Smoking: ధూమపానం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తెలిసినా చాలా మంది మానలేకపోతుంటారు. ఒక అలవాటుగా మారిపోయి ఉంటుంది. ఒక్కసారి పొగ తాగడం అలవాటు అయితే, ఇక మానుకోవడం చాలా కష్టమని చెబుతుంటారు. ఆడ, మగతో సంబంధం లేకుండా ప్రస్తుతం చాలా మంది ధూమపానానికి అలవాటు పడుతున్నారు.
క్యాన్సర్, స్ట్రోక్, ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహం, గుండె జబ్బులు, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, క్రానిక్ బ్రోన్కైటిస్, ఎంఫిసెమా వంటి సమస్యలకు స్మోకింగ్ పొగ తాగడం ప్రధాన కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటు ఆడ, మగ అనే తేడా లేకుండా పునరుత్పత్తి ఆరోగ్యంపైనా తీవ్రమైన ప్రభావం చూపుతుందంటున్నారు. ధూమపానం స్త్రీ, పురుష పునరుత్పత్తి వ్యవస్థలను బాగా దెబ్బతీస్తుందని, గర్భం దాల్చే అవకాశాలను సన్నగిల్లేలా చేస్తుందని చెబుతున్నారు.
స్మోకింగ్ చేయని వారితో పోలిస్తే పొగతాగేవారికి వంధ్యత్వం ప్రమాదం 14% అధికంగా ఉంటుందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. సెకండ్‌హ్యాండ్ స్మోక్‌కి గురైన వారిలో (పక్కన సిగరెట్ తాగుతుంటే తాగని వాళ్లు పీల్చేవారు) ఈ ప్రమాదం 18 శాతం పెరుగుతుంది. ఎక్కువగా స్మోకింగ్ చేసే భాగస్వామితో కలిసి జీవితం పంచుకోవడం వల్ల మహిళలకు గర్భధారణ చాన్సులు 34 శాతం తగ్గే ప్రమాదం ఉందట, ముఖ్యంగా పురుషుల్లో ఈ అలవాటు కారణంగా అనేక సమస్యలు వేధిస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.
అంగస్తంభన ప్రాబ్లమ్
పొగాకుతో తయారు చేసిన పొగను పీల్చడం వల్ల రక్తనాళాలను దెబ్బతీసే రసాయనాలు బాడీలో చేరుతాయి. ఇవి పురుషాంగానికి, రక్త ప్రసరణకు ఆటంకం కలిగేలా చేస్తాయి. దీంతో అంగస్తంభన లోపం తలెత్తుతుంది.
స్పెర్మ్ కౌంట్ తగ్గుదల
పొగ తాగడం వల్ల మగవాళ్ల స్పెర్మ్ కౌంట్ గణనీయంగా తగ్గిపోతుంది. స్పెర్మ్ మోటిలిటీ, మార్ఫాలజీలో అబ్‌నార్మాలిటీస్ వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం కూడా సన్నగిల్లుతుంది.
హార్మోన్లపై ప్రభావం
స్మోకింగ్ అలవాటు వల్ల పురుషుల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీంతో టెస్టోస్టిరాన్ స్థాయిలు ప్రభావితం అవుతాయి. ఇది స్పెర్మ్ ఉత్పత్తికి, మొత్తం లైంగిక ఆరోగ్యానికి చాలా కీలకం.
స్త్రీ పునరుత్పత్తిపై ప్రభావం
స్మోకింగ్ అలవాటు మహిళల్లో అండాల సంఖ్య, నాణ్యతను తగ్గించేస్తుంది. గర్భస్రావాల ప్రమాదాన్ని పెరిగేలా చేస్తుంది. ధూమపానం చేసే స్త్రీలు త్వరగా మెనోపాజ్‌దశను ఎదుర్కొంటారు. ఇది సంతానోత్పత్తిని తగ్గించడమే కాకుండా హార్మోన్ల హెచ్చుతగ్గులతో సంబంధం ఉన్న ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని కూడా పెరిగేలా చేస్తుంది. పొగ తాగడం ఎక్టోపిక్ గర్భం ప్రమాదాన్ని పెంచుతుంది.
ఐవీఎఫ్ చేయించుకునే వారిపై..
ధూమపానం చేసే మహిళలకు ఐవీఎఫ్ సక్సెస్ రేటు చాలా తక్కువ. పిండ నాణ్యతతో సవాళ్లు ఎదురవుతాయి. స్మోకింగ్ హానికరమైన ప్రభావాలు పిండం నాణ్యతను విస్తరిస్తాయి. ఫలితంగా ఇంప్లాంటేషన్ తగ్గుతుంది. గర్భస్రావం ముప్పు పెరిగే అవకాశం ఉంటుంది. అండాశయ పనితీరును, సంతానోత్పత్తి మందుల ప్రతిస్పందన రేటు తగ్గుతుంది. పొగ తాగేవారిలో ఐవీఎఫ్ ద్వారా సాధించిన గర్భాలకు చాలా రకాల సమస్యలు వస్తాయి. బిడ్డ నెలలు నిండక ముందే జన్మించే అవకాశాలుంటాయి. బరువు తక్కువతో పుట్టడం, నియోనాటల్ ఆరోగ్య సమస్యలు వంటివి కూడా ఎదుర్కోక తప్పదు.
ఇతర సమస్యలు..
సిగరెట్లు తాగే మగ, ఆడవారు లింగ భేదం లేకుండా లైంగిక సమస్యలు ఎదుర్కోక తప్పదు. లిబిడో తగ్గిపోవడం, ఉద్రేకం, ఉద్వేగంతో ఇబ్బందులు తలెత్తుతాయి. మొత్తానికి ధూమపానం ఇద్దరిలోనూ వంధ్యత్వ సమస్యలను పెరిగేలా చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినడం, లైంగిక ప్రవర్తనలో మార్పుల వల్ల హెచ్ఐవీ, లైంగికంగా సంక్రమించే వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి.
ఇవీ చదవండి: Early morning Tea: ఉదయాన్నే పరగడుపున టీ తాగుతున్నారా? ఆరోగ్యానికి ఎంతటి నష్టమో తెలుసా?
Egg benefits: ఇది మీకు తెలుసా? గుడ్డుతో పాటు పెంకులు తిన్నా ఆరోగ్యమేనట..
Pasupu Kommulu: పసుపు కొమ్ముల ప్రయోజనాలు.. ఆరోగ్యానికి ఎంతటి మేలు చేస్తాయో తెలుసా?
Beetroot: బీట్‌రూట్‌తో మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు.. ఏయే విటమిన్లు ఉంటాయంటే..
