HomeAndhra PradeshTata Ernakulam : టాటా–ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. రెండు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం

Tata Ernakulam : టాటా–ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. రెండు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం

Tata Ernakulam : విశాఖపట్నం–దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటా–ఎర్నాకుళం (18189) ఎక్స్‌ప్రెస్‌లో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులు నిద్రలో ఉండగా రాత్రి సుమారు 1.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్యాంట్రీ కారుకు ఆనుకొని ఉన్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో అగ్ని వ్యాపించింది.

ప్రమాదాన్ని గమనించిన లోకో పైలట్లు వెంటనే రైలును ఎలమంచిలి సమీప స్టేషన్‌లో నిలిపేశారు. దీంతో ప్రయాణికులు భయాందోళనలతో రైలు దిగి స్టేషన్‌ వైపు పరుగులు తీశారు. అయితే అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపే రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్టేషన్‌ పరిసరాలు దట్టమైన పొగతో నిండిపోయి భీతావహంగా మారాయి. అనకాపల్లి, ఎలమంచిలి, నక్కపల్లి ప్రాంతాల అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.

అనకాపల్లికి నాలుగు గంటల ఆలస్యంగా వచ్చిన ఈ రైలు, అక్కడి నుంచి బయలుదేరి నర్సింగబల్లి మీదుగా ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. బీ1 ఏసీ బోగీలో బ్రేక్‌లు జామ్ కావడంతోనే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

ఈ ఘటనలో బీ1 బోగీలో ప్రయాణిస్తున్న చంద్రశేఖర్ సుందర్ (70), విశాఖపట్నం వాసి సజీవ దహనమై మృతి చెందారు. మిగిలిన ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడినా, వారి సామాన్లు అగ్నికి ఆహుతయ్యాయి. బాధితుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఘటన నేపథ్యంలో విశాఖ–విజయవాడ మార్గంలో కొన్ని రైళ్ల రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. రాత్రి 3.30 గంటల తర్వాత మరో రైల్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

హోం మంత్రి అనిత రియాక్షన్
అనకాపల్లి జిల్లా పరిధిలో జరిగిన ఈ అగ్నిప్రమాదంపై హోం మంత్రి అనిత స్పందించారు. అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ఆమె, మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అధికారుల వివరణ
అసిస్టెంట్ లోకో పైలట్ శ్రీనివాస్ మాట్లాడుతూ—ఎలమంచిలి స్టేషన్‌కు చేరుకునే క్రమంలో బ్రేక్ జామ్‌ అయిందని, వెనక్కి వెళ్లి పరిశీలించగా బోగీల్లో మంటలు కనిపించాయని చెప్పారు.

డీఆర్ఎం మోహిత్ తెలిపిన వివరాల ప్రకారం—రెండు కోచ్‌లు ప్రభావితమయ్యాయి. ఆయా బోగీల ప్రయాణికులను బస్సుల్లో అనకాపల్లికి తరలించామని, అక్కడి నుంచి గమ్యస్థానాలకు పంపేందుకు కరస్పాండింగ్ కోచ్‌లు తెప్పిస్తున్నామని తెలిపారు. ఎఫెక్ట్ అయిన కోచ్‌ల ముందు భాగం సిద్ధంగా ఉందని, అదనపు కోచ్‌లను జోడించి రైలును ముందుకు పంపిస్తామని వెల్లడించారు.

ఇవీ చదవండి: Portugal : పోర్చుగల్‌లో ఘోర విషాదం.. లిస్బన్‌లో గ్లోరియా ఫునిక్యులర్‌ రైలు ప్రమాదం
Train Journey: రైలు ప్రయాణంలో హెల్త్ ఎమర్జెన్సీ? ఈ నంబర్‌కు కాల్ చేయండి!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు