AP Kula Ganana: ఆంధ్రప్రదేశ్‌లో వెనుక బడిన తరగతి వర్గాల చిరకాల కోరిక అయిన సమగ్ర కులగణనకు వచ్చే నెల 15 న శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. వెనుక బడిన తరగతి వర్గాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో అత్యంత వెనుకబడిన కులాలను గుర్తించి, వారిని ఉన్నత స్థాయికి తీసుకురావాలనే లక్ష్యంతోనే ఈ సమగ్ర కులగణనను చేపడుతున్నామన్నారు. (AP Kula Ganana)
బుధవారం సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. దేశంలో 1872లో కులగణన ప్రారంభమై 1901 నాటికి ఒక స్థాయికి వచ్చిందన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ తో కలిపి అప్పటి భారత దేశ జనాభా 30 కోట్లు ఉండేదని, అయితే బంగ్లాదేశ్, పాకిస్తాన్ విడిపోయినప్పటికీ ప్రస్తుత మన దేశ జనాభా నేటికి 140 కోట్లకు చేరుకుందన్నారు. అదే విధంగా 1901 నుంచి 1941 వరకు ప్రతి పది సంవత్సరాలకు ఒక సారి కులగణన జరిగిందన్నారు.
1941లో రెండో ప్రపంచ యుద్దం, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నేపథ్యంలో 1941లోని కులగణను పరిగణలోకి తీసుకోక పోవడం వల్ల 1931 జరిగిన కులగణననే చివరి కులగణన అని ఆయన తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తదుపరి 1951 నుంచి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనగణన మాత్రమే నిర్వహించడం జరుగుతోందన్నారు.
ఈ జనగణనలో ఎస్సీ, ఎస్టీ జనాభాను తప్ప మిగిలిన అన్ని కులాలను గంపగుత్తగా లెక్కించడం జరుగుతుందన్నారు. ఫలితంగా బి.సి. వర్గానికి చెందిన పలు కులాల ప్రజలు ఎంతగానో నష్టపోతున్నాయన్నారు. బి.సి. వర్గంలో ఎన్నో వెనుక బడి కులాలు ఉన్నాయని, ఆ కులాల్లో అత్యంత వెనుకబడిన కులాలను గుర్తించి వారి అభ్యున్నతికి అనుగుణంగా ప్రభుత్వ పథకాలను రూపొందించి అమలు పర్చాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో కులగణన జరిపించాలనే డిమాండు ఎప్పటి నుండో ఉందని, రాష్ట్రంలో బి.సి. వర్గాలకు చెందిన పలువురు నాయకులు, ప్రజలు ఎన్నో విజ్ఞాపనలు, వినతులు ప్రభుత్వానికి అందజేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వాలు ఈ డిమాండును ఏమాత్రము పట్టించుకోకుండా బి.సి.వర్గాలను నిర్లక్ష్యం చేయడం జరిగిందన్నారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి బి.సి. వర్గాలకు అత్యంత ప్రాధాన్యత నివ్వడమే కాకుండా పది మంది బి.సి.లకు మంత్రుల పదవులను కూడా కట్టబెట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 139 బి.సి.కులాలను గుర్తించి కులాల వారీగా కార్పొరేషన్లను కూడా ఏర్పాటు చేయడమే కాకుండా నవరత్నాల పథకాలను పెద్ద ఎత్తున ఆయాకులాల వారికి అందజేయడం జరుగుతోందన్నారు.
బి.సి.ల్లో అత్యంత వెనుకబడిన కులాలను గుర్తించి వారి అభ్యున్నతికి అనుగుణంగా పథకాలను రూపొందించి అమలు పర్చాలనే లక్ష్యంతో ఈ ఏడాది ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతీరావు ఫూలే జయంతిని పురస్కరించుకుని రాష్ట్రంలో కులగణన చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు.
Read Also : CM Jagan Review on Women welfare: గ్రామ స్థాయిలోనే రక్తహీనత నివారణ, పౌష్టికాహారం.. సీఎం జగన్ కీలక ఆదేశాలు