HomeAndhra PradeshKurnoon crime : కర్నూల్ బస్టాండ్‌లో అంతర్రాష్ట్ర మహిళా దొంగల హల్‌చల్.. ఉచిత బస్సు పథకం...

Kurnoon crime : కర్నూల్ బస్టాండ్‌లో అంతర్రాష్ట్ర మహిళా దొంగల హల్‌చల్.. ఉచిత బస్సు పథకం ముసుగులో 9 తులాల బంగారం చోరీ

Kurnoon crime : కర్నూల్ ఏపీఎస్‌ఆర్టీసీ బస్టాండ్‌ను కేంద్రంగా చేసుకుని అంతర్రాష్ట్ర మహిళా దొంగలు చోరీలకు పాల్పడుతున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అడ్డం పెట్టుకుని ప్రయాణికుల రద్దీని అవకాశంగా మలుచుకున్న ఇద్దరు మహిళలను కర్నూల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఘటనకు సంబంధించిన కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు.

నవంబర్ 30న ఈ ఘటన చోటుచేసుకుంది. కోయిలకుంట్లకు చెందిన శారదా తన భర్తతో కలిసి హైదరాబాద్ నుంచి కర్నూల్‌కు చేరుకుని, అక్కడి నుంచి స్వగ్రామానికి వెళ్లేందుకు బస్టాండ్‌లో బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ప్రయాణికుల్లా నటిస్తూ ఇద్దరు మహిళలు బురఖాలు ధరించి వారి వద్దకు చేరుకున్నారు.

బస్సు ఎక్కే సమయంలో ఒక మహిళ ఫుట్‌బోర్డు వద్ద కావాలనే గందరగోళం సృష్టించగా, మరో మహిళ శారదా చేతిలో ఉన్న బ్యాగ్‌ను లక్ష్యంగా చేసుకుంది. రద్దీని అదునుగా తీసుకుని బ్యాగ్‌లోని వాలెట్‌ను అపహరించిన దొంగలు, అందులో ఉన్న తొమ్మిది తులాల బంగారు ఆభరణాలతో అక్కడి నుంచి పరారయ్యారు.

చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితుల కదలికలను గుర్తించి దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానితుల కోసం తమిళనాడు, కర్ణాటక, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపించారు. అయితే తొలిదశలో స్పష్టమైన సమాచారం లభించలేదు.

సంక్రాంతి పండుగ నేపథ్యంలో బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరగడంతో, దొంగతనాలను అరికట్టేందుకు నాల్గవ పట్టణ పోలీసులు మఫ్టీలో సిబ్బందిని మోహరించారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం కర్నూల్ బస్టాండ్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు మహిళలను పోలీసులు గమనించారు.

మహిళా పోలీసుల సహాయంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, మహారాష్ట్ర అకోలా జిల్లా కేంద్రానికి చెందిన రోజీ సుల్తానా, షేక్ రఫీకా అని గుర్తించారు. అకోలా పోలీసులతో సమన్వయం చేసి వివరాలు సేకరించగా, వీరు గతంలోనూ పలు బాగ్ లిఫ్టింగ్ చోరీలకు పాల్పడినట్లు తేలింది. గత ఏడాది జనవరిలో ఔరంగాబాద్‌లోనూ వీరిపై దొంగతన కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.

కర్నూల్ బస్టాండ్‌లో జరిగిన తొమ్మిది తులాల బంగారు చోరీ కూడా వీరే చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. చోరీ చేసిన బంగారాన్ని హైదరాబాద్ చార్మినార్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి విక్రయించినట్లు నిందితులు ఒప్పుకోవడంతో, ఆ సొత్తు రికవరీ కోసం ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్‌కు పంపించారు.

అరెస్ట్ అనంతరం ఇద్దరు మహిళలను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, రిమాండ్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. తదనంతరం వారిని కర్నూల్ సబ్ జైలుకు తరలించారు. మరిన్ని చోరీల కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి: Hyderabad Crime : ఇదెక్కడి దారుణం తల్లీ.. 10 నెలల కొడుక్కి విషమిచ్చి తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి.. పసి బిడ్డ ప్రాణం ఎలా తీయాలనిపించింది?
Andhra Crime : లవ్ అన్నాడు.. పెళ్లి చేసుకుంటాడేమో అనుకుంది.. తీరా డిసెంబర్ 31న రాత్రి ఏమైందంటే

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు