HomeAndhra PradeshYS Jagan: విజయవాడ మునగడానికి కారణం చంద్రబాబే.. మరోసారి జగన్ ఫైర్

YS Jagan: విజయవాడ మునగడానికి కారణం చంద్రబాబే.. మరోసారి జగన్ ఫైర్

YS Jagan: ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడానికి చంద్రబాబు అర్హుడేనా? అని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాలన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని పునరుద్ఘాటించారు. 32 మంది చావుకు కారణమైన చంద్రబాబు.. వెంటనే క్షమాపణ చెప్పి ప్రజలకు మంచి చేసేలా అడుగులు వేయాలని సూచించారు. విజయవాడలోని రాజరాజేశ్వరిపేటలో వరద బాధితులను ఆయన పరామర్శించారు. వారి పరిస్థితిని చూసి చలించిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

’’వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎందుకు ఒక్కసారి ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? ఇంతకు ముందే దాన్ని ఎత్తి మూడు రోజుల ముందు వాటిని ఎత్తి ఉంటే ముందుగానే వరద నీరు వెళ్లిపోయి ఉండేవి కదా? ఒకేసారి ఉధృతంగా వచ్చే పరిస్థితి ఉండేది కాదు. లేదా దాన్ని రెగ్యులేట్ చేసి ఉంటే కనీసం అక్కడి నుంచి డైవర్షన్ చానల్, డైవర్షన్ చానల్ నుంచి పోలవరం, పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీలోకి నీళ్లు వెళ్లిపోయి అటు నుంచి సముద్రంలోకి వెళ్లిపోయి ఉండొచ్చు. కేవలం ఆ గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుందని, చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకునేదాని కోసం ఆ గేట్లు ఎత్తడం, విజయవాడ నగరాన్నిపూర్తిగా ముంచేసే కార్యక్రమం చేయడం.. ఇదీ చంద్రబాబు చేసింది.

బుడమేరు నుంచి ఇంత తీవ్రమైన వరద అదనంగా ఈ నీళ్లకు తోడై ఈ పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఏమైనా కాస్తో కూస్తో కనికరం చూపించాడా ప్రజల మీద? ఆదుకునేదాని కోసం ఏవైనా అడుగులు వేశాడా? చర్యలు తీసుకున్నాడా? అంటే ఎక్కడా లేదు. తాను ఇంట్లో ఎందుకు ఉండటం లేదు అంటే తన ఇల్లు మునిగిపోయింది కాబట్టే ఇంట్లో ఉండలేకపోయాడు. ఇంట్లో ఉండకపోవడం కూడా ఏదో పెద్ద ఘనకార్యం అన్నట్లుగా, ఇంట్లో నీళ్లు ఉన్నందుకే ఉండే పరిస్థితి లేదని చెప్పుకోలేక, అది చెబితే తనకు పబ్లిసిటీ రాదనే ఉద్దేశంతో కలెక్టర్ కార్యాలయం అంటాడు, ప్రజల కోసమే అక్కడ ఉంటున్నట్టుగా బిల్డప్ ఇస్తాడు.

నిజంగా ఎంత దుర్మార్గం అంటే.. పోనీ ఆ బిల్డప్ ఇచ్చే కార్యక్రమం అయినా సిన్సియారిటీ ఉందా అంటే అదీ లేదు. మీరే చూస్తున్నారు. ఈ కాలనీ ఈరోజు చూశారు. సింగ్ నగర్ చూస్తున్నారు. విజయవాడలో ఎక్కడికైనా వెళ్లండి, ఏ కాలనీ అయినా తీసుకోండి, ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడా రిలీఫ్ క్యాంపులు లేవు. బుధవారం నాడే ఇరిగేషన్ సెక్రటరీ డ్యాముల్లో ఉన్న ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేస్తూ కాస్తో కూస్తో ప్రతి డ్యామ్ లోనూ కొన్ని నీళ్లను కిందకు వదిలేసి ఉంటే బుధవారం రోజే రెవెన్యూ సెక్రటరీ పరిస్థితిని గమనించి, భారీ వర్షం రాబోతోందని గమనించి రెవెన్యూ సెక్రటరీ రిలీఫ్ క్యాంపులు ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసి ఉంటే, ఆ రిలీఫ్ క్యాంపుల్లో వసతులన్నీ ఈ జనాభాకు తగ్గట్టుగా ఏర్పాటు చేయడం చేసి ఉంటే, హోం సెక్రటరీ వెంటనే తాను కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ రిలీఫ్ క్యాంపులకు షిఫ్ట్ చేసే కార్యక్రమం చేసి ఉంటే.. మూడు డిపార్ట్ మెంట్లూ అనుసంధానంగా పని చేసి ఉండుంటే ఈ విపత్తు ఉండేది కాదు.

మా హయాంలో గోదావరి జిల్లాలో వరదలు వస్తే 40 వేల జనాభా ఉంటే, 36 వేల మందికి పైగా రిలీఫ్ క్యాంపుల్లో ఉండేవారు. ముందుగానే వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, కలెక్టర్లు అప్రమత్తమయ్యేవారు. వాళ్లందరికీ ముందుగానే సమాచారం ఇచ్చేవాళ్లు. వాలంటీర్లు దగ్గరుండి తలుపుతట్టి మరీ ప్రజలను రిలీఫ్ క్యాంపులకు తీసుకెళ్లేవారు. వాలంటీర్లు ప్రతి సందర్భంలోనూ చేయి పట్టుకుని ప్రజలకు కావాల్సిన సహాయ సహకారాలు అందించేవారు. మా హయాంలో ఈ మాదిరిగా ఆర్భాటం లేదు. చంద్రబాబు మాదిరిగా ఇళ్లలోకి నీరు వచ్చాయి కాబట్టి పబ్లిసిటీ చేసుకుంటూ కలెక్టర్ కార్యాలయంలోనే పడుకుంటున్నాను, రాత్రి 2 గంటలకు, 3 గంటలకు ప్రెస్ మీట్.. ఎందుకంటే నిద్ర రాదు కాబట్టి.. ఇలాంటివి ఉండేవి కాదు.

కలెక్టర్లకు క్లియర్ కట్ గా మెసేజ్ పోయేది. వారం రోజులు సమయం ఇస్తున్నా, వారం తర్వాత మేం వస్తాం, నేనే స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో వస్తాను, నేను వచ్చే సరికి ఏ ఒక్కరూ కూడా ఫలాన రకంగా మాకు నష్టం జరిగింది, కలెక్టర్ సరిగ్గా పలకలేదు, ఫలానా కలెక్టర్ మాకు సరిగ్గా పని చేయలేదన్న మాట రాకూడదని చెప్పి గట్టిగా ఆదేశాలిచ్చేవాళ్లం. నేను చెప్పిన తర్వాత కలెక్టర్లకు వెంటనే కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వెంటనే టీఆర్ 27 కింద కలెక్టర్ల అకౌంట్లలోకి డబ్బులు పడిపోయేవి. ఎంపవర్ చేసి ఆర్గనైజ్డ్ గా ముందుకు వెళ్లిపోమని సంకేతమిచ్చేవాళ్లం. వెంటనే కలెక్టర్ యాక్టివేట్ అయ్యేవాడు. వాలంటీర్లను యాక్టివేట్ చేసేవాడు. సచివాలయ సిబ్బంది యాక్టివేట్ అయ్యేది. వెంటనే ఒక వ్యవస్థ అంతా కూడా మొత్తం అడుగులు ముందుకు వేస్తూ కదులుతూ వచ్చి ప్రతి బాధితుడికీ తోడుగా ఉంటూ వాళ్లందరినీ వాళ్లందరినీ రిలీఫ్ క్యాంపులకు తీసుకుపోవడం, బాగా చూసుకోవడం జరిగిపోయేవి.

మొట్ట మొదటి సారిగా మా ప్రభుత్వంలో వాళ్లను ఊరికే ఇంటికి పంపకుండా వెళ్లేటప్పుడు రూ.2 వేలు డబ్బులు ఇచ్చి పంపడం ఒక్క మా ప్రభుత్వంలోనే జరిగింది. ఒకసారి గమనించమని అడుగుతున్నాను. అప్పట్లో జరిగిన పరిస్థితులేమిటి, అప్పట్లో ఏ రకంగా మేనేజ్ మెంట్ జరిగింది? ఇప్పుడు ఏ రకంగా మేనేజ్మెంట్ జరుగుతోందన్నది గమనించమని అడుగుతున్నాను.

ఒకసారి కృష్ణలంక వెళ్లి అక్కడ ఒకసారి గోడమీద నిలబడి చూస్తే మీ అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. మొన్న నేను వచ్చేటప్పుడు కృష్ణలంక ప్రజలంతా నన్ను ఆపి కేవలం థ్యాంక్యూ చెప్పడానికి ఆపారు. కృష్ణలంకకు ఇరువైపులా ఉన్న ఆ ఒక్కగోడ దాదాపు రూ.500 కోట్లు మా ప్రభుత్వంలో ఖర్చు చేసి కట్టినందువల్ల ఈరోజు దాదాపు 3 లక్షల మంది సేఫ్ గా ఈరోజు పడుకోగలుగుతున్నారు. నిజంగా ఆ గోడ లేకపోయి ఉంటే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండేదో అర్థం చేసుకోవడానికి కూడా ఆశ్చర్యంగా ఉండేది.

32 మంది చనిపోయారు. ఇప్పటికే పేర్లతో సహా ఫలాని వాడు ఫలాని వాడు అని ఈరోజు సాక్షి దినపత్రికలో రాశారు. ఇంకా ఎక్కువగా చనిపోయిన వాళ్లు తేలే పరిస్థితి కనిపిస్తోంది. మరి 32 మంది చావుకు కారణం ఎవరు? ఇంత దారుణంగా ఆర్గనైజేషన్ మేనేజ్ మెంట్ అనేది లేకుండా ఈ మాదిరిగా నువ్వు మేనేజ్ చేయడం అంటే అసలు ఒక ముఖ్యమంత్రిగా పదవిలో ఉండటానికి నువ్వు అర్హుడివేనా? అని ఒక్కసారి చంద్రబాబు నాయుడు తన గుండెల మీద తాను చేయి వేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సిన కార్యక్రమాలు ఏదీ తాను చేయలేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పూర్తిగా ఫెయిల్ అయిన పరిస్థితులు కనిపిస్తోంది. ఈ 32 మంది చావులకు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. ఈ చావులకు బాధ్యత తీసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పి, బాధితులకు సహాయం చేసే కార్యక్రమంలో ముందుకు అడుగులు వేయాలి. ఇది కచ్చితంగా జరగాలి.

అధికారులను సస్పెండ్ చేస్తానంటున్నాడు. అధికారులు ఎవరు, ప్రభుత్వం ఎవరు? ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అధికారులను ఆయనే దగ్గరుండి ఏ అధికారిని ఎక్కడ పోస్టింగులు వేయాలి అని ఆయనే దగ్గరుండి పోస్టింగులు కూడా పూర్తి చేశాడు. ఆయనే పోస్టింగులు ఇప్పించుకున్న అధికారుల వల్ల ఇది జరిగింది అని ఆయనే చెబుతున్నాడు సిగ్గులేకుండా అంటే అంతకన్నా సిగ్గుమాలిన పని ఏదన్నా ఉంటుందా? కేవలం ఆయన మీద వచ్చిన తప్పును కప్పిపుచ్చుకునేదాని కోసం అధికారులను బలిపశువులను చేస్తూ అధికారుల మీద వేలెత్తి చూపించే కార్యక్రమం చేస్తున్నారు. తప్పు ఎక్కడ జరిగింది అంటే మొట్ట మొదటగా చంద్రబాబు దగ్గర జరిగింది.

అసలు తుపాను వస్తోందని బుధవారం రోజు మీకు సంకేతం వస్తే, బుధవారమే ఒక రివ్యూ తీసుకుని ఉండుంటే, ఆ రివ్యూలో ఇరిగేషన్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, హోం సెక్రటరీని పిలిచి రివ్యూ తీసుకుని ఉండుంటే, స్పెషల్ ఆఫీసర్లను పెట్టి ఉండుంటే, ఎక్కడెక్కడ ఎంత వర్షం పడబోతోందన్న పరిస్థితి మీకు తెలుసు, డ్యాముల్లో, రిజర్వాయర్లలో నీళ్లు ఎంతున్నాయో మీకు తెలుసు, పై రాష్ట్రాల నుంచి ఎన్ని నీళ్లు వస్తున్నాయో మీకు తెలుసు. ఇంత సమగ్రమైన సమాచారం మీ దగ్గర ఉన్నప్పుడు కేవలం ఒక రివ్యూ తీసుకుని, ఎవరెవరికి ఏమేం పనులు చేయాలన్న బాధ్యతలు అప్పగించి ఉంటే అసలు ఈరోజు ఈ పరిస్థితి ఉండేదే కాదు కదా?

మరి కారణం నువ్వు అయినప్పుడు, నువ్వు తప్పు చేసినప్పుడు, దాన్ని హుందాగా అంగీకరించి, తప్పు చేశానని ప్రజలకు క్షమాపణ అడిగి అడుగులు ముందుకు వేయాలి కానీ తాను చేసిన తప్పునకు అధికారుల మీద వేలెత్తి చూపిస్తూ, అధికారులను తప్పుపడుతూ, నెపాన్ని అధికారులపై చంద్రబాబు తప్పించుకోవడం అంటే ఇంతకన్నా దారుణమైన వ్యక్తి ప్రపంచంలో ఎవడూ ఉండడు.

బుడమేరు మీద వెలగలేరు రెగ్యులేటర్ ఉంది. వెలగలేరు రెగ్యులేటర్ మీద లాకులు అంటే గేట్లు ఎవడు ఎత్తాడు? శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవడు ఎత్తాడు? ఎందుకు ఎత్తాడు? అది ఎత్తకపోయి ఉంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగేది. ఎందుకంటే ఆ నీళ్లు ఇలా తిరుక్కుంటూ వెళ్లి చంద్రబాబు ఇంటి వద్దకు వెళ్లేవి. బాబు ఇల్లు మునిగేది. ఎందుకంటే అక్కడి నుంచి నీళ్లు డైవర్షన్ చానల్ ద్వారా పోలవరం కెనాల్ లో పడి, పోలవరం నుంచి కృష్ణా నదిలోకి ప్రకాశం బ్యారేజ్ దగ్గర కలిసేవి. దాని వల్ల చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగేది. ఆ రెగ్యులేటర్ గేట్లను ఎత్తింది ఎవరు? ఎందుకు అర్ధరాత్రి పూట హడావుడిగా ఎత్తారు?

ఎక్కడ చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుందేమోనని ఎత్తారు. అది ఎత్తడం వల్ల ఆ గేట్ల నుంచి వచ్చిన నీళ్లు నేరుగా ఎక్కడికి వెళ్తాయి? విజయవాడకే వస్తాయి. ఇది రూట్ సార్.. మీరంతా విలేకరులు.. ఒకసారి నేరుగా వెళ్లి మీరు చూడండి. ఈరోజు వాళ్ల పాంప్లెట్ పేపర్ ఈనాడులో కూడా వచ్చింది. దయచేసి నువ్వు కూడా కాస్తో కూస్తో జర్నలిజంలో న్యాయం, ధర్మం కొంచం అయినా పాటించి వాళ్ల గెజిట్ పేపర్ ఈనాడులో వచ్చిన ఆ వార్తను ఒక్కసారి మీ టీవీల్లో కూడా పెట్టి చూపించండి. వాళ్లంతట వాళ్లే గేట్లు ఎత్తడం జరిగింది, అనివార్య పరిస్థితుల వల్ల గేట్లు పైకెత్తారట, అనివార్యకారణాల వల్ల నీళ్లు విజయవాడకు వచ్చినాయట. వాళ్లు రాసిన మాటలే. దయచేసి ఏ మాత్రం జర్నలిజంలో నిజాయితీ, న్యాయం ఉంటే దయచేసి ఆ వార్త కూడా పెట్టమని అడుగుతున్నాను.

నిర్వాసితులు దాదాపుగా ఇప్పటికే 32 మంది చనిపోయారు. ఇంకా ఎక్కువ మంది చనిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తప్పిదం వల్ల మరీ ముఖ్యంగా జరిగిన ఘటన ఇది. మ్యాన్ మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది. చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల సమయంలో తన షూటింగ్ కోసం, తాను ఒక హీరోగా కనిపించాలనే తాపత్రయంతో మనుషులందరినీ ఒకేసారి పంపించాడో, దాని వల్ల తొక్కిసలాటలో 29 మంది ఆరోజు గోదావరి పుష్కరాల్లో ఎలా చనిపోయారో, ఇప్పుడు కూడా అదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు తప్పిదం వల్ల, మ్యాన్ మేడ్ ఫ్లడ్ వల్ల ఈరోజు 32 మంది చనిపోయారు. ఇందుకు క్షమాపణ చెప్పాలి. నేచురల్ కెలామిటీ వల్ల జరిగిన తప్పిదం కాదిది, ఒక ప్రభుత్వం దగ్గరుండి స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల జరిగిన తప్పులు. ప్రతి కుటుంబానికీ కనీసం రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇచ్చి, క్షమాపణ చెబుతూ వాళ్లందరికీ లెటర్ రాయాల్సిన అవసరం ఉంది.

నిజంగా ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయంటే.. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న సామాన్లన్నీ దాదాపుగా మొత్తం అన్నీ కొట్టుకుపోయాయి. ఫ్రిజ్ లు గానీ, వస్తువులు గానీ అన్నీ పోయాయి. వాళ్లు ఇచ్చిన రిపోర్టులోనే 6 లక్షల మంది ప్రభావితమయ్యారని రాశారు. ఆ కుటుంబాలకు కనీసం ప్రతి ఇంటికీ కూడా జరిగిననష్టానికి కనీసం పరిహారం ఇస్తూ, ఎందుకంటే ప్రభుత్వం తప్పిదం వల్ల ఇది జరిగింది కాబట్టి, ప్రభుత్వం తన తప్పును ఒప్పుకుంటూ ప్రతి ఇంటికీ కనీసం రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.

అసలు ఇందులో అసత్యం అనేది ఎక్కడుంది? నేను చెప్పిన ప్రతిమాటలో ఎక్కడ అసత్యం ఉందన్నమది మీరే చెప్పండి. 28న బుధవారం తుపాన్ రాబోతోందన్న సంగతి మీకు తెలియదా? మనకే తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడుకు తెలియదా? ఐఎండీ వాళ్లు ఇచ్చిన రిపోర్టే కదా. బుధవారమే సమాచారం వచ్చినప్పుడు డ్యాములు ఎంత ఉన్నాయో చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా. పై నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి నీళ్లు వస్తున్నాయని తెలిసిందే కదా. అన్నీ డ్యాములు నిండి ఉన్నాయన్న సంగతి నీకు తెలిసిందే కదా. ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోవాల్సిందన్న సంగతి నీకు తెలిసిందే కదా. దానికి తోడు కృష్ణా నది నుంచి వచ్చే నీళ్లకు తోడు ఇక్కడ తుపాను రాబోతోందన్న సమాచారం నీకు తెలిసిందే కదా.

దాని వల్ల అదనంగా నీళ్లు వస్తాయన్న సంగతి కూడా నీకు తెలుసు కదా. మరి ఇందులో అబద్ధం ఎక్కడుంది? ఇల్లాజికల్ గా ఎక్కడుంది? అన్నీ కూడా వాస్తవాలే కదా. మరి నువ్వు స్పందించాల్సిన రీతిలో స్పందించకుండా శుక్రవారం రాత్రి నుంచి బీభత్సంగా వర్షం పడుతూ శనివారంకల్లా పూర్తిగా అతలాకుతలం అవుతున్న పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయంటే, బుధవారం, గురువారం, శుక్రవారం మధ్యాహ్నం కూడా నీకు సమయం ఉంది. ప్రజలను అలర్ట్ చేసే అవకాశం నీకు ఉంది. నీ అంతకు నువ్వే రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేసుకోలేదు. ఎందుకు రిలీఫ్ సెంటర్లు ఏర్పాటు చేయలేదు? నీకు తెలివి లేదా? ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ వాళ్లు ఎందుకు డ్యాముల్లో ఫ్లడ్ కుషన్లు పెట్టుకోలేదు? అది వాళ్ల తప్పిదం కాదా? హోం సెక్రటరీ వాళ్లు ఎందుకు ప్రజలను షిఫ్ట్ చేయలేదు? అది వాళ్ల తప్పిదం కాదా? మరి ఈ మూడు తప్పిదాలూ ప్రభుత్వం వైపు ఉన్నప్పుడు, తప్పిదం వాళ్లు చేయకపోతే మరి ఎవరు తప్పు చేశారు?’’ అని వైయస్ జగన్ ప్రశ్నించారు.

Read also: YS Jagan: ఇవి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్.. ఇంత నిర్లక్ష్యమా? : వైయస్ జగన్
YS Jagan: వక్ఫ్ బిల్లుకు మేం వ్యతిరేకం.. వైయస్ జగన్ క్లారిటీ
CBN vs YS Jagan: తగ్గేదే లేదు.. ఏపీలో హై వోల్టేజ్ రాజకీయం!
YS Jagan in Mangalagiri: పేదవాడు అప్పులపాలు కాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించాం.. మంగళగిరిలో సీఎం జగన్
YS Jagan in Puttur: 59 నెలల కాలంలోనే 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం.. పుత్తూరులో సీఎం జగన్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు