HomeAndhra PradeshTirupati: మద్యం మత్తులో శ్రీగోవిందరాజస్వామి ఆలయం రాజగోపురంపైకెక్కిన దుండగుడు

Tirupati: మద్యం మత్తులో శ్రీగోవిందరాజస్వామి ఆలయం రాజగోపురంపైకెక్కిన దుండగుడు

Tirupati: తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అపచారం జరిగింది. అర్ధరాత్రి జరిగిన ఘటన కలకలం రేపింది. ఆలయం మూసిన అనంతరం ఓ అజ్ఞాత వ్యక్తి మద్యం మత్తులో ఆలయంలోకి చొరబడి, ఏకంగా గోపురం ఎక్కి హంగామా చేయడం సంచలనంగా మారింది.

కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ ఆలయంలోకి ఒక తాగుబోతు ఎలా ప్రవేశించాడంటూ భక్తులు మండిపడుతున్నారు. ఆలయ మహాద్వారం నుంచే లోపలికి వెళ్లిన ఆ వ్యక్తి, స్వామివారి దర్శనం కోసమో పూజ కోసమో కాకుండా, నేరుగా ఆలయ గోపురం ఎక్కి రచ్చ చేయడంతో సెక్యూరిటీ వైఫల్యం మరోసారి బట్టబయలైంది.

అర్ధరాత్రి సమయంలో ఆలయంలో హల్‌చల్ కనిపించడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి విజిలెన్స్ కళ్లుగప్పి ఆలయంలోకి ప్రవేశించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సమాచారం అందుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ సిబ్బంది, పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఆలయానికి చేరుకున్నారు.

గోపురంపై ఉన్న వ్యక్తిని కిందకు దిగమని పోలీసులు పలుమార్లు వేడుకున్నారు. అయితే మద్యం మత్తులో ఉన్న అతడు దిగడానికి నిరాకరిస్తూ, తనకు మద్యం బాటిల్ కావాలని వింత డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ఏకాంత సేవ పూర్తైన తరువాత ఆలయంలోకి ప్రవేశించిన ఆ వ్యక్తిని కిందకు దించేందుకు అధికారులు దాదాపు మూడు గంటల పాటు శ్రమించారు. ఈ క్రమంలో ఆలయ గోపురంపై ఉన్న కలశాలు, విద్యుత్ దీపాలు కొంత మేరకు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

చివరికి తాళ్లు, నిచ్చెనల సహాయంతో తిరుపతి ఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది గోపురం ఎక్కి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఈ ఘటనతో తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ భద్రతపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.

ఇవీ చదవండి: Tirupati : తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మాణం
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన ముమ్మాటికీ ప్రభుత్వ తప్పిదమే!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు