HomeAndhra PradeshChandrababu Naidu : కేంద్ర బడ్జెట్ వికసిత భారత్‌కు బలమైన పునాది: కుప్పంలో సీఎం చంద్రబాబు...

Chandrababu Naidu : కేంద్ర బడ్జెట్ వికసిత భారత్‌కు బలమైన పునాది: కుప్పంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

Chandrababu Naidu : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా యూనియన్ బడ్జెట్ వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా, దేశ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం పర్యటన మూడో రోజు సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేంద్ర బడ్జెట్‌పై స్పందిస్తూ, దీనిని ఫార్వార్డ్ లుకింగ్, బ్యాలెన్స్‌డ్ బడ్జెట్గా అభివర్ణించారు.

అభివృద్ధికి దోహదపడేలా బడ్జెట్‌ను తీర్చిదిద్దినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు  సీఎం అభినందనలు తెలిపారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా ఈ బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఊతం
రాష్ట్రంలో అమలు చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి కేంద్ర బడ్జెట్ మరింత బలం చేకూర్చిందని సీఎం పేర్కొన్నారు. ఇప్పటికే ఎంఎస్ఎంఈలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఇప్పుడు కేంద్ర బడ్జెట్ వల్ల వాటిని మరింత బలోపేతం చేసుకునే అవకాశం లభించిందన్నారు. మహిళలు, రైతులు, యువత ఆర్థిక సాధికారత సాధించేలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని స్పష్టం చేశారు.

ఏఐ, తదుపరి తరం సాంకేతికతలు, సంస్కరణలకు బడ్జెట్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తోందని, పునరుత్పాదక విద్యుత్, వన్ గ్రిడ్ వన్ నేషన్ లక్ష్యాలకు అనుగుణంగా విధానాలు రూపొందించారన్నారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉందని వ్యాఖ్యానించారు.

హైస్పీడ్ రైల్, రేర్ ఎర్త్ కారిడార్లతో ఏపీకి లబ్ది
హైదరాబాద్–బెంగుళూరు, హైదరాబాద్–చెన్నై, బెంగుళూరు–చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు గణనీయమైన లాభం ఉంటుందని చంద్రబాబు తెలిపారు. తిరుపతి, అమరావతి వంటి కీలక ప్రాంతాలు ఈ కారిడార్ల ద్వారా అనుసంధానం అవుతాయని చెప్పారు. పలమనేరు, చిత్తూరు తదితర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుందని వివరించారు.

డెడికేటెడ్ రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్‌లో ఏపీ భాగస్వామిగా ఉండటం రాష్ట్రానికి పెద్ద అవకాశమని అన్నారు. కీలక ఖనిజాలను వెలికి తీసి క్రిటికల్ ఎలక్ట్రానిక్స్ తయారీలో వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఐఎస్ఎం 2.0 కింద సెమీకండక్టర్ రంగానికి రూ.40 వేల కోట్లు కేటాయించడం దేశ తయారీ రంగానికి మైలురాయిగా పేర్కొన్నారు.

పర్యాటకం, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి
బడ్జెట్‌లో పర్యాటకం, హాస్పిటాలిటీ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు సీఎం చెప్పారు. అరకు రీజియన్ అభివృద్ధి, పులికాట్ సరస్సు అభివృద్ధికి నిధులు కేటాయించడం ద్వారా పర్యాటకం, జీవవైవిధ్యం రెండింటికీ మేలు జరుగుతుందన్నారు. కొబ్బరి, జీడి, కోకో, చందనం వంటి పంటల అభివృద్ధికి ప్రకటించిన కార్యాచరణ కూడా ఏపీకి లాభదాయకమని తెలిపారు.

డేటా సెంటర్లు, లాజిస్టిక్స్‌లో గేమ్ చేంజ్
డేటా సెంటర్లకు 2047 వరకూ టాక్స్ హాలిడే ఇవ్వడం భారత్‌ను డేటా సెంటర్ల హబ్‌గా మార్చుతుందని సీఎం వ్యాఖ్యానించారు. విశాఖపట్నానికి గూగుల్ సహా అనేక డేటా సెంటర్లు వస్తున్నాయని, ఏఐ, క్వాంటం, డేటా సెంటర్స్ వంటి నెక్స్ట్ జెన్ టెక్నాలజీలకు ఏపీ కేరాఫ్ అడ్రస్‌గా మారబోతోందన్నారు. త్వరలో బిల్ గేట్స్ అమరావతిలో పర్యటించనున్నారని తెలిపారు.

కేంద్ర బడ్జెట్‌లో తొలిసారిగా లాజిస్టిక్స్ రంగంపై ప్రత్యేక ప్రస్తావన రావడం కీలకమని చంద్రబాబు పేర్కొన్నారు. ఈస్ట్ కోస్ట్ కారిడార్, అంతర్గత జల రవాణా అభివృద్ధి ద్వారా రాష్ట్ర తీర ప్రాంతం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. విశాఖ ఆర్థిక రీజియన్, తిరుపతి గ్రోత్ రీజియన్, అమరావతి రీజియన్లు వేగంగా ఎదిగే అవకాశం ఉందన్నారు.

తిరుమల అంశంపై స్పందన
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై జరుగుతున్న రాజకీయాలపై సీఎం తీవ్రంగా స్పందించారు. ఎన్డీడీబీ నివేదిక ప్రకారం కల్తీ నెయ్యి అంశం తేలిందని, పవిత్రతను కాపాడేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. సిట్ ఏర్పాటు చేసినా తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల పవిత్రతను రాజకీయాలకు వాడుకోవడం మహాపాపమని వ్యాఖ్యానించారు.

మొత్తంగా కేంద్ర బడ్జెట్ రాష్ట్రాభివృద్ధికి, పెట్టుబడులకు, ఉపాధి సృష్టికి బలమైన పునాది వేస్తోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన విధానాలను రాష్ట్ర స్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ను వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఆయన తెలిపారు.

ఇవీ చదవండి: Vizianagaram Fishermen : బంగ్లాదేశ్‌లో అరెస్టైన విజయనగరం మత్స్యకారుల విడుదలకు సీఎం చంద్రబాబు తక్షణ చర్యలు
Chandrababu Naidu : రైల్వే ప్రాజెక్టుల్లో ఏపీ దేశానికి బెంచ్‌మార్క్ కావాలి: సీఎం చంద్రబాబు
Union Budget 2026-27: యూనియన్ బడ్జెట్ ముఖ్యాంశాలు: మౌలిక వసతులు, పెట్టుబడులు, పర్యాటకంపై మోదీ ప్రభుత్వ ఫోకస్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు