Family Relation : పెళ్లి అనేది కేవలం ఇద్దరు కలిసి ఉండడమే కాదు… ఒకరి భావాలను ఇంకొకరు గౌరవించడం, అర్థం చేసుకోవడం, కలిసి ఎదగడం. కానీ చాలాసార్లు మగవాళ్లు తెలియకైనా, తెలిసి అయినా చేసే కొన్ని తప్పిదాల వల్ల పచ్చని కాపురంలో చిచ్చు పడుతుంది. చివరికి భార్యలు విడాకుల దారి పట్టే పరిస్థితి వస్తుంది. అటువంటి ప్రధాన కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
1. భార్యతో సమయం గడపకపోవడం
పెళ్లికి ముందు ఎంతో ప్రేమగా మాట్లాడే భర్త, పెళ్లయ్యాక పనులు, ఫ్రెండ్స్, ఫోన్‌లతో బిజీ అయిపోతాడు. భార్యతో మాట్లాడటానికి, బయటకు తీసుకెళ్లడానికి, కలిసి కూర్చొని గడపడానికి టైమ్ కేటాయించడు. దీని వల్ల భార్య ఒంటరిగా ఉన్నాననే భావనకు లోనవుతుంది. ఈ ఎమోషనల్ గ్యాప్ పెరిగితే విడాకుల దాకా వెళ్లే అవకాశం ఉంటుంది.
2. బట్టల విషయంలో కొత్త కొత్త రూల్స్ పెట్టడం
పెళ్లయ్యాక భార్య ఎలా డ్రెస్ వేసుకోవాలో కూడా భర్తే నిర్ణయించాలనుకుంటే సమస్యలు మొదలవుతాయి. “చీరలే కట్టాలి”, “ఈ డ్రెస్సులు వేసుకోకూడదు” అంటూ ఆంక్షలు పెడితే ఆమెకు స్వేచ్ఛ లేకపోయినట్టు అనిపిస్తుంది. ఇది రిలేషన్‌షిప్‌లో పెద్ద నెగటివ్ పాయింట్.
3. బంధువుల ముందు తక్కువ చేసి మాట్లాడటం
భర్త తన భార్యను బంధువుల ముందు అవమానిస్తే ఆమెకు తీవ్రంగా బాధ కలుగుతుంది. “నా ఆవిడకు ఏమీ రాదు”, “ఏ పని సరిగా చేయదు” వంటి మాటలు నేరుగా ఆమె గౌరవాన్ని దెబ్బతీస్తాయి. ఇలాంటి ప్రవర్తన వల్ల భార్య భర్తపై నమ్మకం కోల్పోతుంది.
4. అధిక అనుమానం
భార్య బయటకు వెళ్తే పదే పదే కాల్ చేయడం, ఎవరి దగ్గరికి వెళ్లావ్? ఎంత సేపటికి వస్తావ్? అంటూ ప్రశ్నల వర్షం కురిపించడం… ఇవన్నీ అనుమాన స్వభావానికి నిదర్శనం. ఈ అనుమానం ఎక్కువైతే భార్యకు ఊపిరాడని పరిస్థితి వస్తుంది.
5. భార్య భావాలను పట్టించుకోకపోవడం
భార్య బాధపడుతున్నా, ఏదైనా చెప్పాలనుకున్నా భర్త వినకపోతే ఆమె మానసికంగా ఒంటరిగా మారుతుంది. “ఇవి చిన్న విషయాలు”, “నువ్వెందుకు ఎక్కువ ఆలోచిస్తున్నావ్” అని కొట్టిపారేస్తే బంధం బలహీనపడుతుంది.
6. ఆర్థిక విషయాల్లో పారదర్శకత లేకపోవడం
డబ్బు ఎలా ఖర్చవుతోంది, ఆదాయం ఎంత అనే విషయాల్లో భార్యకు తెలియనివ్వకపోతే అనుమానాలు పెరుగుతాయి. అలాగే భార్య సంపాదనను తక్కువ చేసి చూడటం కూడా గొడవలకు దారి తీస్తుంది.
7. మద్యం, చెడు అలవాట్లు
అధికంగా మద్యం సేవించడం, జూదం, ఇతర చెడు అలవాట్లు కుటుంబాన్ని నాశనం చేస్తాయి. భార్య ఎన్నిసార్లు చెప్పినా మార్పు లేకపోతే చివరికి విడాకుల నిర్ణయం తీసుకుంటుంది.
8. గృహహింస (శారీరక లేదా మానసిక)
చేతులు చేసుకోవడం మాత్రమే కాదు… మాటలతో వేధించడం, భయపెట్టడం కూడా హింసే. ఇలాంటి పరిస్థితుల్లో భార్య తన భద్రత కోసమే విడాకులు తీసుకుంటుంది.
9. అత్తమామల విషయంలో బ్యాలెన్స్ లేకపోవడం
భార్యపై అత్తమామల నుంచి వచ్చే విమర్శలను భర్త సమర్థించడం, భార్య వైపు నిలబడకపోవడం పెద్ద సమస్య. భార్యకు “నేను ఈ ఇంట్లో ఒంటరిదాన్నే” అన్న భావన కలుగుతుంది.
10. ప్రేమ, ఆప్యాయత చూపకపోవడం
చిన్న చిన్న మాటలు, శ్రద్ధ, గౌరవం ఇవన్నీ బంధాన్ని బలపరుస్తాయి. ఇవి లేకపోతే పెళ్లి జీవితం భారంగా మారుతుంది.
పెళ్లి బంధం నిలవాలంటే ఇద్దరూ ప్రయత్నించాలి. కానీ మగవాళ్లు చేసే పై తప్పిదాలు సరిదిద్దుకుంటే చాలా కుటుంబాలు విడాకుల దాకా వెళ్లకుండా నిలబడతాయి. గౌరవం, నమ్మకం, ప్రేమ ఇవే ఒక సంతోషమైన దాంపత్య జీవితానికి పునాది.
ఇవీ చదవండి: Dhoni Relation : మహేంద్రసింగ్ ధోనితో రిలేషన్.. నటి సంచలన వ్యాఖ్యలు!
Relationship: సహజీవనం చేసే వారికీ కొన్ని హక్కులుంటాయని తెలుసా?
