HomeAndhra PradeshKadambari Jethwani: జెత్వానీ కేసులో నిజాలు దాచిపెట్టి.. ఐపీఎస్ అధికారులపై కక్షసాధింపు నిజమేనా?

Kadambari Jethwani: జెత్వానీ కేసులో నిజాలు దాచిపెట్టి.. ఐపీఎస్ అధికారులపై కక్షసాధింపు నిజమేనా?

Kadambari Jethwani: కాదంబరి జెత్వానీ కేసులో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని మీడియా సంస్థలు కేసులోని పూర్తి న్యాయపరమైన ప్రక్రియను పక్కనపెట్టి కథనాలు ప్రచురిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో సీఐడీ దర్యాప్తులో బలవంతపు వసూళ్ల అంశంపై ఛార్జిషీట్ దాఖలు కావడం కూడా ఈ కేసును మరోసారి చర్చనీయాంశంగా మార్చింది.

కోర్టు అనుమతులతోనే దర్యాప్తు.. అరెస్ట్ ప్రక్రియ

కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు 2024 ఫిబ్రవరి 2న కేసు నమోదు చేశారు. అనంతరం ప్రాథమిక దర్యాప్తులో ఫోటోలు, బ్యాంకు లావాదేవీలు తదితర ఆధారాలను సేకరించారు. అదే రోజు మేజిస్ట్రేట్ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్, పోలీసు కమిషనర్ నుంచి అంతర్‌రాష్ట్ర అనుమతులు పొందిన తర్వాతే దర్యాప్తు బృందం ముంబైకి వెళ్లింది. అక్కడ జుహూ పోలీస్ స్టేషన్ సహకారంతో స్థానిక పోలీసుల సమక్షంలో జెత్వానీ, ఆమె తల్లిని అదుపులోకి తీసుకుని, ముంబై కోర్టు నుంచి ట్రాన్సిట్ రిమాండ్ పొందిన తర్వాతే విజయవాడకు తీసుకువచ్చినట్లు కేసు రికార్డులు సూచిస్తున్నాయి.

న్యాయవాది సమక్షంలోనే పోలీసు కస్టడీ

విజయవాడకు తీసుకొచ్చిన తర్వాత జెత్వానీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టు ఆమెకు 13 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. తర్వాత ఐదు రోజుల పోలీసు కస్టడీకి కూడా కోర్టే అనుమతి ఇచ్చింది. పోలీసు కస్టడీ సమయంలో ఇద్దరు వీఆర్వోలు, నిందితుల తరఫు న్యాయవాది సమక్షంలో విచారణ జరిగిందని రికార్డులు చెబుతున్నాయి. మార్చి 12న కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా, అనంతరం బెయిల్ షరతులు సడలించుకుని జెత్వానీ ముంబైకి వెళ్లారు.

కోర్టు రికార్డుల్లో కీలక అంశాలు

కేసులో అత్యంత కీలకంగా మారిన అంశం జెత్వానీ ఇచ్చిన వాంగ్మూలాల్లోని కొన్ని వివరాలు. అందుబాటులో ఉన్న కోర్టు రికార్డుల ప్రకారం: ముంబై కోర్టులో పోలీసులపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. విజయవాడ కోర్టులో హాజరైనప్పుడు కూడా వేధింపుల అంశాన్ని ప్రస్తావించలేదు. బెయిల్ పిటిషన్, క్వాష్ పిటిషన్, పోలీసు కస్టడీ విచారణలో కూడా అలాంటి ఆరోపణలు నమోదు కాలేదు. జైలు నుంచి విడుదలైన తర్వాత కోర్టుకు వచ్చి నమూనా సంతకాలు ఇచ్చిన సందర్భంలోనూ పోలీసులపై ఫిర్యాదు చేయలేదు.

పోలీసు కస్టడీలో శారీరక వేధింపులు లేవని రికార్డు

కేసుకు సంబంధించిన పత్రాల్లో జెత్వానీ ఇచ్చిన ప్రకటనలో అత్యంత కీలకమైన అంశాలు నమోదయ్యాయి. ఆ వాంగ్మూలంలో: “There was no physical harassment during the custody period.”అంటే “పోలీసు కస్టడీ కాలంలో ఎలాంటి శారీరక వేధింపులు జరగలేదు” అని పేర్కొన్నట్లు రికార్డుల్లో ఉంది. అలాగే మరో చోట,”During the entire period… we were not taken to any guest house such as Dr. NTTPS guest house or any Government Guest House.”అంటే తమను ఎన్‌టిటీపీఎస్ గెస్ట్ హౌస్‌కుగానీ, ఇతర ప్రభుత్వ అతిథి గృహాలకుగానీ తీసుకెళ్లలేదని స్పష్టంగా పేర్కొన్నట్లు కోర్టు రికార్డులు సూచిస్తున్నాయి.

ప్రభుత్వం మారిన తర్వాతే కొత్త ఆరోపణలా?

ఈ కేసులో విమర్శకులు లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్న ఇదే. గతంలో కోర్టుల ముందు ప్రస్తావించని కొన్ని ఆరోపణలు ప్రభుత్వం మారిన తర్వాత వెలుగులోకి వచ్చాయని, వాటి ఆధారంగా ముగ్గురు సీనియర్ పోలీసు అధికారులపై కేసులు, సస్పెన్షన్ చర్యలు చేపట్టారని ఆరోపిస్తున్నారు. ఇది రాజకీయ కక్షసాధింపా? లేక కొత్త ఆధారాలపై జరిగిన చర్యలా? అనే అంశంపై ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది.

హైకోర్టు పరిశీలనపై చర్చ

పోలీసు అధికారుల ముందస్తు బెయిల్ విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన కొన్ని పరిశీలనలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. క్రైమ్ నంబర్ 469/2024 నమోదు ప్రక్రియపై న్యాయపరమైన ప్రశ్నలు ఉన్నాయని, దర్యాప్తుపై తాత్కాలిక స్టే ఇచ్చినట్లు అందుబాటులో ఉన్న ఉత్తర్వుల సారాంశంలో పేర్కొనబడింది. అయితే కేసు తుది విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై తుది నిర్ణయం రావాల్సి ఉంది.

కేసులో మరో కీలక పరిణామం

ఇదిలా ఉండగా, జెత్వానీ వ్యవహారంలో బలవంతపు వసూళ్ల ఆరోపణలపై సీఐడీ దర్యాప్తు చేపట్టి, సంబంధిత ఛార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేసింది. ఈ పరిణామం కేసుకు మరో కోణాన్ని తీసుకొచ్చింది. జెత్వానీ కేసు ప్రస్తుతం న్యాయపరమైన విచారణలో ఉంది. ఈ కేసులో రాజకీయ ఆరోపణలు, పోలీసు అధికారులపై తీసుకున్న చర్యలు, కోర్టు రికార్డులు, సీఐడీ దర్యాప్తు అన్నీ వేర్వేరు కోణాల్లో చర్చకు వస్తున్నాయి. తుది నిజానిజాలు కోర్టు విచారణ అనంతరం మాత్రమే స్పష్టమవుతాయి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోర్టు పత్రాలు, దర్యాప్తు రికార్డులు, న్యాయపరమైన ప్రక్రియపై పూర్తి సమాచారం ప్రజలకు అందించడం కూడా అంతే ముఖ్యమైన అంశంగా మారింది.

ఇవీ చ‌ద‌వండి: Kadambari Jethwani: జత్వానీ కేసులో కీలక మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన అంశాలు
Telangana Police: తెలంగాణలో వీఐపీ భద్రతపై కీలక నిర్ణయం.. మాజీ ఉన్నతాధికారులకు సెక్యూరిటీ తగ్గింపు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు