HomeAndhra PradeshSV Satish Reddy : పెట్టుబడులు బూటకం.. దోపిడీ నిజం: కూటమి ప్రభుత్వంపై సతీష్ రెడ్డి...

SV Satish Reddy : పెట్టుబడులు బూటకం.. దోపిడీ నిజం: కూటమి ప్రభుత్వంపై సతీష్ రెడ్డి ఫైర్

SV Satish Reddy : పెట్టుబడుల పేరుతో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చేస్తున్న ప్రచారమంతా వట్టి బూటకమని, కంపెనీల ఏర్పాటు ముసుగులో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను బినామీలకు కట్టబెట్టి ప్రజాసంపదను దోచుకుంటున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఏటా పెట్టుబడుల పేరుతో చంద్రబాబు చేస్తున్న దావోస్ పర్యటనలన్నీ బోగస్ అని విమర్శించారు. లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు జరిగాయని చెబుతుంటారు కానీ, వాటిలో వాస్తవంగా కార్యరూపం దాల్చిన ప్రాజెక్టుల వివరాలు చెప్పే ధైర్యం కూటమి ప్రభుత్వానికి లేదన్నారు.

వైయస్ జగన్‌ను తిట్టడానికే దావోస్ పర్యటనలా?

తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రతిసారి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడం అలవాటుగా మారిందని సతీష్ రెడ్డి మండిపడ్డారు.
“తమను తాము పొగుడుకోవడానికి, వైయస్ జగన్ గారిని తిట్టడానికే అంత దూరం దావోస్ వెళ్లాలా?” అని ప్రశ్నించారు.

భూ దోపిడీకి పెట్టుబడుల ముసుగు

పరిశ్రమల ఏర్పాటు పేరుతో ప్రభుత్వ భూములను ఎకరం 99 పైసలకే కట్టబెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఓపెన్ వేలం ద్వారా భూములను విక్రయిస్తుంటే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం చంద్రబాబు తన బినామీలకు భూములు అప్పనంగా ఇస్తున్నారని విమర్శించారు.

జర్నలిస్టులు ఈ అంశంపై ప్రశ్నిస్తే నారా లోకేష్ “నా ఇష్టం.. నేనిస్తా” అన్న తరహాలో మాట్లాడటం అధికార మదానికి నిదర్శనమని అన్నారు. ప్రజల ఆస్తిని దోచిపెట్టే హక్కు లోకేష్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. అవసరమైతే హెరిటేజ్ ఆస్తులను ఇచ్చుకోవాలని ఎద్దేవా చేశారు.

అధికార మదంతో నియంతృత్వ ధోరణి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని సతీష్ రెడ్డి అన్నారు. వందల కోట్ల ప్రజాధనాన్ని పబ్లిసిటీ కోసం ఖర్చు చేస్తూ, వాస్తవ పెట్టుబడులు మాత్రం శూన్యంగా ఉన్నాయని విమర్శించారు.

2014–19 మధ్య చంద్రబాబు హయాంలో జరిగినదే ఇప్పుడు మళ్లీ జరుగుతోందన్నారు. అప్పట్లో చేసిన లక్షల కోట్ల ఎంవోయూల్లో ఐదు శాతం కూడా కార్యరూపం దాల్చలేదని గుర్తుచేశారు. అయినా ఎల్లో మీడియాలో ఊకదంపుడు ప్రచారం కొనసాగుతోందన్నారు.

విదేశీ పర్యటనలను రహస్యంగా ఎందుకు ఉంచారు?

తాజాగా చంద్రబాబు–లోకేష్ విదేశీ పర్యటనను గోప్యంగా ఉంచడంపై కూడా సతీష్ రెడ్డి ప్రశ్నలు సంధించారు.
నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలను లైవ్ ప్రసారం చేసిన చంద్రబాబు, వారం రోజుల విదేశీ పర్యటన వివరాలను ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు.

ఏ దేశానికి వెళ్లారు? ఎందుకు వెళ్లారు? ఖర్చెంత? అన్న వివరాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. అవినీతి ద్వారా సంపాదించిన సంపదను విదేశాల్లో దాచేందుకే ఈ పర్యటనలన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని వ్యాఖ్యానించారు.

టీడీపీ అనుకూల మీడియానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది

కూటమి ప్రభుత్వ అవినీతిపై టీడీపీ అనుకూల మీడియా, యూట్యూబ్ ఛానళ్లలోనే తీవ్ర విమర్శలు వస్తున్నాయని సతీష్ రెడ్డి పేర్కొన్నారు.
కొంతమంది ఐఏఎస్ అధికారులు వందల కోట్ల రూపాయలు సంపాదించారని టీడీపీ అనుకూల ఛానళ్లలోనే ఆరోపణలు వస్తున్నాయన్నారు.

నిజాయితీ ఉంటే కనీసం తమ మీడియా చేసిన ఆరోపణలకైనా చంద్రబాబు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత

కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చంద్రబాబు స్వయంగా ఐఏఎస్ అధికారుల సమావేశంలో ఒప్పుకున్నారని సతీష్ రెడ్డి గుర్తుచేశారు. దోపిడీకి తలుపులు తెరిచిన కారణంగానే ఎమ్మెల్యేలు సైతం రెచ్చిపోతున్నారని అన్నారు.

సంక్రాంతి పండుగను కూడా దోపిడీ మార్గంగా మార్చారని, కోడి పందాలు, కేసినోలు, మద్యం అమ్మకాల ద్వారా వేల కోట్ల రూపాయలు కమిషన్ల రూపంలో దోచుకున్నారని తీవ్రంగా ఆరోపించారు.

అభివృద్ధి జరిగితే తానే చేశానని, అవినీతి బయటపడితే ఇతరులపై నెట్టే చంద్రబాబు విధానాన్ని మార్చుకోవాలని సతీష్ కుమార్ రెడ్డి హితవు పలికారు.

ఇవీ చదవండి: Pulivendula : పులివెందులలో టీడీపీకి ఎదురుదెబ్బ.. బీటెక్ రవి రాకతో ఊరు ఖాళీ!
Jagan Pressmeet : వైఎస్ జగన్ సుదీర్ఘ ప్రెస్ మీట్.. రైతులు, ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, లడ్డూ, పరకామణి, చంద్రబాబు కేసులు.. 

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు