CM Jagan on Pawan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన సీఎం జగన్.. అమ్మ ఒడి నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి.. ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేనానిపై కౌంటర్లు వేశారు. (CM Jagan on Pawan)
ముఖ్యంగా పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. పవన్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్.. అని ట్రోలింగ్ చేశారు. ‘‘ఓ లారీ ఎక్కుతాడు. దాని పేరు వారాహి అట. ఓ లారీ ఎక్కి ఊగిపోతూ.. తనకు నచ్చని వారిని చెప్పుతో కొడతానంటాడు.. తాట తీస్తానంటాడు.. గుడ్డలూడదీసి తంతానంటాడు.. ఈ మనిషి నోటికి అదుపులేదు. నిలకడ లేదు. వారిలా పూనకం వచ్చినట్లు మనం ఊగుతూ మాట్లాడలేం. వారిలా మనం రౌడీల్లా మీసాలు మెలేయలేం. వారిలా మనం రౌడీల్లా బూతులు తిట్టలేం. వారిలా నలుగురు నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్లకోసారి భార్యనూ మార్చలేం. పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకు తీసుకొని రాలేం. ఇవన్నీ వారికే పేటెంట్.’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్.
తనను గుండెల్లో పెట్టుకున్న గిరిపుత్రులకు సీఎం జగన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా సీఎం జగన్ మాట్లాడుతూ..
‘‘ఏ తల్లయినా, తండ్రయినా తమ పిల్లలు తమకంటే గొప్పగా ఉండాలని, తాను పడిన కష్టాలు తమ పిల్లలకు రాకూడదని కోరుకుంటారు. ప్రపంచాన్నే ఏలే పరిస్థితిలోకి మన పిల్లలు రావాలని గట్టి సంకల్పంతో ఈ నాలుగు సంవత్సరాలుగా మీ బిడ్డ ప్రభుత్వం అడుగులు వేసింది. అమ్మ ఒడి కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. 10 రోజులపాటు ప్రతి మండలంలోనూ పండుగ వాతావరణంలో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ప్రతినిధులంతా పాల్గొంటారు. ఒకటి నుంచి 12వ తరగతి దాకా చదివిస్తున్న 42,61,965 మంది అక్కచెల్లెమ్మలకు అండగా, 83,15,341 మంది విద్యార్థులకు మంచి జరిగిస్తూ.. ఈ కార్యక్రమం ద్వారా రూ.6,392.94 కోట్లు అక్కచెల్లెమ్మల బ్యాంకుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ ఏ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకైనా అమ్మ ఒడి వర్తింపజేస్తున్నాం.
బడుద్ధాయిలకు అర్థమయ్యేలా చెప్పండి..
నాలుగేళ్లలోనే 26,067.28 కోట్లు… జమ చేయడం జరిగింది. బటన్ నొక్కడం అంటే ఇదీ.. బటన్ నొక్కడం అంటే తెలియని బడుద్ధాయిలకు ఈ విషయం అర్థం అయ్యేలా చెప్పండి అని కోరుతున్నా. భారతదేశంలోనే 28 రాష్ట్రాల్లో కేవలం మన రాష్ట్రంలో మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇక మీదట కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పిల్లల బంగారు భవిష్యత్ కోసం తప్పనిసరిగా మీ పిల్లలను బడికి పంపించండి. నాలుగేళ్లుగా మీ పిల్లల బాగు కోరే ప్రభుత్వంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. గవర్నమెంట్ బడులన్నింటిలో కూడా ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చాం.
బడులు ప్రారంభం కాగానే మెరుగైన విద్యాకానుక కిట్లను ప్రతి పిల్లాడు, ప్రతి పాప చేతిలో పెడుతున్నాం. క్లాస్ టీచర్లకే గతిలేని పరిస్థితి గతంలో చూశాం. ఈరోజు మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు ఉండేలా అడుగులు పడ్డాయి. 3వ తరగతి నుంచే పిల్లలకు ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ టోఫెల్ కరిక్యులమ్ తీసుకొచ్చింది కూడా మీ జగన్ మామ ప్రభుత్వంలోనే.పిల్లలను బైలింగ్యువల్ టెక్స్ట్ బుక్ లు, చక్కగా అర్థమయ్యేందుకు మొట్టమొదటి సారిగా ఇస్తున్నాం. బైజూస్ కంటెంట్ ను కూడా మన పాఠాల్లోకి అనుసంధానం చేయడం మీ జగన్ మామ ప్రభుత్వంలోనే జరిగింది.6వ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూమును డిజిటలైజ్ చేసి ఐఎఫ్పీలను తెచ్చి డిజిటల్ బోధనను స్కూల్స్ లోకి తీసుకొచ్చాం.
