BJP Meeting: ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతానికి కేంద్ర పెద్దల వద్ద పొత్తుల వ్యవహారం చర్చల దశలో ఉన్నందున రాష్ట్రంలో ఎవరూ దీనిపై బహిరంగంగా మాట్లాడకూడదని రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. ఇవాళ ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. ఇందులో ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. (BJP Meeting)
పొత్తులపై నేతల తలోమాట
పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని మాధవ్ చెప్పారు. 2017 నుంచి టీడీపీ.. బీజేపీకి దూరంగా ఉందన్నారు. టీడీపీతో వెళ్లాలని ప్రస్తుతానికి ఆలోచన లేదని బీజేపీ నేత మాధవ్ వ్యాఖ్యానించారు. అయితే, పొత్తులపై ఎవరూ బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని, ఏ పార్టీతో కలిసి వెళ్లాలి? పొత్తులపై నిర్ణయం ఏంటనేది అధిష్ఠానమే మాట్లాడుతుందని స్టేట్ చీఫ్ పురందేశ్వరి సూచించారు. మరోవైపు త్వరలో పురందేశ్వరి, పవన్ కల్యాణ్ భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. జనసేనతో కలిసి కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలుస్తోంది.
పదాధికారుల భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి.. 2024 ఎన్నికల్లో బీజేపీ ఎలా వెళ్లాలనే దానిపైనా చర్చలు జరిపారు. ఈ నెల 23 నుంచి పురంధేశ్వరి పర్యటన చేయాలని డిసైడ్ అయ్యారు. రానున్న కాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై పదాధికారుల సమావేశంలో చర్చ జరిగింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మురళీధరన్ వ్యాఖ్యానించారు. ప్రజలు పత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ఎదురు చూస్తున్నారని ఆయన చెప్పారు.
ఈనెల 23న రాయలసీమలో ముఖ్యనేతలతో బీజేపీ స్టేట్ చీఫ్ పురందేశ్వరి సమావేశం నిర్వహించనున్నారు. 25వ తేదీన గుంటూరులో కోస్తా జిల్లాల నేతలతో పురందేశ్వరి భేటీ కానున్నారు. అలాగే 26న రాజమండ్రిలో గోదావరి జిల్లాల నేతలతో సమావేశం నిర్వహిస్తారు. 27న విశాఖలో ఉత్తరాంధ్ర నేతలతో పురందేశ్వరి మీటింగ్ ఉంటుందని తెలుస్తోంది.
బీజేపీపై దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం..
బీజేపీ-పవన్‌కు సంబంధం లేదని ప్రచారం చేశారని బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. ఈనెల 18న ఎన్డీఏ సమావేశానికి పవన్‌ను ఆహ్వానించారని గుర్తు చేశారు. బీజేపీకి, జనసేనకు రాజకీయ వ్యూహం ఉందని ఆయన చెప్పారు. రాజకీయంగా పవన్ వారాహి యాత్ర వ్యక్తిగతమని ఆయన తేల్చారు. వలంటీర్లపై పవన్ వ్యాఖ్యలపై హోంమంత్రి ఎందుకు స్పందించరు? అని విష్ణు ప్రశ్నించారు. ఏ మంత్రిత్వశాఖపై పవన్ ఆరోపణలు చేస్తే ఆ మంత్రి మాట్లాడరా? అని నిలదీశారు. వైసీపీ మంత్రులంతా డమ్మీనా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన-బీజేపీ అధికారంలోకి వస్తాయని జోస్యం చెప్పారు. ఏపీలో బలోపేతం దిశగా అడుగులు వేస్తామన్నారు.
జగన్ పోవాలి… పవన్ రావాలి: హరిరామజోగయ్య
ఏపీలో జగన్ పోవాలని, పవన్ అధికారంలోకి రావాలని కాపు నేత హరిరామజోగయ్య పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ లేఖ విడుదల చేశారు. తాను ఊహించిందే జరగబోతోందని హరిరామ జోగయ్య పేర్కొన్నారు. పవన్ వారాహి యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. పవన్ ఒంటరిగా పోటీ చేసిన సీఎం కావటం ఖాయమని హరిరామజోగయ్య పేర్కొన్నారు.
Read Also : New Presidents to BJP: అధ్యక్షుల మార్పు.. ఎన్నికల్లో ఫలితమిస్తుందా? బీజేపీ వ్యూహాత్మక అడుగులు!