HomeAndhra PradeshAP Govt Schemes: సంక్షేమ పథకాలు ఆపేయడం కూడా మంచిదేనా?!

AP Govt Schemes: సంక్షేమ పథకాలు ఆపేయడం కూడా మంచిదేనా?!

AP Govt Schemes: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019-24 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా పని చేసిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో సుమారు 139 సంక్షేమ పథకాలు అమలు చేసిన సంగతి తెలిసిందే. నవరత్నాలు పేరిట మేనిఫెస్టోలో వాగ్దానాలు చేసిన ఆయన.. అధికారంలోకి రాగానే అంతకు మించిన సంక్షేమాన్ని వెల్లువెత్తించారు. పథకాలన్నింటికీ తన తండ్రి వైయస్ఆర్ పేరు, లేదా జగనన్న అంటూ తన పేరు పెట్టుకున్నారు. ఆ స్కీమ్స్ అన్నీ ప్రతి పేద గడపకూ చేరాయి. అంతలా ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవేర్ నెస్ రావడం గతంలో ఎప్పుడూ జరగలేదు. అయితే, ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆ పథకాలు చాలా వరకు ఆగిపోతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైందని, అందుకే ముందుకు వెళ్లలేకపోతున్నామంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే, పథకాలను ఆపేయడం కూడా మంచిదేనని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

* తల్లికి వందనం.. అందరితో మీటింగులు పెట్టి, బాగా చర్చించి వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తాం..
– మంత్రి లోకేష్

* ప్రస్తుతం ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం లేదు..
– మంత్రి నాదెండ్ల మనోహర్

* ఆరోగ్యశ్రీకి.. అక్కడక్కడా ఈరోజు డబ్బులు లేని పరిస్థితి నెలకొంది.. ఆస్పత్రులకు బిల్లులు రావడం లేదు.. పేషెంట్లకు ట్రీట్ మెంట్ కూడాజరగడం లేదు. ప్రస్తుతం కొన్ని చోట్ల బిల్లులు రావడం లేదు.. డబ్బులు లేవు.. ఆయుష్మాన్ భవలో చేరి రూ.5 లక్షల వైద్యం చేయించుకోండి..
– కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్

* సూపర్ సిక్స్ హామీలిచ్చాం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే భయమేస్తోంది.. ముందుకెళ్లలేం..
– ముఖ్యమంత్రి చంద్రబాబు

* ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నోట.. డబ్బులు లేవనే మాటే..

* ఖజానా ఖాళీ.. డబ్బులు సున్నా.. ఏమీ లేవు.. సీఆర్డీయే చూస్తే డబ్బులు పైసా లేవు..
– మంత్రి నారాయణ

ఇలా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, ప్రజా ప్రతినిధులందరిదీ ఒకటే మాట. గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగింది.. డబ్బులు లేవు. పథకాలు అమలు చేయలేం.. అనే సంకేతాలే వెలువడుతున్నాయి.

సీఎం చంద్రబాబుకు ఇది అలవాటేనని, అధికారంలోకి వచ్చేదాకా అమలుకు వీలు కాని అనేక హామీలు గుప్పించి గద్దెనెక్కిన తర్వాత వాటిని విస్మరించడం కామనేనంటూ వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు, ట్రోలింగ్ జరుగుతోంది.

అయితే, గత ప్రభుత్వంలో విపరీతంగా అప్పులు చేయడం, వాటిని పప్పూబెల్లాల్లాగా పథకాల పేరుతో జనానికి పంచడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా పోయిందన్నది అధికార పార్టీ వాదన. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ, అమరావతి రాజధాని నిర్మాణం చేస్తూ, సంక్షేమ పథకాలను ఆపేయడమే మంచిదంటున్నారు కొందరు విశ్లేషకులు.

ఇలా చాలా పథకాలు ఆపి ఆ డబ్బును అభివృద్ధికి కేటాయించడం ఉత్తమమని, తద్వారా జనాలను సోమరిపోతులు కాకుండా ఆపినట్లవుతుందంటున్నారు. అయితే, సంక్షేమాన్ని ఆపినంత మాత్రాన ఒక్కసారిగా హైదరాబాద్ లాంటి నగరం నిర్మించడం సాధ్యం కాదు. ఇది కంటిన్యూ ప్రాసెస్ అని, అవసరమైన మేరకు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలకులు పరిపాలించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

గతంలో వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇదే జరిగిందని గుర్తు చేస్తున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఉచిత విద్యుత్, పేదవాడికి ఆరోగ్యశ్రీ, 108, 104 అంబులెన్సులు, కాలేజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్.. ఇలా కేవలం అవసరమైన మేరకే సంక్షేమ పథకాలను అమలు చేశారని గమనించాలంటున్నారు. కానీ జగన్ హయాంలో ఇచ్చిన హామీలు, ఇవ్వని వాటికి కూడా పెద్ద ఎత్తున వ్యయం చేశారని, అందుకే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్న ఆరోపణలు ఎదుర్కొన్నారని చెబుతున్నారు.

మొత్తంగా చూస్తే, పథకాల లబ్ధిదారులకు కాస్త బాధగా ఉన్నప్పటికీ, రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల బంగారు భవిష్యత్తు దృష్ట్యా ఉచితాలను కట్ చేయడమే మంచిదన్న అభిప్రాయాన్ని కొందరు వెలిబుచ్చుతున్నారు. తద్వారా మరింత అప్పులపాలు కాకుండా, రాష్ట్రాన్ని గాడినపెట్టి, భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు, పరిశ్రమల స్థాపన జరిగేలా పాలనను ముందుకు తీసుకెళ్లాలని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇవీ చదవండి: The Raja Saab: రాజా సాబ్ గ్లింప్స్.. డార్లింగ్ ప్రభాస్ లుక్ అదిరిందిగా..!
Amazon Fresh: ఇండియాలో అమెజాన్ ఫ్రెష్ జోష్.. 130కి పైగా పట్టణాల్లో విస్తరణ
Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఉన్నాయా? ఏవి తినాలి? ఏవి తినకూడదు?
Andhra Pradesh: సూపర్ సిక్స్ అంటే భయమా? ముందే చెప్పాలి కదా సార్?
Chief Ministers: ముఖ్యమంత్రులంటే ఇంద్రభవనాల్లోనే ఉండాలా? సాధారణ జీవితం గడపలేరా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు