HomeAndhra PradeshYS Jagan vs All: పిక్చర్‌ క్లియర్‌.. ఒక్క జగన్‌ వర్సెస్‌ టీడీపీ, జనసేన, బీజేపీ,...

YS Jagan vs All: పిక్చర్‌ క్లియర్‌.. ఒక్క జగన్‌ వర్సెస్‌ టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌..!

YS Jagan vs All: ఏపీలో పొత్తులు ఖరారయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ (TDP), బీజేపీ (BJP), జనసేన (Janasena) పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. గత కొంత కాలంగా పొత్తులపై తర్జనభర్జన పడుతూ వచ్చిన ఈ మూడు పార్టీలూ ప్రస్తుతం ఓ క్లారిటీకి వచ్చాయి. మూడు రోజులుగా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ ఢిల్లీలో తిష్టవేసి ఎట్టకేలకు బీజేపీని ప్రసన్నం చేసుకున్నారు.

ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారన్న ఉత్కంఠకు తెర దించుతూ మరో రెండు మూడు రోజుల్లోనే తెలియనుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. బీజేపీ-జనసేనకు (TDP-Janasena) 8 ఎంపీ, 30 అసెంబ్లీ స్థానాలు ఇవ్వనున్నట్లు చంద్రబాబు (Chandrababu), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) మీడియాకు లీకులిచ్చారు. అలాగే టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ కూడా మీడియాకు లీకులు ఇచ్చారు. బీజేపీకి 6, జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

బీజేపీ నుంచి పోటీ చేసే స్థానాలు అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, అరకు, రాజంపేట, హిందూపురం లేదా తిరుపతి అని ప్రాథమిక సమాచారం. జనసేనకు కాకినాడ, మచిలీపట్నం లోక్‌సభ స్థానాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాకినాడ నుంచి లోక్‌సభ స్థానానికి పవన్ కల్యాణ్ పోటీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మచిలీపట్నం నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా బరిలోకి బాలశౌరి దిగుతున్నట్లు తెలుస్తోంది.

సీట్లపై తకరారు..
బీజేపీ పొత్తుతో సీట్ల పంచాయితీ రెండు మూడు రోజుల్లో తేలనుంది. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, తిరుపతి, ఒంగోలు, కాకినాడ, గుంటూరు కర్నూలు నగరాల్లో బీజేపీ సీట్లు కోరుతున్నట్లు తెలుస్తోంది. అర్బన్ ప్రాంతాల్లో సీట్లు ఎక్కువగా డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. విజయవాడ ఎంపీతో పాటు పశ్చిమ, సెంట్రల్ స్థానాల్లో ఒక స్థానం ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. గెలుపు అవకాశాలు ఉన్న సిటీ స్థానాలపై బీజేపీ అగ్రనేతలు కన్నేసినట్లు తెలుస్తోంది. బీజేపీ పెద్దల డిమాండ్లతో చంద్రబాబు ఒకింత కలవరపడుతున్నారట.

రాజమండ్రి ఎంపీ తో పాటు సిటీ లేదా రూరల్ సీటును బీజేపీ పెద్దలు కోరుతున్నారు. హిందూపురం ఎంపీ పుట్టపర్తి, అనంతపురం ఎమ్మెల్యే సీట్లు అడుగుతున్నారట. నంద్యాల ఎంపీ, కర్నూలు ఎమ్మెల్యే సీటును బీజేపీ కోరుతోంది. రాజంపేట, తిరుపతి ఎంపీ, తిరుపతి ఎమ్మెల్యే సీటు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు వినికిడి. ఏలూరు, నర్సాపురం ఎంపీలతో పాటు భీమవరం, నర్సాపురం, ఉంగుటూరు ఎమ్మెల్యే సీట్లను బీజేపీ అడుగుతోంది.

శ్రీకాకుళం, విజయనగరం, కురుపాం అసెంబ్లీ సీట్లను సైతం బీజేపీ అడుగుతోందట. కాకినాడ సిటీ, పిఠాపురం అసెంబ్లీ సీట్లు కూడా డిమాండ్‌ చేస్తున్నారట. గుంటూరు సిటీ రెండు సీట్లలో ఒకటి బీజేపీ ఆశిస్తోంది. బాపట్ల, నరసరావుపేట, సత్తెనపల్లి అసెంబ్లీ సీట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి జగన్‌ ఇప్పటి వరకు బీజేపీతో సఖ్యతగానే మెలుగుతూ వచ్చారు. అలాంటిది ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన ఒకటై జగన్‌ వైపు బాణాలు ఎక్కుపెట్టడంతో జగన్‌ వ్యూహం ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ఆశ్చర్యం కలిగించే అంశం. చంద్రబాబు 14 సంవత్సరాల పాలనలో మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా ప్రజలకు చేసిన మంచి ఏదీ లేదని సీఎం జగన్‌ పదే పదే సభల్లో చెబుతుంటారు. దత్తపుత్రుడితో కలిసి 2014 ఎన్నికల్లో మహిళలు, రైతులు, యువతను ఎలా మోసం చేశారో వివరిస్తుంటారు. అయితే ప్రధాని మోదీనిగానీ, అమిత్‌ షానుగానీ, బీజేపీ పెద్దలనుగానీ జగన్‌ ఇప్పటి వరకు పల్లెత్తు మాట అనలేదు. బీజేపీ పెద్దలది సైతం జగన్‌ పట్ల ఇదే వైఖరి.

జగన్‌ను (YS Jagan) విమర్శించేందుకు వీలయ్యే అంశాలపై బీజేపీ పెద్దలు ఇప్పుడు ఫోకస్‌ పెట్టే చాన్స్‌ లేకపోలేదు. అది ఇసుక పాలసీ, మద్యం పాలసీ, ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, జాబ్‌ కేలండర్‌, డీఎస్సీ, రాష్ట్ర అప్పులు పెరిగిపోవడం, సంక్షేమం తప్ప అభివృద్ధి లేదని ప్రచారం చేయడం…. ఇలాంటి అంశాలపై జగన్‌ను విమర్శించే వీలుంటుంది.

మరి జగన్‌ ఎలాంటి సమాధానాలు ఇస్తారు, బదులుగా కూటమిపై, పొత్తులపై ఎలాంటి ఆరోపణలు, రుజువులతో నిరూపిస్తారన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తి కలిగించే అంశం. ముఖ్యంగా జగన్‌ వద్ద ఉన్న తిరుగులేని బాణాలు ఆయన్ను రక్షిస్తాయని చెబుతున్నారు.

జగన్‌ ప్లస్‌లు ఇవీ..
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌ అనుసరిస్తున్న సంక్షేమం దేశంలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. పెన్షన్ల దగ్గర నుంచి మొదలు పెడితే వాలంటీర్ల ద్వారా గడప వద్దకే ప్రభుత్వాన్ని తీసుకురావడం, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో సుపరిపాలన అందించారు. డీబీటీ స్కీములు జగన్‌ అమలు చేసినట్లు దేశంలోనే ఏ ముఖ్యమంత్రి అమలు చేయడం లేదు.ఇప్పటి వరకు సుమారు 2.70 లక్షల కోట్లకుపైగా డీబీటీ ద్వారా రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు లబ్ధి చేకూర్చారు. ఇలా పథకాలు అందుకున్న వారంతా తనకు స్టార్‌ క్యాంపెయినర్లేనంటూ జగన్‌ చెబుతున్నారు.

అభివృద్ధి విషయంలోనూ జగన్‌ ఎక్కడా తగ్గడం లేదు. కర్నూలు ఎయిర్‌పోర్టును పూర్తి చేయడంతో పాటు రాయామపట్నం, మచిలీపట్నం, కాకినాడ గేట్‌ వే, మూలపేట పోర్టులు నిర్మిస్తున్నారు. 10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ ల్యాండ్లు కడుతున్నారు. పరిశ్రమలు కొత్తగా 300 పైచిలుకు వచ్చాయి. విశాఖలో ఇన్ఫోసిస్‌ వచ్చింది. అంబానీ, అదానీ లాంటి వారు పెట్టుబడులు పెట్టారు. కొప్పర్తి మాన్యు ఫాక్చరింగ్‌ హబ్‌, చిత్తూరు శ్రీసిటీలో పరిశ్రమలు అనేకం ఉత్పత్తిని ప్రారంభించాయి.

సంక్షేమ సామ్రాట్‌గా నిలిచిన జగన్‌కు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలంతా గెలిపిస్తారని వైయస్సార్‌సీపీ ఆశలు పెట్టుకుంది. ఒకరకంగా చెప్పాలంటే కాన్ఫిడెన్స్‌గా ఉంది. దీమాగా ఉంది. ఎంత మంది కలిసి వచ్చినా ఎన్నికల రణక్షేత్రంలో అర్జునుడిలా మారి విజయ తీరాలను చేరుకుంటానన్న దీమా జగన్‌ వ్యక్తం చేస్తున్నారు. శ్రేణులకు తిరుగులేని ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. ఇటీవల జరుగుతున్న సిద్ధం సభలకు భారీ జనసందోహం రావడం, జగన్‌ ప్రసంగాలకు అడుగడుగునా కేరింతలు, ఉత్సాహం రావడం ఎన్నికల మూడ్‌ను దాదాపు వైయస్సార్‌సీపీ వైపు మళ్లేలా చేస్తోంది.

ఇక సంక్షేమంలోనూ జగన్‌ చెప్పినది చెప్పినట్లుగా చేస్తారన్న నమ్మకం జనంలో కలిగించడంలో ఆయన పూర్తిగా సక్సెస్‌ అయ్యారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయనివి, తాను అమలు చేస్తున్నవి లెక్కలతో సహా ప్రతి సందర్బంలోనూ నాడు-నేడు అంటూ పోల్చి చూపుతున్నారు సీఎం జగన్‌.

జగన్‌ అర్జునుడై గెలిచి నిలుస్తాడా?
సంక్షేమం, అభివృద్ది మాత్రమే గెలిపిస్తాయా? అంటే పూర్తి స్థాయిలో గెలిపించలేకపోవచ్చు. కానీ ఇన్ని లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చామని, వారే తనను భుజాన ఎత్తుకొని గెలిపిస్తారని సీఎం జగన్‌ భావిస్తున్నారు. పొత్తులు పెట్టుకుని 3 పార్టీలు ఏకమై వస్తున్న తరుణంలో జగన్‌ బలం ఎంత పుంజుకుంటుంది? ఎంత తగ్గుతుందన్నది వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా ఒక్క జగన్‌ వర్సెస్‌ ఆల్‌ పార్టీస్‌ అన్నట్లుగా ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఉన్నాయి. 2014 సీన్‌ రిపీట్‌ అవుతుందా? లేదా జగన్‌ అర్జునుడై యుద్ధాన్ని గెలుస్తాడా? అన్నది వేచి చూడాల్సిందే.

ఇవీ చదవండి: Veligonda Project: ఇది దేవుడి స్క్రిప్టే.. వెలిగొండను జాతికి అంకితం చేయడంపై వైయస్సార్‌ను గుర్తు చేసుకున్న సీఎం జగన్‌
Vision Vishakha: రాష్ట్రాభివృద్ధికి విజన్‌ విశాఖ.. పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్‌ నేడు కీలక భేటీ
Ongole CM jagan Meeting: పేదల ఇంటి స్థలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ పంపిణీ.. సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు
Jagan Siddam: మీ జగన్‌ 57 నెలల పరిపాలనలో 2.13 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు..
Anantapur Siddham Sabha: రైతన్నకు భరోసా ఇచ్చింది ఎవరంటే మీ జగన్‌.. మన వైయస్సార్‌ సీపీ మాత్రమే!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు