MLC Kavitha : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ Kalvakuntla Kavitha తన ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాను మండలి ఛైర్మన్ అధికారికంగా ఆమోదించారు. ఈ పరిణామంతో రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు మార్గం సుగమమయ్యే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది.
మండలి ఛైర్మన్ నిర్ణయం
నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి 2021లో ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత, గత ఏడాది సెప్టెంబర్ 3న తన పదవికి రాజీనామా చేస్తూ మండలి ఛైర్మన్‌కు లేఖ అందజేశారు. తాజాగా ఆ రాజీనామాను ఆమోదిస్తూ మండలి ఛైర్మన్ Gutta Sukender Reddy నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు లెజిస్లేటివ్ సెక్రటరీ అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
రాజీనామా వెనుక కారణం ఇదే
బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేయడంతోనే కవిత పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఆ సమయంలోనే తన నిర్ణయాన్ని ఆమోదించాలని ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. సోమవారం జరిగిన మండలి సమావేశంలో మాట్లాడిన కవిత భావోద్వేగానికి లోనవుతూ, తన రాజీనామాను తప్పనిసరిగా ఆమోదించాలని మరోసారి కోరారు.
పునరాలోచన సూచించినా…
కవిత తీసుకున్న నిర్ణయం భావోద్వేగంతో కూడినదని, మరోసారి పునరాలోచించుకోవాలని మండలి ఛైర్మన్ సూచించినప్పటికీ, ఆమె తన అభిప్రాయంలో మార్పు చేయలేదు. తాజా సమావేశంలోనూ అదే అభ్యర్థనను పునరుద్ఘాటించడంతో, చివరకు ఛైర్మన్ ఆమె రాజీనామాను ఆమోదించారు.
ఉప ఎన్నికకు సంకేతాలు
కవిత రాజీనామా అధికారికంగా ఆమోదం పొందడంతో, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారి తీస్తుండగా, భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ఆసక్తి నెలకొంది.
ఇవీ చదవండి: Harish Rao : కవిత ఆరోపణలపై హరీష్ రావు రియాక్షన్.. నా జీవితం..!
Kavitha Press Meet : కవిత సంచలన ప్రెస్ మీట్.. కేటీఆర్, హరీష్ రావులపై హాట్ కామెంట్స్
