Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత హోదా నిరాకరణపై తలెత్తిన వివాదం కేవలం రాష్ట్ర స్థాయి సమస్య కాదని, ఇది భారత ప్రజాస్వామ్యం ఎంతవరకు విభిన్న స్వరాలను గౌరవిస్తుందనే అసలు ప్రశ్నను లేవనెత్తుతోంది. దీనిపై ఫ్రంట్ లైన్ వెబ్ సైట్ లో సంచలన కథనం పబ్లిష్ అయ్యింది. దాని వివరాలు సంక్షిప్తంగా… (https://frontline.thehindu.com/ సౌజన్యంతో)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో 175 స్థానాల్లో కేవలం 11 సీట్లు ఉన్నప్పటికీ, అది రాష్ట్రంలో లక్షలాది ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తోంది. అయినప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం 10 శాతం సీట్ల నిబంధనను చూపిస్తూ ప్రతిపక్ష నేత హోదాను నిరాకరించింది. చట్టపరంగా ఇది సమర్థించదగ్గ నిర్ణయమే అయినా, ప్రజాస్వామ్య స్పూర్తిని బలహీనపరచిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష ప్రాముఖ్యత
పార్లమెంటరీ వ్యవస్థలో ప్రతిపక్షం శత్రువు కాదు. ప్రభుత్వాన్ని సమతుల్యం చేసే రాజ్యాంగబద్ధమైన అడ్డుగోడ. బ్రిటన్‌లోనే 1937లో ప్రతిపక్ష నేత హోదాకు చట్టబద్ధ గుర్తింపు లభించింది. భారత రాజ్యాంగం మాత్రం దీనిపై మౌనం పాటించింది. రాజ్యాంగ రచయితలు ప్రాక్టీస్, సంప్రదాయాలు, రాజకీయ నైతికత ఆధారంగా ఈ హోదా కొనసాగుతుందని భావించారు.
1952లో తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విస్తృత మెజార్టీ వచ్చినప్పటికీ, జవహర్‌లాల్ నెహ్రూ సీపీఐ నాయకుడు ఏ.కే. గోపాలన్‌ను ప్రతిపక్ష నేతగా గుర్తించడం ఆయన ప్రజాస్వామ్య నిబద్ధతకు నిదర్శనం. ఆయన భావనలో ప్రజాస్వామ్యం అనేది కేవలం మెజార్టీ పాలన కాదు, విభిన్న స్వరాలకు కూడా గౌరవం ఇవ్వాల్సిన అవసరం.
10% నియమం – చట్టమా? సంప్రదాయమా?
1977లో పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతకు చట్టబద్ధ గుర్తింపు కల్పిస్తూ కనీసం 10% స్థానాలు ఉండాలనే నిబంధనను ప్రవేశపెట్టారు. దీని ఉద్దేశం చిన్న చిన్న పార్టీలకు హోదా వెళ్ళిపోకుండా కాపాడటమే. కానీ కాలక్రమేణా ఈ నిబంధన కఠినమైన ప్రమాణంగా మారి ప్రజాస్వామ్య స్పూర్తికన్నా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకలోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ చట్టంలో అయితే ఎలాంటి శాతం ప్రస్తావన లేదు. స్పీకర్ నిర్ణయం ప్రధానమని స్పష్టంగా ఉంది. అయినప్పటికీ, 10% నియమాన్ని సాంప్రదాయంగా అమలు చేస్తూ ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హోదా నిరాకరించారు.
ప్రజాస్వామ్యంపై ప్రభావం
ఈ నిర్ణయం చట్టబద్ధంగా సరైనదే అయినా, ప్రజాస్వామ్య పరంగా పెద్ద లోటు. ప్రతిపక్ష నేత లేకుండా శాసనసభలో వాయిస్ ఉన్నా, అది సంస్థాగత గుర్తింపు లేని స్థితిలో ఉంటుంది. ఫలితంగా అసెంబ్లీ కమిటీల్లో, ముఖ్యమైన నియామకాలలో ప్రతిపక్షానికి స్థానం ఉండదు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఏకపక్షాధిపత్యంగా మార్చే ప్రమాదం ఉంది.
చరిత్రలో ప్రహసనం
గతంలో టీడీపీ పార్టీ కూడా కాంగ్రెస్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రతిపక్షంగా ఎదిగింది. అప్పట్లో ప్రతిపక్ష నేత హోదా టీడీపీకి పెద్ద బలాన్నిచ్చింది. నేటి పరిస్థితుల్లో అదే పార్టీ ప్రతిపక్ష హక్కులను నిరాకరించడం చరిత్రలో పెద్ద కామెడీగా నిలిచిపోతుంది.
జాతీయ స్థాయిలో ఉదాహరణలు
2014లో లోక్‌సభలో కాంగ్రెస్‌కు 10% స్థానాలు లేకపోవడంతో ప్రతిపక్ష నేతను గుర్తించలేదు. ఫలితంగా సీబీఐ, లోక్‌పాల్, విజిలెన్స్ కమిషన్ వంటి కీలక సంస్థల నియామకాలలో ప్రతిపక్షానికి హక్కు దక్కలేదు. ఇదే ధోరణిని ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ అనుసరించడం ఆందోళన కలిగిస్తోంది.
పరిష్కార మార్గం
ప్రతిపక్ష నేత అర్హతను 10% నుండి 5%కు తగ్గించాలి.
లేకపోతే స్పీకర్‌కు స్పష్టమైన స్వేచ్ఛ ఇవ్వాలి, అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేతను గుర్తించే విధంగా.
ముఖ్యంగా, శాసనసభ కమిటీల్లో ప్రతిపక్ష నేత తప్పనిసరిగా సభ్యుడిగా ఉండేలా నిబంధనలు రూపొందించాలి.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా నిరాకరణ చట్టబద్ధ విజయం కావచ్చు కానీ ప్రజాస్వామ్యానికి మాత్రం పరాజయం. ప్రజాస్వామ్యం అనేది కేవలం మెజార్టీ సంఖ్యల గణితం కాదు. తక్కువ సంఖ్యలో ఉన్నా, విభిన్న స్వరాలకు గౌరవం ఇవ్వడమే నిజమైన ఆత్మ. ప్రతిపక్ష హోదా అంటే కేవలం వేతనాలు, సౌకర్యాలు కాదు.. అది ప్రజాస్వామ్యానికి ఇచ్చే గౌరవం. దాన్ని నిరాకరించడం ప్రజాస్వామ్యాన్ని అసంపూర్ణం చేస్తుంది.
ఇవీ చదవండి: Jagan: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు తప్పవు.. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు
Target YS Jagan: ప్రతిపక్షాలన్నీ ఒక్కటై… జగన్‌ను ఎంత టార్గెట్ చేస్తే అంత పైకెదుగుతున్నాడా? వైఎస్సార్‌సీపీ అదే కోరుకుంటోందా?
