HomeAndhra PradeshBhogapuram Airport : భోగాపురం ఎయిర్ పోర్ట్‌ సర్వం సిద్ధం.. రేపే తొలి విమానం టెస్టింగ్.....

Bhogapuram Airport : భోగాపురం ఎయిర్ పోర్ట్‌ సర్వం సిద్ధం.. రేపే తొలి విమానం టెస్టింగ్.. క్రెడిట్ ఎవరిది?

Bhogapuram Airport : ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవుతోంది. నిర్మాణం తుదిదశకు చేరుకుంది. విమానాల రాకపోకలకు దాదాపు కౌంట్ డౌన్ మొదలైనట్టే. ఈ క్రమంలో చాలా ఏళ్లుగా ఉత్తరాంధ్ర వాసుల కల సాకారమవుతోంది. విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి టెస్ట్ ట్రయల్ చేయడానికి భోగాపురం రన్ వే పై తొలి విమానం ఈ నెల 4న అంటే రేపు విమానం ల్యాండ్ కానుంది. ఈ క్రమంలో భోగాపురంపై అటు రాజకీయంగానూ కాక రేగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరుగుతోంది. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంపై క్రెడిట్ తమదంటే తమదేనంటూ అటు వైయస్సార్ సీపీ, ఇటు టీడీపీ క్లెయిమ్ చేసుకుంటున్నాయి.

ఎయిర్ పోర్టుపై అసలేం జరిగింది?
2014-19 మధ్య టీడీపీ ప్ర‌భుత్వం భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏ అనుమ‌తులూ లేకుండా శంకుస్థాప‌న చేసి వ‌దిలేసిని వైఎస్సార్ సీపీ ఆరోపిస్తోంది. కానీ వైఎస్ జ‌గ‌న్ అన్ని అనుమతులు వ‌చ్చాకే ఆ ఎయిర్‌పోర్ట్ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేస్తాన‌న్నారని గుర్తు చేస్తోంది. చెప్పిన‌ట్టే అన్నీ సిద్ధ‌మ‌య్యాకే శంకుస్థాప‌న చేశారని వైసీపీ స్పష్టీకరిస్తోంది.

2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన అనుమతుల కోసం నాటి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేశారని ఆ పార్టీ చెబుతోంది. మరోవైపు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారని పేర్కొంది.

పరిహారాన్ని భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకూ ప్రకటించారని, డి.పట్టా భూములకూ జిరాయితీ భూమితో సమానంగా పరిహారాన్ని మంజూరు చేశారని వైసీపీ చెబుతోంది. దీంతో రైతులు చాలామంది పిటిషన్లను ఉపసంహరించుకున్నారని, మిగతావాటినీ సర్వోన్నత న్యాయస్థానం పరిష్కరించిందని వైసీపీ తెలిపింది.

విమానాశ్రయ నిర్వహణకు, ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2,750.78 ఎకరాలు సరిపోతాయని వైయస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 422.69 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇక 1,413 మంది రైతులకు చెందిన 1,383.39 ఎకరాల జిరాయితీ భూమి, 572 మంది లబ్ధిదారుల స్వాధీనంలో ఉన్న డీ పట్టా (అసైన్డ్‌) భూమి సేకరణ ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తి చేసింది.

విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 2,203 ఎకరాలను కేటాయించింది. టీడీపీ ప్రభుత్వం అక్కడక్కడా వదిలేసిన దాదాపు 117 ఎకరాల సేకరణ ప్రక్రియనూ వైయస్సార్‌సీపీ ప్రభుత్వమే పూర్తి చేసిందని ఆ పార్టీ పేర్కొంది. చెన్నై–హౌరా జాతీయ రహదారిపై నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్లేందుకు వీలుగా అనుసంధాన రోడ్డు, ట్రంపెట్‌ ఆకారంలో ఫ్లైవోవర్‌ నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ రెండో దశలో పూర్తి అయ్యిందని తెలిపింది.