మీ మేనమామ ప్రభుత్వమే ఇస్తోంది..
అంగన్వాడీల్లోనూ మార్పులు తెచ్చాం. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సంపూర్ణ పోషణ అమలు చేస్తున్నాం. సంపూర్ణ పోషణ ప్లస్ కూడా గిరిజన ప్రాంతాల్లో అమలు చేస్తున్నాం. పాఠశాలలన్నీ రూపు రేఖలు మార్చి 45,000 గవర్నమెంట్ స్కూళ్లలో నాడు-నేడు తెచ్చాం. 8వ తరగతి పిల్లలకు, టీచర్లకు ఇద్దరికీ ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో కూడా పని చేసేలా వారికి ట్యాబ్స్ అందిస్తున్న మీ మేన మామ ప్రభుత్వం. ఆడ పిల్లల కోసం స్వేచ్ఛ పథకాన్ని అమలు చేస్తున్నాం.
పెద్ద చదువుల కోసం వంద శాతం పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ తో జగనన్న విద్యా దీవెన ఇస్తోంది మీ మేనమామ ప్రభుత్వంలోనే. మెస్ ఖర్చులు, హాస్టల్ ఖర్చుల కోసం వసతి దీవెన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది మీ మేనమామ ప్రభుత్వమే. పిల్లలు ఇంకా గొప్పగా చదవాలి. ప్రతి కుటుంబం నుంచి సత్యనాదెళ్ల రావాలి. పదో తరగతి పూర్తి చేసి ఉండాల్సిందే అన్న నిబంధనతో వైఎస్సార్ కల్యాణమస్తు-షాదీ తోఫా అమలు. ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే కేవలం విద్యారంగంలో సంస్కరణల కోసం అక్షరాలా రూ.66,722 కోట్లు ఖర్చు.గత ప్రభుత్వం దాదాపు కోటి మంది పిల్లలకు చేసిన అన్యాయం క్షమించగలమా అని అడుగుతున్నా.
పెత్తందార్లకు అందుబాటులో ఉన్న ఆ చదువులకంటే గొప్ప చదువులు తీసుకొచ్చాం. గవర్నమెంట్ బడులు.. ప్రైవేట్ బడులకు తీసిపోకుండా పోటీ పడే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది. గవర్నమెంట్ బడుల్లో ఆణిముత్యాలుంటాయని, వజ్రాలు, రత్నాలు మెండుగా పుట్టే విద్యా విధానాన్ని తీసుకొచ్చింది మీ మేనమామ ప్రభుత్వంలోనే. పేద కుటుంబాల్లో వెలుగులు నింపేలా గవర్నమెంట్ బడి వెలుగుతోంది.
టెన్త్ పరీక్షల్లో గవర్నమెంట్ స్కూళ్లో నుంచి టాప్ 10 ర్యాంకులు గతేడాది 25 రాగా, ఈ ఏడాది ఏకంగా 64కు పెరిగాయి. 75 శాతానికి పైగా మార్కులతో డిస్టింక్షన్ సాధించిన విద్యార్థుల సంఖ్య గత ఏడాది 63,275 మంది అయితే, ఈ ఏడాది 67,114కు పెరిగింది. గవర్నమెంట్ స్కూళ్లలో పిల్లలు 66.50 శాతం ఫస్ట్ క్లాస్ లో పాసయితే ఈ ఏడాది 70.16 శాతానికి పెరిగారు. 67 మంది పిల్లలకు ఐఐటీ, ఎన్ఐటీ, నిఫ్ట్, సెంట్రల్ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు దొరికే అవకాశం ఈ సంవత్సరం రాబోతోంది.
గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియఓ పెరిగింది..
2018-19లో స్కూళ్లలో చేరిన విద్యార్థుల సంఖ్య గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో.. 84.48 శాతంతో మన రాష్ట్రంలో దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉంటే ఇప్పుడు 100.80 శాతంతో, జాతీయ సగటు 100.13 శాతం కంటే మెరుగ్గా ఉన్నాం. ఇది విద్యారంగంలో మనం చూపించిన శ్రద్ధకు దక్కిన ఫలితాలివీ.
– గిరిజనులను గుండెల్లో పెట్టుకున్నది మీ బిడ్డ ప్రభుత్వమే. 5 మంది డిప్యూటీ సీఎంలను తయారు చేస్తే అందులో నా చెల్లెమ్మ మొట్ట మొదటి గిరిజన డిప్యూటీ సీఎంగా ఈ రాష్ట్రంలో పని చేసిన చరిత్ర. మీ జగనన్న క్యాబినెట్ లో గిరిజనుడు ఒక డెప్యూటీ సీఎంగా ఈరోజు పని చేస్తున్నాడు.
ట్రైబల్ అడ్వయిజరీ కమిటీని వేసిన చరిత్ర మనది.నవరత్నాలను మారుమూల ఉన్న ట్రైబల్ విలేజ్ కు చేర్చాలని తపన పడుతున్నాం. కురుపాం నియోజకవర్గంలోనే 118 టవర్లను ఒక్కో టవర్ ఖర్చు 80 లక్షలతో 2,600 సెల్ ఫోన్ టవర్లు నిర్మాణంలో కనిపిస్తున్నాయి. ఐటీడీఏ పరిధిలో 5 మల్టీ స్పెషాలిటీ హాస్పటల్స్ కడుతున్నాం. కురుపాం నియోజకవర్గంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ వేగంగా కడుతున్నాం. ఇదే కురుపాం నియోజకవర్గంలో మరో మెడికల్ కాలేజీ రాబోతోంది. ఇదే ట్రైబల్ ప్రాంతంలో కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి.
ఒకటి పాడేరులో వేగంగా కడుతున్నారు.మరొకటి కురుపాంలో రాబోతోంది. మూడోది నర్సీపట్నంలో వేగంగా కడుతున్నారు. నాలుగోది విజయనగరంలో రేపు సంవత్సరం అడ్మిషన్లు రాబోతున్నాయి. రేపు నెల ట్రైబల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయబోతున్నాం. గిరిజనుల కోసం ఏకంగా 147242 కుటుంబాలకు మేలు చేస్తూ ఆర్వోఎఫ్‌ఆర్ డీకేటీ పట్టాలు 362737 ఎకరాలను పంచి పెట్టిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. కురుపాంలోనే 21311 కుటుంబాలకు 38798 ఎకరాలు పంపిణీ చేశాం. వాళ్లందరికీ రైతు భరోసా సొమ్మును కూడా గత నాలుగేళ్లుగా ఇస్తున్న ప్రభుత్వం మనది. నామినేటెడ్ పదవి, కాంట్రాక్ట్ నా ఎస్సీ, ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ వర్గాలకు కచ్చితంగా 50 శాతం కేటాయించాలని చట్టం చేశాం. మన కళ్లెదుటనే గ్రామ సచివాలయాల్లో 1,30,000 మంది ఉద్యోగస్తులు కనిపిస్తున్నారు. నా ఎస్టీ, ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు వీటిలో 84 శాతం కనిపిస్తున్నారు.
కడుపు మంట, ఈర్ష్య, బొజ్జ రాక్షసులు..
ఇంత మంచి చేస్తున్నా జీర్ణించుకోలని వాళ్లు చాలా మంది ఉన్నారు. మనందరి ప్రభుత్వాన్ని 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా ఏమీ చేయని ఓ నాయకుడు.. ఆ నాయకుడి కోసం 15 సంవత్సరాల పుట్టిన ఓ దత్తపుత్రుడు. వీళ్లు టీడీపీ.. టీ-తినుకో డీ-దోచుకో పీ-పంచుకో.. పార్టీతో కలిసి దోచుకున్న అవినీతి సొమ్మును పంచుకుంటూ బొజ్జలు పెంచుకుంటూ బొజ్జ రాక్షసుల పత్రికలు, వారి టీవీలు ఇవన్నీ మనల్ని విమర్శిస్తున్నాయి. వాళ్లందరికీ కూడా కడుపులో మంట. ఈర్ష్యతో కళ్లు కప్పుకుపోయాయి. గాంధీగారి మూడు కోతులు.. చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు అనవద్దు అని నీతులు చెబుతాయి. కానీ, మన రాష్ట్రంలో మాత్రం మంచి వినవద్దు, మంచి కనవద్దు, మంచి అనవద్దు.. మంచి చేయవద్దు అనే నాలుగు కోతులున్నాయి. వీరినే దుష్ట చతుష్టయం అని మనమంతా పిలుచుకుంటున్నాం. అధికారంతో అవినీతి సొమ్మును పంచుకోవడం.. ఇదీ వారి రాజనీతి. నమ్మించి ప్రజల్ని నట్టేట ముంచడమే వారికి తెలిసిన ఏకైక నీతి.
14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా ఏ మంచీ చేయని ఈ బాబు.. 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఏ ప్రాంతానికీ ఏ మంచీ చేయని ఈబాబు.. ఏ సామాజిక వర్గానికీ కూడా ఏ మంచీ చేయని బాబు. ఎన్నికల ముందు మేనిఫెస్టో బుక్కు తెస్తారు. అధికారంలోకి వస్తే.. మేనిఫెస్టోను చెత్త బుట్టలో పడేస్తారు. ఇదీ వాళ్ల ట్రాక్ రికార్డు. మరోసారి ఇదే దుష్ట చతుష్టయం.. ఇదే బాబు.. మరోసారి అధికారం ఇవ్వండంటూ మరోసారి మేనిఫెస్టోతో మళ్లీ మోసానికి దిగారు.డ్రామాలు ఆడటం మొదలు పెట్టారు. ఈసారి డ్రామాలకు కొంచం రక్తి కట్టించారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారంట.. మోసం చేసేదానికి ఒక హద్దులు పద్దులు పోయి.. జగన్ ఏం చేస్తున్నాడు.. జగన్ కంటే కాస్త ఎక్కువ చెప్పాలని మోసం చేయడంలో రక్తి కట్టిస్తున్నాడు. వీళ్లందరికీ తోడు ఒక దత్త పుత్రుడు ఉన్నాడు. ఈ దత్త పుత్రుడు.. 2014లో కూడా ఇదే దత్తపుత్రుడు, ఇదే చంద్రబాబుకు మద్దతు పలికాడు. మీ ఇంటికి లేఖలొచ్చాయి. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు దత్తపుత్రుడి సంతకంతో లేఖలు వచ్చాయి. మాదీ బాధ్యత అని.. ఎన్నికలు అయిపోయాయి, ఎన్నికల ప్రణాళిక చెత్త బుట్టలో వేశారు.
ఎవరినీ వదలకుండా చంద్రబాబు మోసం..
రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, చిన్న పిల్లలను సైతం వదలకుండా చంద్రబాబు మోసం చేశాడు. పూచీగా సంతకం పెట్టిన దత్తపుత్రుడు 5 సంవత్సరాల్లో ఒక్క మాటా మాట్లాడలేదు. మన పునాదులు పేదల పట్ల ప్రేమలోంచి పుట్టాయి. రైతుల నుంచి వారి మమకారంలోంచి పుట్టాయి. అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మల పట్ల వారి బాధ్యతలోంచి మన పునాదులు పుట్టాయి. మాట ఇచ్చి మోసం చేయడం అనే వారి పునాదులు మన దగ్గరికి కూడా రావు. నా పునాదులు నేరుగా బటన్ నొక్కే డీబీటీ పునాదుల మీద పుట్టాయి. వారిలా అధికారం అంటే కేవలం దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం.. వాళ్ల పునాదులు, మన పునాదుల మధ్య తేడా గమనించాలి.
అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పుడు కూడా అప్పటికన్నా ఇప్పుడే గ్రోత్ రేటు తక్కువ. మారిందల్లా కేవలం ఒక్క జగన్. వాళ్లెందుకు చేయలేకపోయారు. మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతున్నాడు. మన పునాదులు సామాజిక న్యాయంలో ఉన్నాయి తప్ప వారిలా సమాజాన్ని చీల్చడంలో లేవు. వాళ్ల సోషల్ మీడియా, పత్రికలు, టీవీలు, వాళ్లంతా కలిసికట్టుగా రోజూ అదే అబద్దాలు.. వాళ్లు చేస్తున్న దుర్నీతిని గమనించాలి. సమాజాన్ని చీలుస్తున్నారు. చిన్న పొరపాటు జరిగినా ఇంతింత పెద్దగా చూపిస్తున్నారు. ఆ తప్పును మన మీద వేస్తూ బురద జల్లుతున్నారు.
మీ బిడ్డ ప్రభుత్వంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు..
మీ బిడ్డ ప్రభుత్వంలో 5 మంది డెప్యూటీ సీఎంలలో నలుగురు నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలే. రాష్ట్రానికి హోం మంత్రి నా దళిత చెల్లెమ్మ. అలాంటి మనందరి ప్రభుత్వం మీద కావాలని పనిగట్టుకొని సమాజాన్ని చీల్చడం కోసం వాళ్లు పడుతున్న పాట్లు చూడాలి. పేదల కోసం తీసుకొస్తున్న విద్యా విప్లవంలో మన పునాదులున్నాయి. పేదల జీవితాలు మార్చేలా వాళ్ల కోసం చేస్తున్న ఇళ్ల స్థలాల్లో ఉన్నాయి. వారి కోసం కట్టిస్తున్న ఇళ్లలో మన పునాదులున్నాయి. గ్రామాల్లో ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా అక్కచెల్లెమ్మలు, రైతన్నలు, అవ్వాతాతలు, పిల్లలకు మంచి జరిగేలా అందిస్తున్న పౌర సేవల్లో నా పునాదులున్నాయి. అక్కచెల్లెమ్మల సాధికారత కోసం అమలు చేస్తున్న పథకాల్లో మన పునాదులున్నాయి. పనికిమాలిన పంచ్ డైలాగుల్లో లేవు వాళ్ల మాదిరిగా.
ఇదీ మన ఫిలాసఫీ, ఇదీ మన పార్టీ…
మన పునాదులు మన ఓదార్పు యాత్ర నుంచి, 3,648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో, పేదల కష్టాల్లోంచి నా పునాదులు పుట్టాయి.వారి మాదిరిగా వెన్నుపోటులోంచి నా పునాదులు పుట్టలేదు. అబద్ధాలపైన మన పునాదులు లేవు. దోచుకో, పంచుకో,తినుకో అనే సిద్దాంతం నుంచి పుట్టలేదు. పేద వాడి కోసం నిలబడగలిగాం కాబట్టే 2009 నుంచి ఇప్పటి వరకు ఒకసారి జగన్ అనే మీ అన్నను ఒక్కసారి గమనిస్తే.. ఎక్కడా కూడా ఏ కార్యకర్తా కూడా జగన్ ను చూసినప్పుడు జగన్ నడిచే నడక చూసినప్పుడు అడుగో అతడే మా నాయకుడని కాలర్ ఎగరేసేలా నడత, ప్రవర్తన ఉంది. ఏ రోజూ అధర్మాన్ని, అబద్దాలు చెప్పి గెలవాలని ప్రయత్నం చేయలేదు. అధికారం కోసం, పొత్తుల కోసం పాకులాడలేదు. ప్రతి అడుగులోనూ పేద వాడు బాగుండాలని ఆలోచన చేశా. ఇదీ మన పునాది. ఇదీ మన ఫిలాసఫీ, ఇదీ మన పార్టీ. ఇదీ మన మనసున్న ప్రభుత్వమని తెలియజేస్తున్నా.
ఈరోజు చేసిన మంచే మన బలం, ఇదే మన నినాదం. ఈరోజు మనం యుద్ధం చేస్తున్నది రాక్షసులతో. అధర్మాన్నే ధర్మంగా వాళ్లు ఎంచుకొని వాళ్లు యుద్ధం చేస్తున్నారు. వాళ్ల మాదిరిగా మీ బిడ్డకు డంకా బజాయించే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లేదు. ఓ దత్తపుత్రుడు తోడుగా లేడు. ఒకే అబద్ధాన్ని వంద సార్లు చెప్పిందే చెప్పి.. అదే నిజమని భ్రమ కలిగించే మీడియా మాధ్యాలు మీ బిడ్డకు లేవు. మీ బిడ్డ ఇలాంటి తోడేళ్లను నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, మిమ్మల్నే. వీళ్లు చెబుతున్న అబద్ధాలు నమ్మకండి. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అనేదే కొలమానంగా తీసుకోండి. మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో మీ బిడ్డకు శ్రీరామ రక్షగా నిలవాలని కోరుతున్నా.దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో 10 రోజుల పాటు పండుగ వాతావరణంలో జరగబోతున్న వేడుకలో ప్రజా ప్రతినిధులంతా పాల్గొనాలని ఆదేశిస్తున్నా. ఇంకా మీకు మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా.’’ అంటూ సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.