University: రాష్ట్రంలోని యూనివర్సిటీలను నూటికి నూరు శాతం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, ఉన్నత విద్యకు (University) సంబంధించి గడిచిన పదేండ్లలో దెబ్బతిన్న వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత విద్యా మండలికి, వైస్ చాన్సలర్లకు సూచించారు.
నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ తో పాటు అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు ముఖ్యమంత్రితో జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యామండలి, వీసీలకు సీఎం దిశానిర్దేశం చేశారు.
ఎవరి ప్రభావితంతోనో వైస్ చాన్సలర్ పోస్టులకు ఎంపిక జరగలేదన్నారు. మెరిట్, సామాజిక సమీకరణల ఆధారంగానే ఎంపిక జరిగిందని స్పష్టీకరించారు. బాగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సీఎం సూచించారు.
కొంతకాలంగా యూనివర్సిటీల పట్ల విశ్వాసం సన్నగిల్లిందన్న సీఎం రేవంత్.. తిరిగి వర్సిటీల గౌరవం పెంచే దిశగా పని చేయాలని హిత బోధ చేశారు. యూనివర్సిటీలను 100 శాతం ప్రక్షాళన చేయాలని అభిప్రాయపడ్డారు. గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను విద్యార్థులు ఏళ్ల తరబడి గుర్తు పెట్టుకునేవాళ్లని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.
యూనివర్సిటీ ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేసి ప్రమాణాలను పెంచే చర్యలు మొదలు పెట్టాలని రేవంత్ సూచించారు. అవసరమైతే కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకొని నివేదిక తయారు చేసుకోవాలని చెప్పారు. వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలన్నారు.
మంచి పని చేయడానికి వైస్ ఛాన్సలర్లకి స్వేచ్ఛ ఉంటుందన్న సీఎం.. ప్రభుత్వ సహకారం ఇస్తామన్నారు. తప్పు జరిగితే ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సివస్తుందని హెచ్చరించారు. యూనివర్సిటీల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపైన దృష్టి సారించాలని, అలాంటి విద్యార్థులను గమనించి కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు.
సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. బాలకృష్ణా రెడ్డి, కార్యదర్శి ప్రొ. శ్రీరాం వెంకటేశ్, విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంతో పాటు ఆయా వర్సిటీలకు కొత్తగా నియమితులైన వైస్ చాన్సలర్లు ప్రొ. ఎం. కుమార్ (ఉస్మానియా), ప్రొ. ప్రతాప రెడ్డి (కాకతీయ), ప్రొ. జీఎన్ శ్రీనివాస్ (పాలమూరు), ప్రొ. నిత్యానంద రావు (తెలుగు), ప్రొ. అల్తాఫ్ హుస్సేన్ (మహాత్మాగాంధీ), ప్రొ. యాదగిరి రావు (తెలంగాణ), ప్రొ. అల్దాస్ జానయ్య (జయశంకర్ వ్యవసాయ), ప్రొ. రాజిరెడ్డి (కొండాలక్ష్మణ్ బాపూజీ ఉద్యాన వర్సిటీ), ప్రొ. ఉమేష్ కుమార్ (శాతవాహన), ప్రొ. సూర్య ధనుంజయ (మహిళా వర్సిటీ), ప్రొ. గోవర్దన్ (బాసర ఐఐఐటీ) ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
ఇవీ చదవండి: Law University Kurnool: నేషనల్ లా యూనివర్సిటీకి శంకుస్థాపన.. న్యాయ రాజధానికి మరో మకుటం!
CM Revanth on Education: 21,000 మంది టీచర్లకు ప్రమోషన్లు, 34,000 మంది టీచర్ల బదిలీ!
CM Revanth Reddy: రాష్ట్రంలో పౌరులందరికీ హెల్త్ ప్రొఫైల్.. ఫ్యామిలీ డిజిటల్ కార్డులు
CM Revanth on Auto drivers: ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్‌రెడ్డి అభయం.. వారి కోసం ఏం చేస్తారంటే..
