Kavitha Press Meet : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కవిత.. ఎమ్మెల్సీ పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్ లపై కీలక వ్యాఖ్యలు చేశారు. Kavitha Press Meet
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ప్రెస్ మీట్. పార్టీ నుంచి సస్పెండ్ చేయబడిన ఆమె, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి మాత్రమే కాకుండా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో జరిగిన ఈ మీటింగ్‌లో కవిత, పార్టీలోని కీలక నేతలైన టి.హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో కుట్రలు, పార్టీలో అంతర్గత గొడవలు, తనపై విషప్రచారాలు వంటి అంశాలను ఆమె వివరించారు.
రాజీనామా ప్రకటన: ఎమ్మెల్సీ పదవి, పార్టీ సభ్యత్వానికి వీడ్కోలు
కవిత తన ఎమ్మెల్సీ పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీనితో పాటు బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని స్పష్టం చేశారు. “పదవులు నాకు ముఖ్యం కాదు. రాజీనామా లేఖలు తెలంగాణ భవన్‌కు పంపిస్తున్నాను” అని ఆమె పేర్కొన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిన్న మధ్యాహ్నం తర్వాత బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ ప్రకటన వచ్చిందని, తన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి ఆరోపణలు చేశారని కవిత వివరించారు. ఈ రాజీనామా లేఖలు మండలి చైర్మన్‌కు సమర్పించనున్నారు.
పార్టీలో తన కృషి: గురుకులాలు, పెన్షన్లు, భూ నిర్వాసితుల కోసం పోరాటాలు
జైలు నుంచి విడుదలైన తర్వాత తాను గురుకులాలపై పోరాటం చేశానని, పెన్షన్లు పెంచాలని ఉద్యమాలు నడిపానని కవిత తెలిపారు. సీఎం జిల్లాలో భూ నిర్వాసితులకు అండగా నిలబడి, బనకచర్లపై రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశానని పేర్కొన్నారు. “పార్టీ గులాబీ కండువా కప్పుకుని చేస్తే పార్టీ వ్యతిరేకం అవుతుందా?” అని ప్రశ్నించారు. బీసీల కోసం పోరాడుతుంటే పార్టీలో కొందరు తప్పుడు ప్రచారం చేశారని, జన్మనిచ్చిన తండ్రి చిటికెన వేలు పట్టుకుని ఉద్యమం చేయడం నేర్చుకున్నానని ఆమె గుర్తు చేశారు.
కుట్రలు, విషప్రచారాలు: హరీష్, సంతోష్‌లపై తీవ్ర ఆరోపణలు
నాపై ఇద్దరు పనిగట్టుకుని విషప్రచారం చేస్తున్నారని కవిత ఆరోపించారు. చెల్లి, మహిళా ఎమ్మెల్సీ పై ఆఫీసులో కుట్రలు జరుగుతున్నాయని చెప్పగానే సస్పెన్షన్ వచ్చిందని అన్నారు. “102 రోజులైనా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆడగరా? బంధుత్వం పక్కన పెట్టి మహిళా ఎమ్మెల్సీని బాధపడితే అడగరా అన్నా?” అని ప్రశ్నలు లేవనెత్తారు. “పార్టీలో ఏం జరుగుతుందో చూడండి నాన్న?.. నేను కూడా మీలాగే ముఖం మీద మాట్లాడతా నాన్న?” అని కేసీఆర్‌ను ఆహ్వానించారు.
వ్యక్తిగత లాభం కోరుకునే వ్యక్తులు పార్టీ నుంచి తనను బయటపడేశారని, పార్టీని హస్తగతం చేసుకోవడానికి కుట్రలు జరుగుతున్నాయని కవిత వెల్లడించారు. “రేపు కేటీఆర్‌కు, మీపై కూడా కుట్ర జరగొచ్చు” అని హెచ్చరించారు. హరీష్ రావు, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ కాదని విమర్శించారు. రేవంత్ రెడ్డితో కలిసి హరీష్ ఒకే విమానంలో ప్రయాణించారని, హరీష్ సరెండర్ అయ్యాకే తనపై కుట్రలు మొదలయ్యాయని ఆరోపించారు.
హరీష్ రావుపై ఆరోపణలు ఒక్క రోజు మాత్రమే మీడియాలో వస్తాయని, రెండో రోజు నుంచి ఎవరూ మాట్లాడరని అన్నారు. రేవంత్ రెడ్డి కూడా హరీష్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదని, వారిద్దరి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ కళ్ల ముందు కనిపిస్తోందని కవిత ఆరోపించారు. “రామన్న… హరీష్, సంతోష్ మీతో ఉన్నట్టు కనిపించవచ్చు. మీ గురించి, తెలంగాణ గురించి వాళ్లు ఆలోచించే వ్యక్తులు కాదు. వాళ్లను పక్కన పెడితేనే పార్టీ బతుకుంది, నాన్న పేరు నిలబడుతుంది” అని కేసీఆర్‌ను కోరారు.
హరీష్ రావు చరిత్ర: ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్
టీఆర్‌ఎస్ పార్టీ పెట్టిన 10 నెలల తర్వాత హరీష్ రావు పార్టీలోకి వచ్చారని, కాంగ్రెస్‌లో మంత్రి పదవులు వదులుకోవద్దని ఒత్తిడి తీసుకొచ్చారని కవిత ఆరోపించారు. “హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్. ట్రబుల్ క్రియేట్ చేసి దీనిని సాల్వ్ చేసినట్టు చెప్పుకుంటారు” అని విమర్శించారు. 2018 ఎన్నికల్లో 25 మంది ఎమ్మెల్యేలకు అడిషనల్ ఫండింగ్ ఇచ్చారని, కాళేశ్వరం అవినీతి డబ్బులే ఆ 25 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చారని ఆరోపించారు. “ఆయన ఫండింగ్ చేసిన వ్యవహారం నాకు స్పష్టంగా తెలుసు. రామన్నను ఓడించడానికి సిరిసిల్లకు 60 లక్షలు పంపారు” అని కవిత వెల్లడించారు.
కేసీఆర్‌కు, కేటీఆర్‌కు ఏమైనా జరగాలని కోరుకునే వ్యక్తి కాదని, “నాకు ఎందుకు కోపం ఉంటుంది? కోట్లలో ఒకరికి ఉండే తండ్రి దొరికింది” అని అన్నారు. “ఆరు అడుగుల బుల్లెట్ ఈరోజు నన్ను గాయపరిచింది.. రేపు ఆ బుల్లెట్ రామన్నకు తగలవచ్చు.. జాగ్రత్త” అని హెచ్చరించారు. పార్టీని వెన్నుపోటు పొడుద్దామని గతంలో భావించారని, తర్వాత హరీష్ రావు వచ్చి రామన్న దగ్గర వేడుకున్నాడని కవిత తెలిపారు. ఈటల, మైనంపల్లి, జగ్గారెడ్డి, విజయశాంతి, విజయరామారావు కూడా పార్టీ వీడడానికి హరీష్ వల్లే కారణమని, దుబ్బాక, హుజూరాబాద్ ఓటమికి కూడా హరీష్ రావు బాధ్యుడని ఆరోపించారు.
సంతోష్ రావు ఆరోపణలు: ధనదాహం, మాఫియా, అర్హతలు
సంతోష్ రావుకు ధనదాహం చాలా ఎక్కువని, నేరెళ్లలో ఇసుక మాఫియా దళితులను చిత్రహింసలు చేయించడం అంతా సంతోష్ రావు చేసినా పేరు మాత్రమే కేటీఆర్‌కు పడుతుందని కవిత ఆరోపించారు. “టానిక్ పై కేసు పెట్టారు, అండర్ స్టాండింగ్ లేకపోతే ఎందుకు పక్కన పెట్టారు?” అని ప్రశ్నించారు. పోచంపల్లి శ్రీనివాస్ వేల కోట్ల వ్యాపారం ఎలా చేస్తున్నారో తెలుసుకోవాలని, సంతోష్ రావు క్లాస్ మెట్ తప్ప ఏ అర్హత ఉందని పదవులు ఇచ్చారని విమర్శించారు. హరీష్ రావు, సంతోష్ గ్యాంగులు కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కు అయ్యాయని కవిత ఆరోపించారు.
ఈ ప్రెస్ మీట్ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. కవిత భవిష్యత్ రాజకీయ ప్రయాణం ఎలా ఉంటుందో అందరి దృష్టి ఆకర్షించింది. ఆమె కొత్త పార్టీ పెట్టే అవకాశం గురించి కూడా వార్తలు వస్తున్నాయి.
ఇవీ చదవండి: MLC Kavitha : హరీష్‌రావు, సంతోష్‌ల వల్లే.. కవిత సంచలనం
