HomeAndhra PradeshMumbai Actress: ముంబై నటి వ్యవహారంలో అసలేం జరిగింది? ఫక్తు రాజకీయమేనా?

Mumbai Actress: ముంబై నటి వ్యవహారంలో అసలేం జరిగింది? ఫక్తు రాజకీయమేనా?

Mumbai Actress: ముంబై నటి వ్యవహారం ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తనను వైసీపీ నేతలు శారీరకంగా, మానసికంగా హింసించారంటూ ఆమె ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. ఈ కేసులో పలువురు వైసీపీ నేతల పేర్లను ఏపీలో అధికార పక్షానికి మద్దతుగా నిలిచే మీడియాలో కొన్ని రోజులుగా హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తనపై వేధింపులకు పాల్పడ్డాడంటూ కాదంబరి ఆరోపణలు చేసింది. గత ప్రభుత్వంలో కొందరు ఐపీఎస్ లు, పోలీసులు ఇందుకు సహకరించారని ఆరోపించింది.

అయితే, మొదట్లో మౌనం పాటించిన వైసీపీ నేతలు.. రెండు రోజుల తర్వాత ఆమె వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. నిజానిజాలేంటో అన్నీ బయటకు వస్తాయన్నారు. ఆమెపై ముంబై సహా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉన్న కేసులు, బ్లాక్ మెయిల్ చేసిన ఉదంతాలు బయటకు తీసి ఆమె పూర్తిగా డబ్బు కోసమే ఇదంతా చేస్తోందని, ఏపీలో కొందరు ఐపీఎస్ లు, వైసీపీ నేతలే టార్గెట్ గా ప్రభుత్వ పెద్దలు ఈ తతంగాన్ని కావాలనే నడిపిస్తున్నారంటూ వైసీపీ చెబుతోంది. 2014 తర్వాత కుక్కల విద్యాసాగర్ తమ పార్టీలో లేడని, వైసీపీకి ఈ ఘటనను అంటగడుతూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ మండిపడుతోంది. ఈ ఘటనలు అసలేం జరిగిందో తెలియక సామాన్యులు తికమక పడుతున్నారు.

అసలేం జరిగిందంటే..
దివంగత కుక్కల నాగేశ్వరరావు కుమారుడు కుక్కల విద్యాసాగర్ కు సదరు ముంబై నటితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ మరింత దగ్గరయ్యారు. ఈ క్రమంలో కొన్ని ఫొటోలు, వీడియోలు ఆమె తన వద్ద భద్రపరుచుకుంది. వీటి ఆధారంగా ఆమె తనను డబ్బు డిమాండ్ చేసిందంటూ బాధితుడు విద్యాసాగర్ 2024లో విజయవాడ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఆమెకు సమర్పించుకున్ననగదు వివరాలు, సెల్ ఫోన్ నంబర్లతో సహా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సవివరంగా తెలిపాడు. వీరిద్దరి వ్యవహారం ఆమె తల్లిదండ్రులకు కూడా తెలుసు.

విద్యా సాగర్ ను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్న నేపథ్యంలో ఆమె తల్లిదండ్రులు, సోదరుడు కూడా ఇన్వాల్వ్ అయ్యారని విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పలుమార్లు ఆమెకు పంపిన నగదు ట్రాన్జాక్షన్ వివరాలు వెల్లడించాడు. ఇలా బ్లాక్ మెయిల్ చేస్తుండడంతో 14.05.2013న రూ.లక్ష ఆమె అకౌంట్‌కు వేశానని పేర్కొన్నాడు. అలాగే 15.02.2015న ఆమె సోదరుడికి రూ.1,26,000 ట్రాన్స్ ఫర్ చేసినట్లు వెల్లడించాడు.

ఆ తర్వాత కూడా తనను బ్లాక్ మెయిల్ చేయడం ఆపలేదని, ’’నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నాతో పాటు నా ఫ్రెండ్స్ ను కూడా రేప్ చేశావని నీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయిస్తా’’ అని బెదిరించిందని విద్యాసాగర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఆమె బ్యాంకు ఖాతాకు రూ.4,20,000 జమ చేశానని తెలిపాడు. అనంతరం 13.03.2015 నుంచి 01.04.2015 వరకు పలుమార్లు డబ్బులు సమకూర్చినట్లు తెలిపాడు.

2016 నుంచి 2017 మధ్య కాలంలో ఆమె తల్లి అకౌంట్ కు పలు దఫాలుగా రూ.3,48,000 ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ ద్వారా జమ చేశానని తెలిపాడు. తనను బ్లాక్ మెయిల్ చేసేందుకు పలు నంబర్లను కాదంబరి వినియోగించిందని కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదులో ఉంది. ఆమె ఆధార్ కార్డుల్లో వేర్వేరు డేటాఫ్ బర్త్ లు ఉండటాన్ని విద్యాసాగర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇలా వీరిద్దరి మధ్య జరిగిన తతంగాన్ని ఈ ఏడాది ప్రారంభంలోనే విజయవాడ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశాడు.

అయితే, అవతలివైపున ముంబై నటి వర్షన్ మరోలా ఉంది. తనను విద్యాసాగర్ అన్ని విధాలా మోసం చేశాడని, ఇందుకు అప్పటి ప్రభుత్వంలోని పెద్దలు, కొందరు పోలీసులు సహకరించారని చెబుతోంది. తనకు న్యాయం జరగాలని, తనపై టార్చర్ పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాజాగా ఆన్ లైన్ లో విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్ని రోజుల కిందటి నుంచి ఈ వ్యవహారాన్ని ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మీడియా సంస్థలు ప్రతి రోజూ ప్రముఖంగా ప్రస్తావిస్తూ వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కూడా ఆగ మేఘాలపై ముంబై నుంచి ఆమెను విజయవాడకు రప్పించి స్టేట్ మెంట్ ను రికార్డు చేసింది.

అయితే, మొదటి నుంచి ఆమె బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడే ప్రవృత్తి కలిగినదేనని వైసీపీ ఆరోపిస్తోంది. అందమే పెట్టుబడిగా దోపిడీలకు పాల్పడుతోందని తీవ్ర ఆరోపణలు చేసింది. దేశవ్యాప్తంగా ఆమెపై పలుకేసులు ఉన్నాయని ఉదహరిస్తోంది. ప్రేమ పేరుతో వల వేసి ఆ తర్వాత వసూళ్లకు దిగడం ఆమె నైజమని, దోపిడీ గ్యాంగ్‌లతో సంబంధాలు కలిగి ఉందని చెబుతోంది. వ్యభిచార ముఠాలతో మిలాఖత్‌ అవుతూ, తన అందచందాలతో సంపన్నులకు ఎర వేస్తోందని ఘాటుగా విమర్శలు చేస్తోంది వైసీపీ.

ఈ వ్యవహారాన్ని అడ్డు పెట్టుకుని ప్రభుత్వ పెద్దలు రాజకీయం చేస్తున్నారని, సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా డైవర్ట్ చేయడానికి రోజుకో రకంగా వైసీపీపై ఇలాంటివి అంటగడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఆ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తోంది.

విజయవాడలో ముంబై నటిపై 2024 ఫిబ్రవరిలో ఫిర్యాదు అందిందని, పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేశారని వైసీపీ తెలిపింది. ఆమె చరిత్రను మొత్తం ఏపీ పోలీసులు వెలికి తీశారని, నిర్ఘాంతపోయేలా వాస్తవాలు వెల్లడయ్యాయని పార్టీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, పుణెల్లో ఆమె బాధితులు ఉన్నారని, బయటకు చెప్పుకోలేక కొన్నిఏళ్లుగా సతమతం అవుతున్నారని వైసీపీ చెబుతోంది. ఏపీ పోలీసుల దర్యాప్తులో ఆమె బాధితులు గగ్గోలు పెట్టారని చెబుతోంది.

ఢిల్లీలో వ్యభిచార ముఠాలతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, రెండేళ్లలో ఊమేంద్ర శ్రీవాస్తవ అనే వ్యక్తికి 1,000 సార్లు ఫోన్లు చేసిందని, అమిత్‌ సింగ్‌ అనే మరో వ్యక్తికీ ఆమె క్లోజ్‌ అని వైసీపీ చెబుతోంది. అమ్మాయిలను ఎరగావేసి దోపిడీలు చేయడమే అమిత్‌సింగ్‌ పని అని వైసీపీ చెబుతోంది. ఢిల్లీకి చెందిన మరొక స్టార్‌ హోటల్‌కు పలుమార్లు ఆమె వెళ్లిందని, గడచిన రెండేళ్లలో ఆ హోటల్‌ నుంచి 500 సార్లు ఫోన్‌కాల్స్‌ చేసిందని, ఈ హోటల్‌ వేదికగా ఊమేంద్ర, అమిత్‌ సింగ్‌ల కార్యకలాపాలు జరుపుతున్నారని వైసీపీ చెబుతోంది.

ముంబై నటి కేంద్రబిందువుగా వ్యాపార, రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసే పన్నాగాలు పన్నుతున్నారని, హై ఫ్రొఫైల్‌ ఫంక్షన్లకు, ప్రముఖుల పెళ్లిళ్లు, వ్యాపార సముదాయాల ప్రారంభోత్సవాల్లో తరచుగా ఆమె కనిపిస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆ తర్వాత దోపిడీ పర్వం మొదలు పెడతారని, ఢిల్లీలో ఒక రియల్టీ ఛైర్మన్‌ అక్రమ వ్యవహారాలన్నీ ఆమె చక్కదిద్దేదని వైసీపీ తెలిపింది.

ఢిల్లీలో రియల్‌ఎస్టేట్‌ టైకూన్‌ను పడేసిందని, ఆ తర్వాత అతన్ని బెదిరించి 2022లో కోట్లాది రూపాయలు దోపిడీ చేసిందని వైసీపీ ఆరోపించింది. ఆమె కాల్స్‌ లిస్టులో పలుమార్లు అతని కాల్స్‌ ఉన్నాయని, ముంబైకి చెందిన మరొక ప్రముఖ టీవీ కంటెస్టెంట్‌ని కూడా దోపిడీ చేసిందని పేర్కొంది.

ఆసియాలోనే టాప్‌ పెయింట్స్‌ కంపెనీల్లో ఒకటైన వారసుడికీ ఆమె కాటు తప్పలేదని, అతనికీ వలవేసి, చివరకు నానా ఇబ్బందులు పెట్టిందని, పరువు పోతుందని చివరకు ఆయన అగ్రిమెంట్‌ చేసుకోవాల్సి వచ్చిందని వైసీపీ ఆరోపిస్తోంది. వసూళ్లకు పాల్పడుతున్నరోమీ భగత్‌ అనే వ్యక్తిపై ఈడీ దర్యాప్తు జరిగిందని, దోపిడీకి పాల్పడుతున్న కేసులో ఈడీ దర్యాప్తు చేసిందని, తనకు ముంబై నటి నుంచి సహకారం ఉందని రోమీ వెల్లడించారని పేర్కొంది.

ఢిల్లీ కేంద్రంగా ఒక విదేశీ నిఘా సంస్థ కోసం కూడా ముంబై నటి పనిచేసినట్టు తేలిందని, ఫేక్‌ చాట్స్, ఇమేజెస్‌, డాక్యుమెంట్స్‌ జనరేట్‌చేసి వసూళ్లకు దిగే కార్యక్రమానికి వినియోగం చేసిందని, దీనిపై పూర్తిగా దర్యాప్తు జరగాల్సి ఉందని వైసీపీ చెబుతోంది.

ఇలా రెండు వైపులా ఆధారాలతో సహా ఫిర్యాదులు చేసుకోవడంతో ఇది కేవలం రాజకీయ కోణంలో నడుస్తున్న కేసుగా భావించాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జరిగిన ఘటన వాస్తవమని, కానీ ఆపై ఆమె అత్యాశతో డబ్బు కోసం బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అంతా ఫక్తు రాజకీయమేనా?

కేవలం గత ప్రభుత్వంలో జరిగిన ఘటన కాబట్టి, ఇందులో వైసీపీ నేతగా చెప్పుకుంటున్న విద్యాసాగర్, ఇతర నేతలు ఉన్నారనే కారణం చేతనే ఈ ఘటనను పెద్దగా చేసి చూపుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఇటీవల పోస్టింగులు ఇవ్వకుండా ఐపీఎస్ లను వేధిస్తున్న ఏపీ సర్కార్.. వారిలో కొందరిని ఈ కేసులో చేర్చి శిక్ష పడేలా చేయాలన్న ఉద్దేశంతో పాటు హామీల అమలు గురించి గానీ, ప్రభుత్వ వైఫల్యాల గురించి గానీ వైసీపీ ప్రశ్నించకుండా చేయడం ఒక రాజకీయ కోణంగా చూడాలని నిపుణులు చెబుతున్నారు.

ఇందులో భాగంగానే ఒకవైపున అక్రమ సంబంధాలంటూ ఫొటోలు, వీడియోలు వెలికితీయడం, మరోవైపు వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మేయర్లు.. ఇలా అందర్నీ తమ పార్టీలోకి లాగేసుకోవడం, ఊపిరిపీల్చుకోనివ్వకుండా మాజీ సీఎం జగన్ పై ఆరోపణలు, బురదజల్లే కార్యక్రమాలు చేస్తే ఆ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అవుతుందన్న ఆలోచనతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నది మరో కోణమని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇవీ చదవండి: Andhra Pradesh: గుడ్లవల్లేరులో దారుణం.. లేడీస్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరా!
AP Liquor Policy: ఏపీలో నూతన మద్యం పాలసీకి కేబినెట్ సబ్ కమిటీ
Andhra Pradesh: ఏపీ జలవనరుల శాఖ సలహాదారుగా కన్నయ్య నాయుడు
Polavaram: పోలవరానికి రూ.12,500 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు