Andhra Pradesh: ఏపీలోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణ ఘటన జరిగింది. అమ్మాయిల హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరా పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థులనులు భయంతో వణికిపోయారకు. పోలీసుల సమాచారాన్ని బట్టి సుమారుగా 300 పైగా వీడియోలు నిందితుడి దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని బాయ్స్ హాస్టల్‌కు చెందిన కొంతమంది కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఈ తతంగమంతా గర్ల్స్ హాస్టల్ కు చెందిన ఒక విద్యార్థిని సహకారంతో బాయ్స్ హాస్టల్ కు చెందిన విజయ్ అనే విద్యార్థి నడిపినట్లు విద్యార్థినులు చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ అమ్మాయిలు డిమాండ్ చేస్తున్నారు. విజయ్ వద్ద ఉన్న వీడియోలు తొలగించి తమకు న్యాయం చేయాలంటూ అర్ధరాత్రి విద్యార్థునులు ఆందోళనకు దిగారు.
కళాశాలలోని విద్యార్థునులు వాష్ రూమ్ కు వెళ్లాలంటే భయంతో వణికిపోతున్నారు. ఈ ఘటనకు కారకుడైన నిందితుడు విజయ్ పై పోలీసులు చర్యలు తీసుకోవాని విద్యార్థినుల ఃతల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టేలా తక్షణ శిక్షలను అమలు చేయాలనే డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల లో జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికల హాస్టల్‌లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదని చెబుతున్నారు. పోలీసులు నిందితుల ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను విద్యార్థులు, కాలేజీ స్టాఫ్ ఎదురుగా పరిశీలన చేశారు. నేరారోపణ చేసే ఏ విధమైన అంశాలు దొరకలేదని చెబుతున్నారు. అమ్మాయిలు ఈ సమస్య గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తదుపరి విచారణ పురోగతిలో ఉందని కృష్ణా జిల్లా ఎస్పీ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేరంలో తప్పు చేసిన వారిని గుర్తించి వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
స్పందించిన సీఎం చంద్రబాబు
కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు ఉన్నాయనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారు. హాస్టల్ లో రహస్య కెమెరాలు ఉన్నాయనే విద్యార్థినుల ఆందోళనపై విచారణ జరపాలని సీఎం సూచించారు. తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ లను ఘటనా స్థలానికి వెళ్లాలని స్పష్టం చేశారు.
