగ్లీష్ మీడియం లో రాయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. ముఖ్యంగా, ఈ విద్యార్థులు ఇంతకుముందు ఏ రాష్ట్ర-స్థాయి పరీక్షలకు హాజరు కాలేదని, కానీ ఇప్పుడు ఏకంగా జాతీయ స్థాయి మూల్యాంకనానికి సిద్ధమవుతున్నారు, ఇది ఈ విద్యార్థులకు పెద్ద విజయమన్నారు.
ఇంగ్లీషు మీడియం బోధనకు మారడం ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వ భవిష్యత్తు కోసం విద్యార్థులను సిద్ధం చేయడానికి ఒక ముఖ్యమైన చర్య అని ప్రవీణ్ ప్రకాష్ అభిప్రాయపడ్డారు. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యను అందించగలదనే బలమైన సందేశాన్ని పంపుతుందని ఆయన అన్నారు. ఇది రాష్ట్ర విద్యావ్యవస్థపై విద్యార్థులు, ఉపాధ్యాయుల విశ్వాసాన్ని కూడా పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also : IB Syllabus in AP Schools: 45 వేల పాఠశాలల్లో ఐబీ కరిక్యూలమ్.. ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ బడుల బలోపేతం