Survey: స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. (Survey) అందరి ఏకాభిప్రాయం మేరకు తక్షణం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
కులగణన సంబంధిత అంశాలపై సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యం, న్యాయస్థానాలు లేవనెత్తిన పలు అంశాలపై ముఖ్యమంత్రి తన నివాసంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.
రాష్ట్రంలో ఈ నెల 6వ తేదీ నుంచి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి మరియు కుల సర్వే (Survey) ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు కోర్టు తీర్పులను తప్పకుండా అనుసరించాలని స్పష్టం చేశారు.
అందరి అభిప్రాయాల మేరకు వెంటనే బీసీ డెడికేటేడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన రేపటిలోగా ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇలాంటి కీలకమైన అంశాల్లో ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు ఉండవని, స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు.
డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు
స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు సంబంధించి న్యాయస్థానాల సూచనల మేరకు డెడికేటెడ్ (ప్రత్యేక) కమిషన్ ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వర రావును కమిషన్ చైర్మన్ గా నియమించారు.
డెడికేటెడ్ కమిషన్ నెల రోజుల్లోగా తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి బీ సైదులు (ఐఎఫ్ఎస్) కమిషన్ కార్యదర్శిగా వ్యవహరిస్తారు.
కులగణన, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించిన మీదట 24 గంటల్లోగా డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు.
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అమలయ్యేందుకు వీలుగా డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసినందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ సంఘాలు కృతజ్ఞతలు తెలియజేశాయి.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఫిషర్ మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వి.కృష్ణమోహన్ రావు, బీసీ సంఘాలకు చెందిన ఇతర నేతలు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.
డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆర్.కృష్ణయ్య, బీసీ సంఘం నేతలు సీఎంతో అన్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని, ఆ ప్రక్రియలోనే డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.
ఇవీ చదవండి: CM Revanth on Education: 21,000 మంది టీచర్లకు ప్రమోషన్లు, 34,000 మంది టీచర్ల బదిలీ!
CM Revanth Reddy: రూ.11,713.49 కోట్లు సత్వరమే విడుదల చేయాలి
CM Revanth Reddy: రాష్ట్రంలో పౌరులందరికీ హెల్త్ ప్రొఫైల్.. ఫ్యామిలీ డిజిటల్ కార్డులు
CM Revanth Reddy: కమ్మ అంటే అమ్మ లాంటిది.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
