Renigunta Airport : తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి శ్రీవేంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చడంతో పాటు, తిరుమలకు ఐకానిక్ గా విమానాశ్రయానికి ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చేందుకు కేంద్ర విమానయానశాఖకు సిఫార్సు చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం టీటీడీ ధర్మ కర్తల మండలిలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. (Renigunta Airport)
సమావేశంలోని ముఖ్యాంశాలు
– ఇటీవల కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసిన సందర్భంగా వారి అభ్యర్థన మేరకు బెంగుళూరులోని ప్రధాన ప్రాంతంలో శ్రీవారి ఆలయం నిర్మించాలని నిర్ణయం. ఇందుకు కావాల్సిన 47 ఎకరాల స్థలాన్ని కర్ణాటక ప్రభుత్వం కేటాయించగానే ఆలయం నిర్మించేందుకు చర్యలు.
– కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డీ.కుమార స్వామి కేంద్ర ప్రభుత్వం నుండి టీటీడీకి 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించేందుకు ముందుకు రావడంతో త్వరలోనే బస్సులను తిరుమలకు తీసుకొచ్చేందుకు చర్యలు.
– కేంద్ర ప్రభుత్వం తిరుపతిలో ఏర్పాటు చేయనున్న సీఎస్ఐఆర్ ల్యాబ్ కు లీజు పద్ధతిలో టీటీడీ స్థలాన్ని కేటాయించాలని నిర్ణయం. తద్వారా టీటీడీ వినియోగించే నెయ్యి, నీరు, ఆహార పదార్థాల నాణ్యతను ఉచితంగా తనిఖీ చేసేందుకు అవకాశం.
– న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక టీటీడీ కళాశాలను ఆధునీకరించాలని నిర్ణయం.
– టీటీడీలోని లెక్చరర్ పోస్టుల భర్తీని నిలిపివేయాలని ఏపీపీఎస్సీకి సిఫార్సు. ఇప్పటికే పని చేస్తున్న 200 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యను పరిష్కరించేందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు.
– సమరసతా సేవా ఫౌండేషన్ సహకారంతో ప్రస్తుతం నిర్వహిస్తున్న అర్చకుల శిక్షణా కార్యక్రమంతో పాటు వివిధ వ్రతాలు, పూజా విధానాలలో కూడా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం.
– విద్యార్థుల్లో హైందవ సనాతన ధర్మం నేర్పిన మానవీయ విలువలను, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాల్లో శిక్షణ ఇవ్వడానికి సద్గమయ కార్యక్రమాన్ని టీటీడీకి చెందిన ఏడు పాఠశాలల్లోని దాదాపు 1600 మంది విద్యార్థులకు డే స్కాలర్ విధానంలో శిక్షణ.
– టీటీడీ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు హిందూ సనాతన ధార్మిక విలువలతో పాటు తెలుగు సాంస్కృతిక వైభవంలో శిక్షణ ఇవ్వడంలో భాగంగా మన వారసత్వం అనే కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయం.
– వరలక్ష్మీ వ్రతం పర్వదినాన తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో సౌభాగ్యం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం.
– అదేవిధంగా అక్షర గోవిందం, హరికథా వైభవం, భగవద్గీత అనుష్టాన బోధన, భజే శ్రీనివాసం, వన-నిధి, గిరి జనార్దనం, సన్మార్గం వంటి కార్యక్రమాలను నిర్వహించి జన బాహుళ్యంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు చర్యలు.
ఇవీ చదవండి: Tirumala news: తిరుమలలో అధికారుల నిర్లక్ష్యం.. ఈవో సంచలన వ్యాఖ్యలు
Lord Venkateswara: శ్రీవేంకటేశ్వర స్వామివారు ఎవరిని ఇష్టపడతారు? స్వామి గురించి రహస్యం ఇదిగో..!
Om Namo Venkatesaya: శ్రీ వేంకటేశ్వర స్వామికి శిలా రూపం ఎలా వచ్చిందంటే..
