CM Jagan review on cooperation: వ్యవసాయ కార్యకలాపాలకు, మహిళల స్వయం ఉపాధి కార్యక్రమాలకు తక్కువ వడ్డీకే రుణాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, కేంద్ర సహకార బ్యాంకులపై ఇవాళ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ రంగం పురోగతికి కీలక సూచనలు చేశారు. (CM Jagan review on cooperation)
పీఏసీఎస్‌లు, డీసీసీబీలు, డీసీఎంఎస్‌ల బలోపేతంపై సమీక్షలో ప్రధానంగా చర్చ జరిగింది. వాటి నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం దిశగా సీఎం జగన్ సూచనలు చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను, రైతు భరోసా కేంద్రాలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేసినట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోకి 3 నుంచి 4 ఆర్బీకేలను తీసుకు వచ్చామన్నారు. క్రెడిట్, నాన్ క్రెడిట్ సేవలు పీఏసీఎస్‌లు ఆర్బీకేల ద్వారా అందిస్తున్నాయన్నారు. రుణాలకు సంబంధించి దరఖాస్తులు ఆర్బీకేల ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు స్వీకరిస్తున్నాయని చెప్పారు. (CM Jagan review on cooperation)
డీసీఎంఎస్‌లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీఎం జగన్ తెలిపారు. ఇలాంటి మార్పులు వచ్చిన నేపథ్యంలో డీసీఎంఎస్‌ల పనితీరుపై పూర్తిస్థాయి అధ్యయనం చేయాలన్నారు. ఆర్బీకేలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న అవసరాలకు అనుగుణంగా డీసీఎంఎస్ పనులు, కార్యక్రమాలపై ఒక అధ్యయనం చేయాలన్నారు. వాటి కార్యకలాపాలను మరింత ప్రయోజనం చేకూర్చేలా, తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు వాటి ధరలపై ఎప్పటికప్పుడు సీఎం యాప్ ద్వారా వివరాలు వస్తున్నాయని సీఎం గుర్తుచేశారు.
ఎక్కడైనా కనీస గిట్టుబాటు ధర లభించకపోయినా, నిరాశాజనకంగా ఉన్నా సీఎం యాప్ ద్వారా వివరాలు తెలియగానే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ ప్రక్రియలో డీసీఎంఎస్‌లకు సముచిత పాత్ర కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దీంతోపాటు ప్రైమరీ, సెకండరీ పుడ్ ప్రాసెసింగ్ వ్యవస్ధలు డీసీఎంఎస్‌ల ద్వారా ఇంటిగ్రేడ్ కావాలన్నారు. వీటన్నింటిమీదా సమూల అధ్యయనం చేసి చర్యల కోసం తగిన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో ప్రొఫెషనలిజం పెంచామని సీఎం జగన్ తెలిపారు. పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌లలో కూడా ప్రొఫెషనలిజం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మన రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అని, అందుకే ఈ రంగంలో ఉన్న, అనుబంధంగా ఉన్న ప్రతి వ్యవస్థనూ కూడా బలోపేతం చేసుకోవాలన్నారు.
పీఏసీఎస్‌ల కింద నడిచే పెట్రోలు బంకుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. నవంబర్ నాటికి పీఏసీఎస్‌లలో పూర్తిస్థాయి కంప్యూటరీకరణ అవుతుందన్నారు. ఆర్బీకేల్లోని బ్యాకింగ్ కరస్పాండెంట్.. ఈ వ్యవస్థలో ఒకభాగం కావాలన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థల్లో పీఏసీఎస్‌లు కీలక పాత్ర పోషించాలన్నారు. కమర్షియల్ బ్యాంకుల కన్నా.. తక్కువ వడ్డీలకే రైతులకు, మహిళలకు వడ్డీలు ఇవ్వాలని సీఎం చెప్పారు. బంగారంపై ఇచ్చే రుణాలపై కమర్షియల్ బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలన్నారు. బంగారంపై రుణాలు అన్నవి పూర్తి భరోసా ఉన్న రుణ ప్రక్రియ అని, దీనివల్ల నష్టం ఉండదని, దీన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలన్నారు.
ఆప్కాబ్ కార్యకలాపాలపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. ఆప్కాబ్‌లో గతంలో చూడని పురోగతి కనిపిస్తోందన్నారు. ఆప్కాబ్ మన బ్యాంకు, దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ఆప్కాబ్‌లో 2019 వరకూ కార్యకలాపాలు రూ.13,322.55 కోట్లు కాగా, 2023 మార్చినాటికి రూ. 36,732.43 కోట్లకు ఆప్కాబ్ ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయని గుర్తు చేశారు. ఈ నాలుగేళ్లలో పెరిగిన ఆర్థిక కార్యకలాపాల విలువ రూ.14,440.07 కోట్లు అన్నారు. 175శాతం గ్రోత్ రేటు నమోదైందని అధికారులు తెలిపారు. నిరర్ధక ఆస్తులు 50 శాతానికి పైగా తగ్గాయన్నారు.