HomeAgricultureAndhra Pradesh : ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. 22ఏ సమస్యకు చెక్.. రైతన్నలకు భూములపై...

Andhra Pradesh : ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. 22ఏ సమస్యకు చెక్.. రైతన్నలకు భూములపై పూర్తి హక్కులు

Andhra Pradesh : నూతన సంవత్సరాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయంతో ప్రారంభించింది. రాష్ట్ర ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారిన 22-A నిషేధిత భూముల సమస్య పరిష్కార దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. 22-A జాబితాలో ఉన్న ఐదు రకాల భూములను ఆ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ రెవెన్యూ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సంవత్సరంలో ఈ ఫైల్‌పై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తొలి సంతకం చేయడం విశేషంగా మారింది.

ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రైతులు, భూ యజమానులకు తమ భూములపై పూర్తి హక్కులు లభించనున్నాయి. అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ రికార్డుల్లో 22-A జాబితాలో చిక్కుకున్న భూములకు ఇప్పుడు విముక్తి కలగనుంది.

గతంలో నిర్వహించిన భూముల రీ-సర్వేలో అర్హత ఉన్న ప్రైవేట్ భూములను కూడా పొరపాటున 22-A నిషేధిత జాబితాలో చేర్చారనే ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల భూ లావాదేవీలు నిలిచిపోవడం, రిజిస్ట్రేషన్‌లు జరగకపోవడం వంటి సమస్యలు రైతులను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న కూటమి ప్రభుత్వం అర్హులైన భూ యజమానులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో తాజా నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, పూర్తిగా ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్న భూములను 22-A జాబితా నుంచి తొలగించనున్నారు. తొలి దశలో ఐదు రకాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ప్రస్తుత, మాజీ సైనిక ఉద్యోగుల భూములు, స్వాతంత్ర్య సమరయోధుల భూములు కూడా ఉన్నాయి. మిగిలిన నాలుగు రకాల భూముల అంశంపై త్వరలో గవర్నమెంట్ ఆర్డర్ (GOM)లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

సెక్షన్ 22-A అనేది 1908 రిజిస్ట్రేషన్ చట్టానికి సంబంధించిన నిబంధన. ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించిన కొన్ని రకాల భూముల రిజిస్ట్రేషన్‌ను ఈ సెక్షన్ ద్వారా నిషేధిస్తారు. 22-A జాబితాలో ఉన్న భూములపై కొనుగోలు, విక్రయాలు, రిజిస్ట్రేషన్‌లు పూర్తిగా నిలిపివేయబడతాయి. ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, ఇతర నియంత్రిత భూములను రక్షించడమే ఈ సెక్షన్ ప్రధాన ఉద్దేశ్యం.

అయితే తాజా ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, 22-A జాబితాలో ఉన్న ప్రైవేటు పట్టా భూముల విషయంలో ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు సుమోటోగా వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించాల్సి ఉంటుంది. భూ యాజమాన్యాన్ని నిర్ధారించేందుకు రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, 8A రిజిస్టర్లు, డీకేటీ పట్టాలు వంటి పత్రాల్లో ఏ ఒక్కటి సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం ఎనిమిది రకాల పత్రాల్లో ఏదైనా ఒకటి ఉన్నా చాలు 22-A నుంచి భూమిని తొలగించాలన్న ఆదేశాలు జారీ చేసింది.

భూ యజమానులను అదనపు పత్రాల పేరుతో కార్యాల చుట్టూ తిప్పకూడదని మంత్రి అనగాని అధికారులను స్పష్టంగా ఆదేశించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

ఇవీ చదవండి: Guntur: ఏ హక్కుతో సరస్వతి పవర్‌ భూములపైకి వెళ్లారు?
Dharmana Prasad Rao: అన్ని వర్గాల అభిప్రాయాలను క్రోడీకరిస్తూ భూహక్కు చట్టాన్ని పటిష్ట పరుస్తాం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు