Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై సచివాలయ సిబ్బంది విధులకు కచ్చితంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. అధికారుల సూచనల పేరుతో ఇతర కార్యాలయాల్లో పనిచేయడం, క్షేత్రస్థాయి పరిశీలనలంటూ బయట తిరగడం ఇకపై అనుమతించబోమని తెలిపింది.
ప్రతిరోజూ నిర్ణీత సమయానికి యాప్ ద్వారా హాజరు నమోదు తప్పనిసరి అని స్పష్టం చేసింది. రీ సర్వేలో పాల్గొంటున్న కొంతమంది సర్వేయర్లకు మాత్రమే ఈ నిబంధనల నుంచి పరిమిత మినహాయింపు ఉంటుంది. మిగిలిన ఉద్యోగులందరూ తప్పనిసరిగా సచివాలయాల్లోనే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయి పనులకు వెళ్లాల్సి వస్తే, ముందుగా సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాలని రాష్ట్ర సచివాలయాల శాఖ స్పష్టం చేసింది.
ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో గ్రామ, వార్డు సచివాలయాల పనితీరుపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో సిబ్బంది పనితీరుపై ముఖ్యమంత్రి Chandrababu అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సచివాలయాల్లో ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో లేకపోతున్నారన్న ఫిర్యాదులపై సీఎం తీవ్రంగా స్పందించి, దీనిని చాలా సీరియస్‌గా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆదేశాల నేపథ్యంలోనే తాజా నిబంధనలను అమలు చేస్తున్నారు.
పరిశీలనలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిలో చాలామంది ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో అనధికారికంగా డిప్యుటేషన్‌లపై పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు ఆ విధానాన్ని సచివాలయాల శాఖ రద్దు చేసింది. అయితే రీ సర్వేలో పాల్గొంటున్న సర్వేయర్లకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. కానీ ఈ మినహాయింపు అందరికీ కాదు. జాయింట్ కలెక్టర్ సూచించిన సర్వేయర్లకు మాత్రమే వెసులుబాటు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
రీ సర్వేలో పనిచేసే సర్వేయర్లకు కూడా కొన్ని ప్రత్యేక నిబంధనలు అమలు చేయనున్నారు. వారు పని చేస్తున్న ప్రాంతంలోనే హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల వారి పనితీరును పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ చర్యలన్నీ సచివాలయాల వ్యవస్థను మరింత పటిష్టంగా మార్చడమే లక్ష్యంగా చేపట్టినవేనని స్పష్టం చేశారు.
సచివాలయాల పర్యవేక్షణను బలోపేతం చేసేందుకు మూడు దశల వ్యవస్థను ప్రభుత్వం అమలు చేస్తోంది. జిల్లా స్థాయిలో ప్రతి జిల్లాకు ఒక అధికారి చొప్పున నియమించనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి 13 జిల్లాల్లో అధికారులు బాధ్యతలు నిర్వహిస్తుండగా, మరో 13 మంది త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. పురపాలక, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు ఒక్కో అధికారి చొప్పున మొత్తం 123 మందిని కేటాయించనున్నారు.
మండల స్థాయిలో ప్రతి మండలానికి ఒక అధికారి చొప్పున 660 మంది పర్యవేక్షణ అధికారులు నియమించనున్నారు. ఇప్పటికే 600 మంది ఎంపిక పూర్తికాగా, మిగిలిన మండలాలకు వచ్చే నెల మొదటి వారంలో అధికారులు అందుబాటులోకి రానున్నారు. ఈ నియామకాలతో సచివాలయాల సేవలను ప్రజలకు మరింత సమర్థంగా అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా వెల్లడించింది.
ఇదిలా ఉండగా, గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను కూడా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇకపై వీటిని ‘స్వర్ణ గ్రామం’, ‘స్వర్ణ వార్డు’గా మార్చనున్నట్లు సీఎం చంద్రబాబు ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు ఇప్పటికే ప్రభుత్వ ఆమోదం కోసం పంపించారు.
ఇవీ చదవండి: GWS Employees: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను దూషించడం దారుణం
Grama Ward Sachivalayam: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త!
