AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదల పరిస్థితి కొనసాగుతోంది. మరోవైపు వరద సాయంపై ప్రతిపక్షం ఆరోపణలు గుప్పిస్తోంది. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. (AP Weather Alert)
మరోవైపు ఈశాన్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. తీవ్ర వాయుగుండంగా బలపడింది. పశ్చిమ వాయువ్య దిశగా వెళ్లి బంగ్లాదేశ్ లో వాయుగుండం తీరం దాటింది. ఏపీలో ఒకట్రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 42,899 క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో లేదు. శ్రీశైలం పూర్తిస్తాయి నీటి నిల్వ 215 టీఎంసీలు. శ్రీశైలంలో ప్రస్తుతం 85.20 టీఎంసీలు ఉన్నాయి.
ఏలూరు జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద మరింత తగ్గింది. ప్రాజెక్టు స్పిల్ వే నుంచి దిగువకు 5,31,304 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. మరోవైపు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద సాధారణ స్థాయికి చేరింది. వ్యవసాయ అవసరాలకు కోసం గోదావరి డెల్టాలోని 3 కాలువలకు 11,500 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.
మరోవైపు వరద సాయంపై ప్రతిపక్షం, ఓ వర్గం మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. అప్పనపల్లికి పూర్తి వరద రాకపోయినా వచ్చినట్లు రాతలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ సానుభూతిపరులను స్నానాల ఘాట్ వద్దకు తీసుకెళ్లి ఫోటో షూట్ చేశారంటూ అధికార పార్టీ ఆరోపించింది. వారితో సాయం అందలేదంటూ విష ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టింది.
అధికారులు ఊరంతా ఆహార పొట్లాలు పంచినా 50 మందికే పంపిచారని గగ్గోలు పెడుతున్నారని, ఇదే పద్ధతి అని ప్రశ్నిస్తున్నారు. సాయం అందలేదని ప్రతిపక్ష నేతలకు తాము చెప్పలేందంటూ బాధితులు చెబుతున్నారని, దిగజారి ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తోందని అధికార పార్టీ నేతలు అంటున్నారు. తాము చెప్పని విషయాలను చెప్పినట్లు పేపర్లో రాస్తున్నారని బాధితులు చెబుతున్నారని పేర్కొంటున్నారు. అధికారుల పరిశీలనలో అసలు వాస్తవాలు వెలుగు చూస్తున్నాయని చెబుతున్నారు.
మరోవైపు ఉత్తరాఖండ్, యూపీలో కూడా వరద కొనసాగుతోంది. రెండు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉత్తరాఖండ్ లో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మళ్లీ వరదలు వచ్చే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. కొండచరియలు విరిగిపడొచ్చని హెచ్చరికలు జారీ చేశారు.