HomeTelanganaHyderabad to Vijayawada : హైదరాబాద్ నుంచి విజయవాడ ఇక 3 గంటలే.. ఎలాగంటే

Hyderabad to Vijayawada : హైదరాబాద్ నుంచి విజయవాడ ఇక 3 గంటలే.. ఎలాగంటే

Hyderabad to Vijayawada : తెలంగాణలో రహదారి మౌలిక సదుపాయాలను కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ‘విజన్ 2047’ లక్ష్యంగా భారీ రోడ్డు అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ప్రణాళికలతో నగరాల మధ్య దూరం గణనీయంగా తగ్గనుండగా, ప్రయాణ సమయం కూడా భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.

ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా హైస్పీడ్ కారిడార్లు, 6 వరుసల రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం సుమారు 1,800 కిలోమీటర్ల మేర కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలు, గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారులు నిర్మించనున్నారు. అంతేకాదు, ప్రస్తుతం ఉన్న 46 వేల కిలోమీటర్ల గ్రామీణ రోడ్లను 1,15,000 కిలోమీటర్లకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

ప్రధానంగా హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని బెంగళూరు, విజయవాడ, నాగ్‌పూర్ వంటి మెట్రో నగరాలకు ఆరు వరుసల ఎక్స్‌ప్రెస్‌వేలు అభివృద్ధి చేయనున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టులకు సుమారు రూ. 29,057 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ భారీ ప్రణాళికల అమలుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

నిధుల సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ‘హైబ్రిడ్ యాన్యుటీ మోడ్’ విధానాన్ని అనుసరించనుంది. రహదారి ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయడం, నిధుల సమీకరణ కోసం ‘రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (RFP)’ పత్రాన్ని తయారు చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతను రోడ్లు & భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్కు అప్పగించారు.

కేవలం రహదారుల నిర్మాణమే కాకుండా, ప్రమాదాల నివారణకు స్మార్ట్ మొబిలిటీ విధానాలు కూడా అమలు చేయనున్నారు. రహదారుల వెంట అత్యాధునిక లైటింగ్, సీసీ కెమెరాలు, ఎమర్జెన్సీ సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

ఇప్పటికే హైదరాబాద్–బెంగళూరు మార్గాన్ని రూ. 5,221 కోట్లతో ఎక్స్‌ప్రెస్‌వేగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న హైదరాబాద్–విజయవాడ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ. 9,090 కోట్లు ఖర్చు చేయనున్నారు. దీని వల్ల హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణం కేవలం మూడు గంటలకే పరిమితం కానుంది.

అదేవిధంగా హైదరాబాద్–శ్రీశైలం మార్గంలో 150 కిలోమీటర్లను నాలుగు వరుసలుగా, నాగ్‌పూర్–హైదరాబాద్ మధ్య 397 కిలోమీటర్ల రహదారిని ఆరు వరుసలుగా అభివృద్ధి చేయనున్నారు. మరోవైపు ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం వరకు 234 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించనున్నారు.

ఈ రహదారుల వెంబడి ఎత్తైన చెట్లు నాటడం, వర్షపు నీటి నిల్వ వ్యవస్థలు ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకూ ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే గ్రామీణ రోడ్లను ప్రధాన రహదారులతో అనుసంధానం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

ఈ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణలో ప్రయాణం మరింత వేగవంతంగా, సురక్షితంగా మారనుందని అంచనా వేస్తున్నారు.

ఇవీ చదవండి: Telangana Weather Update: మరో రెండు రోజులు చలి పంజా.. హైదరాబాద్‌లో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం
Gold Rates: రికార్డు స్థాయికి బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతంటే?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు