HomeAgriculturePattadar Passbooks : రాజముద్రతో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు.. నూతన సంవత్సర కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా...

Pattadar Passbooks : రాజముద్రతో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు.. నూతన సంవత్సర కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ ప్రారంభం

Pattadar Passbooks : రైతులకు భూ హక్కుల విషయంలో భరోసా కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, రాజముద్రతో కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి నూతన సంవత్సర కానుకగా శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా రీ సర్వే పూర్తైన గ్రామాల పరిధిలో 22 లక్షల కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

ఈ కార్యక్రమం జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు కొనసాగనుండగా, నిన్న రాష్ట్రంలోని వేలాది గ్రామాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల చేతుల మీదుగా పాసుపుస్తకాల పంపిణీ ఘనంగా ప్రారంభమైంది. గ్రామగ్రామాన సంబర వాతావరణంలో రైతులు కొత్త పాసుపుస్తకాలు స్వీకరిస్తున్నారు.

గత ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి
గత ప్రభుత్వ హయాంలో రీ సర్వే పేరుతో వివాదాలు లేని భూములను కూడా అడ్డదిడ్డంగా మార్చి, అనవసర భూ వివాదాలకు కారణమయ్యారని ముఖ్యమంత్రి విమర్శించారు. అంతేకాదు, భూ హక్కు పత్రాలపై అప్పటి సీఎం ఫోటోలను ముద్రించేందుకు ప్రజాధనాన్ని భారీగా ఖర్చు చేశారని పేర్కొన్నారు. పాసుపుస్తకాలపై బొమ్మల ముద్రణకే సుమారు రూ.22 కోట్లు ఖర్చు చేయడం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైందని తెలిపారు.

ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుతో ఊరట
గత ప్రభుత్వం తీసుకొచ్చిన అసంబద్ధమైన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ వల్ల ప్రజల్లో అభద్రత నెలకొందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా భూ హక్కుల విషయంలో ప్రజలకు మళ్లీ భరోసా కల్పించామని తెలిపారు. భూమే ప్రాణంగా జీవించే రైతులకు భూ సమస్యలు లేకుండా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

ప్రతి ఇంట్లో కొత్త ఆనందం
రాజముద్రతో జారీ చేసిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు ప్రతి రైతు ఇంట్లో కొత్త సంతోషాన్ని తీసుకొస్తున్నాయని సీఎం అన్నారు. జగనన్న బొమ్మతో ఉన్న పాత పాసుపుస్తకాల స్థానంలో అధికారిక రాజముద్రతో పాసుపుస్తకాలు అందించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
పాసుపుస్తకాల పంపిణీపై మంత్రులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేశారు.
భూ వివాదాలు లేకుండా చేయడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, దీనికి నిర్థిష్ట కాలపరిమితి పెట్టుకుని పనిచేయాలని ఆదేశించారు. ఈ విషయంలో మంత్రులు, జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఒక రోజు తాను స్వయంగా పాల్గొననున్నట్లు కూడా సీఎం తెలిపారు.

రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ కార్యక్రమం పురోగతిని ముఖ్యమంత్రికి వివరించారు. రీ సర్వే తప్పులను సరిదిద్ది, పారదర్శకంగా భూ హక్కులు కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలిపారు.

ఇవీ చదవండి: Andhra Pradesh News: గత ప్రభుత్వ భూ రక్ష పథకంలో అవినీతి జరిగిందా?
Andhra Pradesh : ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. 22ఏ సమస్యకు చెక్.. రైతన్నలకు భూములపై పూర్తి హక్కులు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు