Byreddy Rajasekhar Reddy: ఆంధ్రప్రదేశ్ బీజేపీలో రాష్ట్ర శాఖ కొత్త అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి ఇటీవల బాధ్యతలు తీసుకున్న వెంటనే లుకలుకలు మొదలయ్యాయి. మొన్నామధ్య విశాఖపట్నం ఎంపీ సీటు కోసం ఒకవైపు జీవీఎల్ నరసింహారావు, మరోవైపు పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారనే వార్తలు కలకలం రేపాయి. తాజాగా రాయలసీమలో బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీపై ఆరోపణలు గుప్పించడంతో ఏపీ బీజేపీలో మరోసారి చర్చనీయాంశమైంది. (Byreddy Rajasekhar Reddy)
బీజేపీ పై బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం
బీజేపీపై బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీపైనే బైరెడ్డి విమర్శలు గుప్పించడంతో కలకలం రేగుతోంది. కొంతకాలంగా సొంత పార్టీని బైరెడ్డి టార్గెట్ చేశారు. రాయలసీమ ద్రోహి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అంటూ ఫైర్ అయ్యారు. కృష్ణా నది పై తీగల వంతెనకు అనుమతి ఇచ్చి రాయలసీమకు గడ్కరీ అన్యాయం చేశారంటూ బైరెడ్డి మండిపడ్డారు.
కృష్ణా నది పై బ్రిడ్జి కం రోడ్ వంతెన కడితే ఏపీతో పాటు తెలంగాణకు మేలు జరుగుతుందని బైరెడ్డి చాలా కాలంగా వాదన వినిపిస్తున్నారు. తీగల వంతెనకు సీఎం జగన్ ఎందుకు అనుమతి ఇచ్చారో అర్థం కావడం లేదని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో అటు బీజేపీలోనూ, అధినాయకత్వంలోనూ ఆలోచన మొదలైంది.
ఏపీ బీజేపీలో బైరెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. నేడు కర్నూలు జిల్లా ప్రొద్దుటూరులో బీజేపీ సదస్సు జరగనున్న తరుణంలో పార్టీలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. పురంధేశ్వరి అధ్యక్షతన తొలి మీటింగ్‌లోనే సవాళ్లు ఎదురవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బైరెడ్డి వ్యాఖ్యల పై చర్యలు ఉంటాయా…? అంటూ రాష్ట్ర నేతలు చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం ఏపీ బీజేపీ ప్రధాన కార్యదరర్శిగా బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కొనసాగుతున్నారు. కీలక పదవిలో ఉంటూనే నాయకత్వం పై బైరెడ్డి కామెంట్ల పై కర్నూలు బీజేపీ నేతలు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని అంటున్నారు. మరోవైపు ప్రొద్దుటూరు మీటింగ్ కి వెళ్లకుండా బైరెడ్డి నేరుగా హైదరాబాద్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. బీజేపీ హైకమాండ్ పై బైరెడ్డి ధిక్కారస్వరం వినిపిస్తుండడం గమనార్హం.
గడ్కరీ రాయలసీమ ద్రోహి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం పార్టీ లైన్ దాటి వ్యవహరించడమేనని కొందరు నేతలు పెదవి విరుస్తున్నారు. కృష్ణానది పై తీగల వంతెనకు అనుమతి ఇచ్చి రాయలసీమకు గడ్కరీ అన్యాయం చేశారన్న వ్యాఖ్యలతో దుమారం రేగుతోంది. తీగల వంతెన వద్దంటూ 28న ఛలో ఢిల్లీకి బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
Read Also : BJP Meeting: పొత్తులపై ష్.. గప్ చుప్..! ఎవరూ మాట్లాడొద్దన్న పురందేశ్వరి