Portugal : పోర్చుగల్ రాజధాని లిస్బన్‌లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ గ్లోరియా ఫునిక్యులర్ స్ట్రీట్‌కార్ బుధవారం ఘోర ప్రమాదానికి గురైంది. 140 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ రైలు వ్యవస్థలో ఒక బోగీ అదుపు తప్పి పక్కనున్న భవనాన్ని ఢీకొనడంతో 16 మంది ప్రాణాలు కోల్పోగా, 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. (Portugal)
ప్రమాదం ఎలా జరిగింది?
‘ఎల్వడోర్ డా గ్లోరియా’ పేరుతో పిలుచుకునే ఈ స్ట్రీట్‌కార్‌లో రెండు బోగీలు ఉంటాయి. ఒకటి పైకి వెళ్తుంటే మరొకటి కిందకు వస్తుంది. కేవలం 3 నిమిషాల ప్రయాణం, 265 మీటర్ల దూరం మాత్రమే అయినా పర్యాటకులకు ఇది ప్రత్యేకమైన అనుభవం. ఒక్కో బోగీలో గరిష్టంగా 41 మంది మాత్రమే ప్రయాణించగలరు.
అయితే, బుధవారం కిందకు వస్తున్న బోగీ అకస్మాత్తుగా వేగం పెంచుకొని పక్కన ఉన్న భవనాన్ని ఢీకొట్టింది. ఢీ కొట్టిన తీవ్రతకు బోగీ పూర్తిగా ధ్వంసమైంది. అందులోని ప్రయాణికుల్లో 16 మంది అక్కడికక్కడే మృతిచెందగా, పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కారణాలపై అనుమానాలు
బ్రేకులు పనిచేయకపోవడం లేదా కేబుల్ తెగిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నా, దీనిపై అధికారులు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
విదేశీ పర్యాటకులే ఎక్కువ
మృతులలో పోర్చుగల్ పౌరులతో పాటు జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్, కెనడా, మొరాకో, దక్షిణ కొరియా, కేప్‌వెర్డే దేశాలకు చెందిన పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. ‘గ్లోరియా ఫునిక్యులర్’ అంతర్జాతీయంగా పేరు గాంచిన పర్యాటక కేంద్రం కావడంతో ప్రతి సంవత్సరం వేలాది మంది విదేశీయులు దీనిని సందర్శిస్తుంటారు.
జాతీయ సంతాప దినం
ఈ ప్రమాదం నేపథ్యంలో పోర్చుగల్ ప్రభుత్వం గురువారాన్ని జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా శోకసంద్రం నెలకొంది.
ఇవీ చదవండి: Telangana Crime News : భార్యపై అనుమానంతో.. కూతురి ముందే భర్త ఘాతుకం
Konaseema Crime : రెండేళ్లలో 12 పెళ్లిళ్లు.. కోనసీమలో కిలాడీ లేడీ..!
