Pigeon: పావురాలను చాలామంది ఇళ్లల్లో పెంచుకోవడం చూస్తుంటాం. చాలా ఆలయాలు, మసీదుల్లోనూ పావురాలు కనిపిస్తుంటాయి. అయితే పావురం (Pigeon) ఈకలు, రెట్టలతో మన ఆరోగ్యానికి ప్రమాదమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఒక అధ్యయనం ద్వారా వెలుగులోకి వచ్చింది. పావురం ఈకలు, రెట్టలతో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా చిన్నారులు, యువత జాగ్రత్తగా ఉండాలట.
ఈ అధ్యయనం ఢిల్లీలో ఒక అబ్బాయిపై చేశారు. పావురం ఈకలు, రెట్టలకు ఎక్కువగా గురికావడం వల్ల బాలుడు అలెర్జీకి గురి అయ్యాడు. అది అతనికి ప్రాణానికి ముప్పు తెచ్చింది. తూర్పు ఢిల్లీకి చెందిన 11 ఏళ్ల బాలుడిని సర్ గంగారామ్ ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు అధ్యయనానికి సంబంధించిన డార్టర్లు తెలిపారు. మొదట్లో అతని లక్షణాలు సాధారణ దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో బాలుడి పరిస్థితి విషమం అయ్యింది. బాలుడిని టెస్టులు చేయగా, హైపర్‌సెన్సిటివిటీ న్యుమోనైటిస్ (హెచ్‌పీ)తో బాధపడుతున్నట్లు తేలిందని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసీయూ) స్పెషలిస్టులు వెల్లడించారు. చిన్నారికి తక్షణ చికిత్స అందించాల్సిన పరిస్థితి వచ్చిందట.
హైపర్సెన్సిటివిటీ న్యుమోనిటిస్
హైపర్సెన్సిటివిటీ న్యుమోనైటిస్ అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బు అని డాక్టర్లు చెబుతున్నారు. ఈ వ్యాధితో బాధపడే వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. యువతలో ఈ పరిస్థితి సర్వసాధారణమని, అయితే పిల్లల్లో మాత్రం ఇది చాలా అరుదుగా ఉంటుందంటున్నారు. ఈ వ్యాధి ఏడాదిలో లక్ష మంది జనాభాలో ఇద్దరు నుంచి నలుగురికి వస్తుందట.
ఎలా చికిత్స అందించారంటే..
హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్‌తో బాధపడుతున్న బాలుడికి స్టెరాయిడ్ మందు ఇచ్చినట్లు వైద్యులు తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే హై ప్రెజర్ ఆక్సిజన్ థెరపీ ఇచ్చారు. ఈ థెరపీ ద్వారా, ముక్కులో ట్యూబ్‌ను చొప్పించి శరీరానికి ఆక్సిజన్ ను పంపారు. ఈ థెరపీ పిల్లల ఊపిరితిత్తులలో వాపును తగ్గించడంలో, శ్వాసను సాధారణ స్థితికి తీసుకురావడంలో దోహదపడిందని అధ్యయనంలో వెల్లడైంది. చికిత్స సానుకూల ప్రభావాలు, ఇంటెన్సివ్ కేర్ సూచనల కారణంగా బాలుడు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినట్లు చెప్పారు.
ఎందుకు వస్తుంది?
పక్షి రెట్టలు, ఈకల వల్ల కొన్ని పర్యావరణ పదార్థాలకు పదేపదే బహిర్గతం కావడం వల్ల హైపర్సెన్సిటివిటీ న్యుమోనైటిస్ పరిస్థితి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ-సిగరెట్ స్మోకర్ ద్వారా వెలువడే పొగతో కూడా అలాంటి పరిస్థితి వచ్చే చాన్స్ ఉందట. అందుకోసం పక్షి రెట్టలు, ఈకల వల్ల కలిగే అనర్థాలపై అవగాహనతో ఇలాంటి వ్యాధులను అరికట్టాలని నిపుణులు పేర్కొంటున్నారు. పావురాలు, పౌల్ట్రీ పక్షుల చుట్టూ ఉన్నప్పుడు మాస్కులు ధరించడం, ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇవీ చదవండి: Meal: అరిటాకు భోజనం తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయా?
Ayushman Bharat: 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా
Devotional tips: ఆరోగ్య సమస్యలకు సుబ్రహ్మణ్య శ్లోకం.. ఫలితం ఊహించలేరు!
Milk: పచ్చి పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదా? అందరూ తాగొచ్చా?
