Food safety: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆహార భద్రతను పెంచే లక్ష్యంతో న్యూఢిల్లీలోని భారత ఆహార భద్రత, నియంత్రణ శాఖ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)తో అవగాహన ఒప్పందాన్ని ఇప్పటికే కుదుర్చుకున్నామని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, ఫుడ్ సేఫ్టీ కమిషన్ తెలిపింది. దీని వల్ల రూ.80 కోట్ల నిధులు సమకూరాయని, వీటిని ఆంధ్రప్రదేశ్‌లో ఫుడ్ ల్యాబ్‌లు, మొబైల్ ఫుడ్ ల్యాబ్‌ల ఏర్పాటుకు, ఆహార భద్రత పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడానికి ఉపయోగిస్తామని కమిషనర్ డాక్టర్ సలిజామల వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది పనితీరు, ఫుడ్ ల్యాబ్‌లు, వాటర్ ల్యాబ్‌ల పనితీరును ఇటీవల సమీక్షించిన కమీషనర్ పలు అంశాలపై ఆరా తీశారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్ణీత వ్యవధిలో నమూనాలను తీసుకుని పరీక్షించాలని ఆయన సూచించారు. నిషేధిత ఫుడ్ కలర్స్, సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడకం, వంటనూనెల పునర్వినియోగం వల్ల క్యాన్సర్ వస్తుందని, వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రత చట్టం 2006ను సమర్థవంతంగా అమలు చేయడం కోసం ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. వంట నూనెల పునర్వినియోగాన్ని తగ్గించడం కోసం, ఆహార భద్రతా నియమాలు, నిబంధనలను సమర్థవంతంగా అమలు చేసేందుకు రూపొందించిన విధానాల అమలుపై దృష్టి పెడతామని చెప్పారు.
పరిశుభ్రతకు రేటింగ్ ఇవ్వడం, ఆరోగ్యకర ఆహారంపై బోధన, క్యాంపస్ లలో అవగాహన, శుభ్రమైన ఫుడ్ హబ్‌లు, శుభ్రమైన కూరగాయల హబ్‌లు వంటి కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తామన్నారు. ఆర్‌యూసీఓ (వంటనూనె పునర్వినియోగం) కార్యక్రమాలు, అలాగే సింథటిక్ ఫుడ్ కలర్స్ కోసం ప్రత్యేక డ్రైవ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వంటనూనె పునర్వినయోగంపై 300లకు పైగా కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 2024 నాటికి వైజాగ్, గుంటూరు, తిరుపతిలలో మూడు ఫుడ్ ల్యాబ్‌ల కార్యకలాపాలు మొదలవుతాయని కమీషనర్ పేర్కొన్నారు. వైజాగ్‌లోని బేసిక్ ఫుడ్ ల్యాబ్ సేవలు జూన్/జూలై నాటికి అందుబాటులోకొస్తాయని తెలిపారు.
నాలుగు మొబైల్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌లు ఇప్పటికే పనిచేస్తున్నాయనీ, మరో పది మొబైల్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌లు త్వరలోనే వినియోగంలోకొస్తాయని వివరించారు. వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన మైక్రోబయాలజీ లేబొరేటరీ, మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ల కార్యకలాపాలు త్వరలోనే మొదలవుతాయని కమీషనర్ వివరించారు.
ఇవీ చదవండి: Foods: క్యాన్సర్ ముప్పు నుంచి ఇలా బయట పడండి.. క్యాన్సర్‌ను దూరం చేసే ఆహారాలు ఇవీ..
Eye health: కంటి ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..
Kakara Kaya: చేదైన ఆహారం.. పోషక గుణాల్లో తియ్యదనం.. కాకర కాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవీ..
Cluster Beans: గోరుచిక్కుడుతో అద్భుత ప్రయోజనాలు.. కండరాల ఎదుగుదలకు చక్కటి ఆహారం
Best Veg Food: శాకాహారంలో బెస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఏవి? మంచి ప్రోటీన్స్ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..