వైఎస్సార్ సీపీ వాదన ప్రకారం.. 2014-19 చంద్రబాబు హయాంలో ఏం జరిగింది?
∗ 15 వేల ఎకరాలు అవసరమన్న ప్రచారం.
∗ రైతుల ఆందోళనతో 5 వేల ఎకరాలకు ప్రభుత్వం దిగొచ్చింది.
∗ భూసేకరణ నిబంధనలేవీ పాటించకుండా నోటిఫికేషన్‌ విడుదల.
∗ పరిహారం ఎకరాకు రూ.12.50 లక్షలేనని ప్రకటన.
∗ అయినా కొలిక్కిరాని భూసేకరణ.
∗ నిర్వాసితులకు ఏం చేయబోతోందో చెప్పనే లేదు.
∗ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో రైతుల పిటిషన్‌.
∗ దాని సంగతి ఎటూ తేలలేదు.
∗ ఎన్నికలు సమీపించడంతో అంతా తానే చేశానని చెప్పుకోడానికి 2019 ఫిబ్రవరి 14న టెంకాయ కొట్టారు.

వైఎస్ జగన్‌ పాలనలో ఏం చేశారు?
∗ ఉత్తరాంధ్ర అభివృద్ధికి దిక్సూచి కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి 2023 మే 3న నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భూమిపూజ చేశారు. అన్ని అనుమతులతో పనుల ప్రారంభానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
∗ విమానాశ్రయం నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ అధిగమించింది
∗ 2,751 ఎకరాల భూమి సేకరణ పక్కాగా పూర్తి చేసింది.
∗ కేసులు వేసిన రైతుల డిమాండ్లను పరిష్కరించింది.
∗ రెట్టింపు పరిహారం ఇచ్చింది.
∗ ఇళ్లు కోల్పోయిన 376 నిర్వాసిత కుటుంబాలకు దాదాపు రూ.80 కోట్లతో టౌన్‌షిప్ ను తలదన్నే సౌకర్యాలతో కాలనీలను నిర్మించింది.
* ఒక్కో కుటుంబానికి పునరావాస పరిహారంగా 5 సెంట్ల స్థలం, రూ.8.70 లక్షల చొప్పున మంజూరు చేసింది.
* సంబంధిత రైతులకు సుమారు రూ.18 కోట్ల వరకూ పరిహారాన్ని చెల్లించింది.
∗ దాదాపు రూ.5 వేల కోట్లతో జీఎంఆర్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు శరవేగంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.
∗ 2025 నాటికి ఏటా 60 లక్షల మంది ప్రయాణించే సామర్థ్యంతో తొలి దశ పూర్తి చేయాలనేది లక్ష్యంగా అడుగులు పడ్డాయి.
* భారీ విమానాలు దిగడానికి వీలుగా 3.8 కిలోమీటర్ల పొడవున రన్‌వే పటిష్టంగా నిర్మించేలా చర్యలు తీసుకున్నారు.
* విమానాశ్రయం చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు శరవేగంగా జరిగాయి.
* భోగాపురం నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి భోగాపురానికి పోయేందుకు ఆరు లైన్ల రహదారి నిర్మించేందుకు అడుగులు పడింది జగన్ హయాంలోనే అని వైఎస్సార్ సీపీ స్పష్టం చేస్తోంది.

అసలు ఏ పార్టీ పాత్ర ఎంత అన్నది వాస్తవాలు చూస్తే..

ప్రాజెక్టు నేపథ్యం
భోగాపురం విమానాశ్రయం, విశాఖపట్నం సమీపంలో 2,300 ఎకరాల్లో రూ.4,750 కోట్ల వ్యయంతో నిర్మాణమవుతోంది. ఇది ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి కీలకమైనది. సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉంటుంది. జీఎమ్‌ఆర్ గ్రూప్ ద్వారా పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో నిర్మాణం జరుగుతోంది. 2026 జూన్ నాటికి పూర్తికానుంది.

ప్లానింగ్ దశ (2015-2018, టీడీపీ పాలన)
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో (2014-2019) ఈ ప్రాజెక్టు ప్రతిపాదన జరిగింది. 2015లో కేంద్ర ప్రభుత్వం నుంచి సైట్ క్లియరెన్స్ పొందారు. భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది, 2019 ఎన్నికల ముందు శంకుస్థాపన చేశారు. అయితే, ఈ దశలో పూర్తి అనుమతులు (ఎన్‌వాయిరాన్‌మెంటల్ క్లియరెన్స్, ఎన్‌ఓసీలు) లేకుండానే శంకుస్థాపన జరిగిందని విమర్శలు వచ్చాయి. భూసేకరణలో కేవలం భాగమే పూర్తయింది, ఎకరాకు రూ.12.5 లక్షల పరిహారం ప్రకటించారు కానీ పూర్తిగా అమలు కాలేదు.

టీడీపీ పాత్ర: ప్రాజెక్టును ప్రతిపాదించి, ప్రాథమిక దశలు పూర్తి చేయడం. అయితే, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.

ప్రీ-కన్‌స్ట్రక్షన్ దశ (2019-2022 వైఎస్సార్‌సీపీ పాలన)
2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రాజెక్టును సమీక్షించారు. టీడీపీ కాలంలోని లోపాలను సరిచేసి, అన్ని అనుమతులు (పర్యావరణ, సివిల్ ఏవియేషన్ ఎన్‌ఓసీలు) పొందారు. భూసేకరణను 2,751 ఎకరాలకు పూర్తి చేశారు, ఎకరాకు రూ.28-36 లక్షల పరిహారం ఇచ్చారు (టీడీపీ కాలం కంటే ఎక్కువ). నిర్వాసితులకు పునరావాసం, టౌన్‌షిప్‌లు, 5 సెంట్ల స్థలాలు + రూ.8.7 లక్షల సహాయం అందించారు. 2023 మే 3న ప్రధాని మోదీతో సమావేశమై అనుమతులు తెచ్చి, జీఎమ్‌ఆర్‌తో ఒప్పందం కుదుర్చుకుని శంకుస్థాపన చేశారు.

వైఎస్సార్ సీపీ పాత్ర: ప్రాజెక్టును నిజమైన రూపంలో ముందుకు తీసుకురావడం, భూసేకరణ, అనుమతులు పూర్తి చేయడం. టీడీపీ ప్రతిపాదనను వ్యతిరేకించినట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ, వారు దానిని మెరుగుపరిచారు.

నిర్మాణ దశ (2023-ప్రస్తుతం, వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీకి మార్పు)
2023లో నిర్మాణం ప్రారంభమైంది. 2024 సెప్టెంబర్ నాటికి 40% పనులు పూర్తయ్యాయి. 2024 జూన్ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయకత్వంలో పనులు జరుగుతున్నాయి. 2024 ఆగస్టు నాటికి 36%, 2025 ఏప్రిల్ నాటికి 71% పూర్తయ్యాయి. టీడీపీ ప్రభుత్వం 2026 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదనంగా, విమానాశ్రయం సమీపంలో మెయింటెనెన్స్, రిపేర్స్ అండ్ ఓవర్‌హాల్ (ఎమ్‌ఆర్‌ఓ) సౌకర్యాన్ని ప్రతిపాదించారు, దీనిని వైఎస్సార్ సీపీ కాలంలో షెల్వ్ చేశారు.

టీడీపీ పాత్ర: నిర్మాణాన్ని వేగవంతం చేయడం, పూర్తి చేయడం.

మొత్తంగా చూస్తే…
భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి మరింత ఊతమిస్తుంది. ప్రాజెక్టు టీడీపీ ప్రతిపాదనతో మొదలైంది. వైఎస్సార్ సీపీ పాలనలో గ్రౌండింగ్ జరిగింది. దాదాపు 40 శాతం వరకు పనులు వేగంగా జరిగాయి. మళ్లీ టీడీపీ ప్రభుత్వంలో పూర్తవుతోంది. టీడీపీ పాత్ర 30-40% (ప్రతిపాదన, ప్రాథమిక భూసేకరణ), వైఎస్సార్ సీపీ పాత్ర 40-50% (అనుమతులు, పూర్తి భూసేకరణ, నిర్మాణ ప్రారంభం) ఉందని చెప్పాలి.

రాజకీయ వివాదాలు పక్కనపెట్టి, రెండు పార్టీలు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి కొనసాగించాలని ఆశిద్ధాం.

ఇవీ చదవండి: Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం-ఓడరేవులపై సీఎస్ జవహర్‌రెడ్డి సమీక్ష
CBN Reaction : జగన్ రప్పా రప్పా.. డైలాగ్‌పై చంద్రబాబు రియాక్షన్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు