HomeAndhra PradeshAddanki: అద్దంకిలో ఆదరించేది ఎవరిని? గెలుపు లెక్కలేంటి? హోరాహోరీ తప్పదా?

Addanki: అద్దంకిలో ఆదరించేది ఎవరిని? గెలుపు లెక్కలేంటి? హోరాహోరీ తప్పదా?

Addanki: ప్రశాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో గెలుపు ఎవరిని వరిస్తుంది. అతి త్వరలో రానున్న ఎన్నికల్లో గెలుపు ఏ పార్టీ సొంతం అవుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరఫున గొట్టిపాటి రవికుమార్‌ను అభ్యర్థిగా అధిష్టానం మొదటి లిస్టులోనే ప్రకటించింది. ఇక వైయస్సార్‌సీపీ క్యాండేట్‌ విషయానికి వస్తే.. హనిమిరెడ్డిని ప్రకటించారు. ఇద్దరి మధ్య పోటాపోటీ ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? సామాజిక సమీకరణాలు, కులాల లెక్కలు, అభివృద్ధి, గెలుపుపై ఎవరు దీమాగా ఉన్నారనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. Addanki

సామాజిక సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..
అద్దంకి నియోజకవర్గంలో మొత్తం 103 గ్రామాలున్నాయి. 5 మండలాలున్నాయి. మొత్తం 2.50 లక్షల పైచిలుకు ఓట్లు ఉన్నాయి. ఇందులో కమ్మ సామాజికవర్గం ఓట్లు 65,000 పైచిలుకు వరకు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీల ఓట్లు 68,000 పైచిలుకు వరకు ఉంటాయి. రెడ్డి సామాజికవర్గం ఓట్లు 12,000 దాకా ఉంటాయి. కోమటి సామాజికవర్గం వారు 5,000 దాకా ఉంటారు. బీసీ కులాలన్నీ కలిపి మొత్తం 40,000 పైచిలుకు ఓట్లు ఉంటాయి. మైనార్టీల ఓట్లు మరో 13,000 పైచిలుకు దాకా ఉంటాయి.

నియోజకవర్గంలో వైయస్సార్‌సీపీ చేసిన అభివృద్ధి ఏంటి?
అద్దంకి పట్టణంలో సచివాలయాలు, ఆర్బీకేల నిర్మాణం బాగానే జరిగింది. నియోజకవర్గంలో మొత్తం 73 సచివాలయాలు నిర్మించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇంకా 15 చోట్ల మాత్రమే సచివాలయాలు కట్టాల్సి ఉంది. మిగతా అన్ని చోట్లా నిర్మాణాలు పూర్తయ్యాయి. రోడ్లు, సీసీ రోడ్లు, డ్రెయిన్లు అద్దంకి పట్టణంలో ఓ మోస్తరుగా చేశారు. నాడు-నేడు స్కూళ్ల అభివృద్ధి చెప్పుకోదగ్గ స్థాయిలో జరిగింది. గడప గడపకు మన ప్రభుత్వంలో గుర్తించిన చోట్ల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అయ్యాయి.

అధికార పార్టీ పరిస్థితి ఏంటంటే..
అద్దంకి నియోజకవర్గంలో రోడ్లు చాలా ప్రాంతాల్లో దెబ్బతిన్నాయి. రోడ్లు నిర్మించకపోవడం అధికార పార్టీకి మైనస్‌ అయ్యే అవకాశం ఉంది. కొరిశపాడు, అద్దంకి, సంతమాగులూరు మండలాల్లో తెలుగుదేశం పార్టీకి పట్టుంది. వైయస్సార్‌సీపీ సమన్వయకర్తగా మొన్నటి వరకు చైతన్య ఉండేవారు. ఆయన స్థానంలో హనిమిరెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. కొత్త సమన్వయకర్త వచ్చినప్పటి నుంచి చాలా మంది కార్యకర్తలు పాజిటివ్‌గా ఉన్నారు. కానీ చైతన్య వర్గానికి చెందిన కొందరు ఆయనకు సహకరించడం లేదు.

హనిమిరెడ్డి.. వైవీ సుబ్బారెడ్డి వర్గం. కొరిశపాడు మండలానికి చెందిన వ్యక్తి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వర్గాల ఓట్లు చాలా వరకు వైయస్సార్‌సీపీకి పడే ఆస్కారం ఉంది. కాపులు, రెడ్ల ఓట్లు కూడా అధికార పార్టీకే వెళ్లిపోయే చాన్స్‌ ఉంది. గొట్టిపాటి రవికి సరైన ప్రత్యర్థి హనిమిరెడ్డి అనే అభిప్రాయం నియోజకవర్గంలో వ్యక్తమవుతోంది. హనిమిరెడ్డి తమ్ముళ్లు శ్రీనివాస రెడ్డి, మహేష్ రెడ్డి, అనుచరవర్గంతో కలిసి ప్రజల్లో కలియతిరుగుతున్నారు. ఆర్థికంగా బలం ఉంది.

ఇవి కూడా చేయాల్సింది..
నియోజకవర్గంలో ఎర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం వైయస్సార్ హయాంలో ప్రారంభించారు. టీడీపీ హయాంలో దీన్ని పూర్తిగా పక్కనపెట్టారు. వైయస్సార్‌ సీపీ వచ్చిన తర్వాత కూడా ఇదే పరిస్థితి. చివరి దశ పనులు చేయాల్సి ఉంది. మరోవైపు కొరిశపాడు ఎత్తిపోతల పథకం పూర్తి చేయాల్సి ఉంది. వైయస్సార్ హయాంలో జలయజ్ఞంలో భాగంగా దీన్ని మొదలు పెట్టారు. టీడీపీ హయాంలో పూర్తిగా వదిలేశారు. సీఎం జగన్‌ వచ్చాక కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇక భవనాసి మినీ రిజర్వాయర్ కూడా పూర్తి కాలేదు. దీన్ని కూడా వైయస్సార్ హయాంలో మొదలు పెట్టారు. 5,000 ఎకరాలకు లబ్ధి కలిగే అవకాశం ఉంది. దీనిపై సీఎం జగన్‌ దృష్టి సారించలేదు.

తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే..
అద్దంకిలో గొట్టిపాటి రవి టీడీపీ అభ్యర్థి. ఇప్పటికే ఈయన నాలుగుసార్లు గెలిచాడు. గతంలో వైయస్సార్‌ సీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వెళ్లాడు. ఆయనకు పార్టీలతో సంబంధం లేకుండా డబ్బు బలం, వర్గం ఉన్నాయి. గొట్టిపాటి రవికి కమ్మ సామాజికవర్గం ఓట్లన్నీ దాదాపు 95 శాతం పడే అవకాశం ఉంది. కేడర్‌కు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, ఖర్చుకు వెనుకాడడనే పేరు గొట్టిపాటి రవికి ఉంది. ఇక్కడ జనసేన-టీడీపీ అలయన్స్‌ను చాలా మంది అంగీకరించడం లేదు. అయితే, ఇప్పుడు బీజేపీ కూడా కలవడం కొంత బలాన్ని చేకూర్చే అవకాశం ఉంది.

మొత్తంగా చూస్తే.. అద్దంకి నియోజకవర్గంలో ఏ పార్టీకీ గెలుపు నల్లేరు మీద నడక కాదు. హోరీ హోరీగా సాగే అవకాశం ఉంది. మెజార్టీ విషయంలో కాస్త ఎడ్జ్‌ అధికార పార్టీకే ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి.

ఇవీ చదవండి: Penamaluru TDP: పెనమలూరు టీడీపీలో భగభగలు.. బయటివారికి టికెట్‌ ఇస్తే నేను చేతగానివాడినా?: బోడె ప్రసాద్‌
Tadikonda: తాడికొండలో గెలిచేదెవరు? నిలిచేదెవరు? తెనాలి శ్రావణ్‌ కుమార్‌ వర్సెస్‌ మేకతోటి సుచరిత
CM Jagan Ready to Elections: ఎన్నికల సమరానికి సీఎం జగన్‌ సిద్ధం.. 18 నుంచి ప్రచార సమర భేరి!
YS Jagan vs All: పిక్చర్‌ క్లియర్‌.. ఒక్క జగన్‌ వర్సెస్‌ టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు