Weather Report Heavy Rain: ఏపీలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్, 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. (Weather Report Heavy Rain)
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది ఏపీ వ్యాప్తంగా మరో మూడురోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మూడు రోజులపాటు సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య పేటలో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. ఎగువ నుండి మున్నేరు వాగుకి వరద ఉధృతి పెరిగింది. మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వత్సవాయి మండలం లింగాల బ్రిడ్జి మీదుగా వరద ప్రవాహం జోరందుకుంది. పెనుగంచిప్రోలు, లింగగూడెం, గౌరవరం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లింగాల బ్రిడ్జ్ దగ్గర పోలీసులు పహారా కాస్తున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పర్యటన వాయిదా వేసుకున్నారు. నేడు అక్కడ పర్యటించి వైఎస్సార్ సున్నా వడ్డీ నిధులు విడుదల చేయాల్సి ఉంది. భారీ వర్షాలతో సీఎం జగన్ పర్యటన 28కి వాయిదా వేసుకున్నారు.
నంద్యాల జిల్లాలో భారీ వర్షం పడుతోంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో మొక్కజొన్న పంట దెబ్బతింటోందని రైతులు వాపోతున్నారు. మొక్కజొన్న రైతుల్లో ఆందోళన మొదలైంది. పాములపాడు, వెలుగోడు, కొత్తపల్లి మండలాల్లో ఎడతెరిపిలేని వాన కురుస్తోంది.
భారీ వర్షాలతో గోదావరి వరద స్వల్పంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 39.4 అడుగులుగా ఉంది. పోలవరం వద్ద 11.4 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 6.84 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
విజయవాడలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. కొండ చరియలు విరిగిపడడంతో ఘాట్ రోడ్‌ను మూసేశారు. కనకదుర్గ నగర్ లోని లిఫ్ట్ ద్వారా దర్శనాలు చేయిస్తున్నారు.
ఇక కర్నూలు జిల్లాలో తుంగభద్ర డ్యాంకు భారీగా వరద పెరుగుతోంది. తుంగభద్ర డ్యాం ఇన్ ఫ్లో లక్షా 8,109 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో నమోదు కాలేదు. రాజమహేంద్రవరం వద్ద మళ్లీ నెమ్మదిగా గోదావరి పెరుగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 9.5 అడుగుల నీటిమట్టం నమోదైంది. డెల్టా పంటకాల్వలకు 9,900 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోంది. సముద్రంలోకి సుమారు 6.85 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. పోలవరం వద్ద నీటి ప్రవాహం పెరిగింది. అప్ స్ట్రీమ్ స్పిల్ వే 31.780 మీటర్లుగా ఉంది. డౌన్ స్ట్రీమ్ స్పిల్ వే 23.420 మీటర్లుగా నమోదైంది. 8,17,990 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి లంక పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజ్ కు స్వల్పంగా వరద పెరిగింది. ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 29,480 క్యూసెక్కులు – వచ్చిన నీటిని వచ్చినట్లు సముద్రంలోకి అధికారులు వదులుతున్నారు.
పశ్చిమ ఏజెన్సీలో భారీ వర్షాలతో వాగులు పొంగుతున్నాయి. జల్లేరు వాగు, బైనేరు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచాయి.
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 7,700 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో లేదు. శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రస్తుత నీటిమట్టం 815 అడుగులు కాగా పూర్తిస్థాయి 885 అడుగులు.
Read Also : Tirumala Samacharam 26-07-2023: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి 6 గంటల సమయం