DSC Notification: నిరుద్యోగ యువతకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్రంలో మెగా డీఎస్సీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గత ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోస్టుల డీఎస్సీని రద్దు చేసిన కొత్తప్రభుత్వం.. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని (DSC Notification) ప్రకటించింది. గత ప్రభుత్వం టెట్ నిర్వహించిన నేపథ్యంలో మరోసారి టెట్ పరీక్షలు పెట్టిన కొత్త ప్రభుత్వం.. డీఎస్సీ ఉద్యోగార్థుల వినతి మేరకు నోటిఫికేషన్ ను వాయిదా వేసింది.
టెట్ కు, డీఎస్సీకి కనీసం మూడు నెలల సమయం కావాలని అభ్యర్థులు కోరారు. దీంతో టెట్ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో వాటి ఫలితాలను ఈనెల 2న విడుదల చేయాల్సి ఉంది. అయితే, సోమవారానికి ఫలితాలు వాయిదా వేసిన ప్రభుత్వం.. డీఎస్సీ నోటిఫికేషన్ పై కూడా కీలక అప్ డేట్ ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు నోటిఫికేషన్ గురించి కీలక విషయాలు ఆఫ్ ది రికార్డ్ లో వెల్లడించినట్లు సమాచారం.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) పరీక్ష ఫలితాలను ఈనెల 4వ తేదీన ప్రకటించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అమెరికా పర్యటనలో ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన వచ్చిన తర్వాత సోమవారం ఫలితాలను లోకేష్ చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు. అక్టోబర్ 3 నుంచి 21 వరకు రోజుకు రెండు విడతలుగా టెట్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
మొత్తంగా దరఖాస్తు చేసిన వారు 4,27,300 మంది అయితే, ఇందులో 86.28 శాతం ఎగ్జామ్స్ రాశారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 2న శనివారం నాడే టెట్ ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే, తుది ‘కీ’ విడుదలలో జాప్యం ఏర్పడడంతో ఫలితాల ప్రకటన వాయిదా వేసినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం టీచర్ ఉద్యోగార్థులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
గత ప్రభుత్వంలో కొత్త డీఎస్సీ లేదు
గత ప్రభుత్వం ఐదేళ్లలో డీఎస్సీ రిలీజ్ చేయకపోవడమే ఇందుకు కారణం. 1998 డీఎస్సీ పోస్టింగులు, అంతకు ముందు ప్రభుత్వంలో పరీక్షలు రాసిన వారికి పోస్టింగులు ఇచ్చింది కానీ కొత్తగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. దీంతో నిరుద్యోగులు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారన్న విశ్లేషణ ఉంది. అయితే, చంద్రబాబు సర్కార్ ఇప్పుడు సీరియస్ గా తీసుకుని మెగా డీఎస్సీని డిసెంబర్ లోపు పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది.
ఫిబ్రవరి రెండో వారంలో పరీక్షలు?
మరో మూడు నెలలు అంటే ఫిబ్రవరి చివరిలోగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేసే అవకాశాలున్నాయి. మెగా డీఎస్సీకి సంబంధించి 16,347 పోస్టులతో ఈనెల 6వ తేదీన ప్రకటన విడుదల చేసేందుకు విద్యాశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రకటన వెలువడిన తేదీ నుంచి నెల రోజులపాటు దరఖాస్తుకు అవకాశం ఇస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇవీ చదవండి: TG DSC 2024: తెలంగాణ డీఎస్సీ జాబ్స్ సాధించిన వారికి సర్కారు ఝలక్..!
AP DSC 2024: ఏపీ డీఎస్సీకి సర్వం సిద్ధం.. డిసెంబర్ 31లోగా పూర్తి?!
Telangana DSC Results: తెలంగాణ డీఎస్సీ ఫలితాల విడుదల
AP DSC New Schedule: ఏపీ డీఎస్సీ 2024 షెడ్యూల్‌లో మార్పులు.. మార్చి 20వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు
