Andhra Pradesh: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తుంటే ఆవేదన, బాధ కలుగుతున్నాయి.. మనం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు, ఖజానా దుస్థితి చూస్తే భయం వేస్తోంది.. ముందుకెళ్లలేని పరిస్థితి.. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా అసెంబ్లీలో వ్యాఖ్యానించారు.
* సూపర్ సిక్స్ హామీలపై సీఎం చంద్రబాబు మడతపేచీ
* రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ బీద పలుకులు
* ఇచ్చిన హామీలు అమలు చేయలేమంటూ సంకేతాలు!
* కనీసం పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని దుస్థితి
* 2019లో జగన్ గద్దెనెక్కేసరికి ఖజానాలో ఉన్నవి రూ.100 కోట్లే.. అయినా పూర్తి బడ్జెట్
* ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టో అమలు చేయాలంటే ఏడాదికి రూ.1.50 లక్షల కోట్లు కావాలి!
* అప్పటికే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఈ విషయాలు తెలియవనుకోవాలా?
* గతంలో సంక్షేమానికి ఏటా సుమారు రూ.72 వేల కోట్లు వెచ్చించిన జగన్ సర్కార్
* బాబు ఇచ్చిన హామీలు అమలు కావంటూ ముందే చెప్పిన మాజీ సీఎం జగన్
* ఇప్పుడు తు.చ. తప్పకుండా హామీలను గాలికొదిలేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
* 2014-19 మధ్య కూడా సేమ్ సీను రిపీట్
* ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో వైయస్ఆర్, ఆ తర్వాత జగన్ మాత్రమే!
* జగన్ ఇచ్చిన పథకాలు, సంక్షేమం ఎవర్ గ్రీన్ అని సుస్పష్టం
ముందుకెళ్లలేని పరిస్థితి అంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు అర్థం.. ఇచ్చిన హామీలు విజయవంతంగా అటకెక్కించేయడమేనన్న విశ్లేషణలు అప్పుడే ఊపందుకున్నాయి. మరోవైపు గతంలో సీఎం వైయస్ జగన్ అమలు చేసిన సంక్షేమం, పథకాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులు అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ చేసిన పాలన, చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలుకు సాధ్యం కావో చెప్పిన విషయాన్నీ రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
బడ్జెట్ ఎందుకు పెట్టలేదు?
రాష్ట్ర అప్పులు రూ.15 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్లు, రూ.12 లక్షల కోట్లు…. ఇదీ గత జగన్ సర్కార్ హయాంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితో సహా టీడీపీ ప్రముఖ నేతలు చేసిన ప్రధాన ఆరోపణ. అయితే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం ఇప్పటికే చాలా సార్లు రాష్ట్ర అప్పులపై స్పష్టంగా ప్రకటనలు చేశారు. పార్లమెంటులోనూ సమాధానాలు ఇచ్చారు. రీసెంట్ గా గవర్నమెంట్ మారినప్పుడు కూడా ఏపీ అప్పులు రూ.4,42,442 కోట్లు అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టీకరించారు. కానీ, ఇప్పుడు రూ.15 లక్షల కోట్ల అప్పు అని ఆరోపించిన టీడీపీ, బీజేపీ నాయకులు ఆ టార్గెట్ ను రీచ్ కాలేకపోతున్నారు. అందుకే అప్పులు, ఆదాయం, రాష్ట్ర బడ్జెట్ లాంటి అంశాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెడితే సూపర్ సిక్స్ హామీలకు కేటాయింపులు చేయాల్సి వస్తుంది. అది సాధ్యం అయ్యే పని కాదని తెలిసే ప్రభుత్వ పెద్దలు సాకులు చెబుతున్నారన్నది పొలిటికల్ విశ్లేషకుల మాట.
ఇన్ని హామీల అమలు సాధ్యమేనా?
టీడీపీ మేనిఫెస్టో అమలు చేయాలంటే సుమారు ఏటా సంక్షేమం, కొన్ని తప్పక అమలు చేయాల్సిన కార్యక్రమాల ఖర్చు వెరసి ఏటా రూ.1.50 లక్షల కోట్ల దాకా అవుతుందన్నది అంగీకరించాల్సిన అంశం. అయితే గత ప్రభుత్వంలో జగన్ మాత్రం ఏటా సంక్షేమానికి రూ.72 వేల కోట్లు వెచ్చించారు. అప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని విమర్శలు ఎదుర్కొన్నారు జగన్. కానీ, జగన్ కు మించి సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి చేస్తానని లెక్కకు మించిన హామీలిచ్చి కూటమితో కలిసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. కానీ చంద్రబాబు సంపద సృష్టిస్తారన్న మాటలు అందరి నోటా వినిపించాయి. మరి ఇప్పుడు బడ్జెట్ కూడా పెట్టలేకపోతున్నారంటే, సంపద ఎలా సృస్టిస్తారని విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అపార అనుభవం.. ఆర్థిక పరిస్థితి తెలియదా?
చంద్రబాబుకు ఇప్పటికే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం సొంతం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి స్థాయిలో స్పష్టత ఉంటుందనుకోవడంలో తప్పు లేదు. మరి తెలిసి కూడా కేవలం అధికారంలోకి రావడమే పరమావధిగా నెరవేర్చలేని హామీలు ఇచ్చారా? అంటే అవుననే సమాధానం వస్తుంది. చంద్రబాబు ఇస్తున్న హామీలు అమలు చేయడం అసాధ్యమంటూ వైయస్ జగన్ ఇప్పటికే అసెంబ్లీ వేదికగా, ప్రెస్ మీట్లలో, మేనిఫెస్టో ప్రకటన సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరీ కుండబద్ధలు కొట్టారు. ఇప్పుడు అదే నిజం అవుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో జగన్ గద్దెనెక్కే సమయానికి ఖజానాలో ఉన్న సొమ్ము కేవలం రూ.100 కోట్లే. కానీ అప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఎక్కడా సంక్షేమం ఆగకుండా అమలు చేశారు. అయితే, ఇప్పుడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 12కు రెండు రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం నుంచి డబుల్ డెవల్యూషన్ ద్వారా రూ.5,655.72 కోట్ల సొమ్ము రాష్ట్ర ఖజానాలోకి వచ్చిన సంగతి వాస్తవం. పైగా ఎన్నికల సందర్భంగా ఆపిన ఆసరా, ఇతర చిన్నాచితక అమౌంట్ కూడా పోలింగ్ ముగిసిన వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అయిన మాట కూడా వాస్తవం.
2014లోనూ ఇంతే..
గతంలో 2014 ఎన్నికల సమయంలోనూ మూడు పార్టీలు జతకట్టి కూటమిగా వచ్చి చంద్రబాబు విజయం సాధించారు. 600కుపైగా హామీలిచ్చి వాటిని నిలబెట్టుకోలేక చివరకు మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి కూడా డిలీట్ చేసిన చరిత్ర ఎవరూ మర్చిపోరు. కానీ పదేళ్లు తిరిగే సరికి మళ్లీ అవే హామీలకు ఆశపడి ప్రజలు ఓట్లేసి గెలిపించారు. మొదటి కేబినెట్ లో, మొదటి వంద రోజుల్లో నెరవేరుస్తామని చెప్పిన హామీలకు కూడా ఇప్పటికీ అతీగతీ లేదు. డీఎస్సీ వాయిదా వేయడం, నిరుద్యోగ భృతి, అమ్మకు వందనం, మత్స్యకార భరోసా, 19 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారికి నెలకు రూ.1500, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 20 లక్షల ఉద్యోగాల కల్పన… ఇలా అన్నింటిపైనా దాటవేత వైఖరే తప్ప మరోటి లేదని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
నాడు, నేడు.. కేంద్రం అనుకూలమే..
2019లో అధికారంలోకి వచ్చిన జగన్.. కేంద్రంతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. అందుకే ఆర్థికంగా, రాజకీయంగా ఆయనకు బీజేపీ మద్దతుగా నిలిచింది. అవసరమైన మేరకు నిధుల్ని ఇస్తూ వచ్చింది. ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఇది దోహదపడింది. ఏటా క్రమం తప్పకుండా సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధుల్ని వెచ్చిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఇటువైపున ఏర్పడింది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సీట్లు రాకపోవడం వల్ల చంద్రబాబు, నితీష్ కుమార్ కీలకంగా మారారు. అందుకే తాజా బడ్జెట్ లో ఏపీ, బిహార్ కు పెద్ద పీట వేస్తూ నిధులు, అప్పులు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ కేంద్రం సాన్నిహిత్యంగా మెలిగింది. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం… ఇచ్చిన హామీలపై వెనకడుగు వేసేలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే భయం వేస్తోందంటూ కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఏతావాతా చూస్తే.. ఇచ్చిన హామీలను మ్యాగ్జిమమ్ నిలబెట్టుకోవడంలో నాడు వైయస్ఆర్, నేడు వైయస్ జగన్ మాత్రమే అన్న అంశం ఒప్పుకోక తప్పదు. రేపు ఈ రికార్డును ఎవరైనా చెరపగలరా? అన్నది వేచి చూడాల్సిందే.
ఇవీ చదవండి: Budget 2024: కేంద్ర బడ్జెట్ విశేషాలు.. 2024-25లో కేటాయింపులు, ఖర్చులు ఇవీ!
YS Jagan: ఢిల్లీలో ధర్నాపై వైయస్సార్‌సీపీ సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: కమ్మ అంటే అమ్మ లాంటిది.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Indian 2: సేనాపతికి ఊహించని షాక్.. వారం రోజుల కలెక్షన్లు ఇంతేనా?
Puja Khedkar Controversy: పూజా ఖేడ్కర్ కాంట్రవర్సీ ఏంటి? సివిల్ సర్వెంట్లను నియంత్రించే నియమాలు ఎలా ఉంటాయంటే..
