Harish Rao : ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్రమంగా కేసులు పెట్టి తమను ఇరికించాలనే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా హరీష్ రావుపై సాగిన విచారణ మంగళవారం ముగిసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు దాదాపు ఏడుగంటలకుపైగా ఆయనను ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణ అనంతరం నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకున్న హరీష్ రావు అక్కడ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
నిరాధార ఆరోపణలతో విచారణ
రాష్ట్రంలో ప్రస్తుతం అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలు మాత్రమే నడుస్తున్నాయని హరీష్ రావు అన్నారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ తరహా కేసులు తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు. విచారణంతా నిరాధార ఆరోపణలపైనే సాగిందని, ముగ్గురు అధికారులు ఎలాంటి ఆధారాలు చూపకుండా ప్రశ్నలు వేశారని వెల్లడించారు.
“నిజంగా విచారణలో నిజాయితీ ఉంటే.. జరిగిన ఎంక్వైరీ వీడియోను బయటపెట్టాలి. దమ్ముంటే ప్రజల ముందు పెట్టాలి” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన సవాల్ చేశారు.
గంటల్లోనే జరిగిన పరిణామాలు
గత 24 గంటల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు వేగం పెరగడమే కాకుండా, తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపింది. శనివారం సాయంత్రం సిట్ అధికారులు హరీష్ రావుకు నోటీసులు జారీ చేయగా, మంగళవారం ఉదయం 11 గంటలకు ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు.
అక్కడ ఉదయం నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు సుదీర్ఘంగా విచారణ కొనసాగింది.
న్యాయవాదులకు అనుమతి నిరాకరణ
విచారణ సమయంలో హరీష్ రావు న్యాయవాదులను లోపలికి అనుమతించకపోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. పోలీస్ స్టేషన్ ఎదుట పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
హరీష్ రావును సిట్ అధికారులు ఏసీపీ వెంకటగిరి, ఎస్పీ రవీందర్ రెడ్డి ప్రశ్నించినట్లు సమాచారం.
రాజకీయ కక్షే లక్ష్యం: హరీష్ రావు
ఈ మొత్తం వ్యవహారం వెనుక రాజకీయ కక్షే ఉందని హరీష్ రావు ఆరోపించారు. ప్రజల మధ్య బీఆర్ఎస్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి కేసులను తెరపైకి తీసుకువస్తోందని ఆయన విమర్శించారు.
ప్రజా సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుండటంతో దృష్టి మళ్లించేందుకే ఈ తరహా చర్యలు తీసుకుంటోందన్నారు. నిజాలు చివరకు బయటపడతాయని, న్యాయంపై పూర్తి విశ్వాసం ఉందని హరీష్ రావు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: Harish Rao : కవిత ఆరోపణలపై హరీష్ రావు రియాక్షన్.. నా జీవితం..!
Kavitha Press Meet : కవిత సంచలన ప్రెస్ మీట్.. కేటీఆర్, హరీష్ రావులపై హాట్ కామెంట్స్
