HomeAndhra PradeshPenamaluru: పెనమలూరులో గెలిచేది ఆ పార్టీ అభ్యర్థేనా? సామాజిక సమీకరణాల్లో పైచేయి ఎవరిది?

Penamaluru: పెనమలూరులో గెలిచేది ఆ పార్టీ అభ్యర్థేనా? సామాజిక సమీకరణాల్లో పైచేయి ఎవరిది?

Penamaluru: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే అధికార పార్టీ వైయస్సార్‌సీపీ క్యాండేట్‌గా మంత్రి జోగి రమేష్‌ను ప్రకటించింది. మరోవైపు ఇక్కడే వైయస్సార్‌సీపీ తరఫున గెలిచిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నూజివీడు నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే, పెనమలూరులో టీడీపీ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఇక్కడ ఇంతకు ముందు గెలిచిన బోడె ప్రసాద్‌ మళ్లీ టికెట్‌ ఆశిస్తున్నారు. చంద్రబాబు మాత్రం ఇప్పటి వరకు ఖాయం చేయలేదు. పెనమలూరులో గెలుపు ఎవరిని వరిస్తుంది? సామాజిక సమీకరణాలు, రాజకీయం ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం. Penamaluru

సామాజిక సమీకరణాలు
పెనమలూరు నియోజకవర్గంలో మొత్తం 3 లక్షల దాకా ఓట్లు ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా కమ్మ సామాజికవర్గం ఓట్లు 52,000 పైమాటే. మాల, మాదిగ సామాజికవర్గాల ఓట్లు 70,000 పైచిలుకు ఉంటాయి. బీసీ కులాలన్నీ కలిపి లక్ష ఓట్ల వరకు ఉండే అవకాశం ఉంది. రెడ్లు 12,000, కాపులు 18,000, ముస్లింలు 22,000 ఓట్లు వరకు ఉంటారు.

నియోజకవర్గంలో ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి విషయానికి వస్తే.. పెనమలూరు పరిధిలో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా సుమారు రూ.1,900 కోట్ల లబ్ధి చేకూరింది. నాడు-నేడు స్కూళ్ల అభివృద్ధి దాదాపు పూర్తయ్యింది. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ నిర్మాణం 60 శాతం పూర్తయ్యింది. భూమి లేకపోవడం, కాంట్రాక్టర్ల సమస్యలతో 40 శాతం నిర్మాణ పనులు పెండింగ్‌లో పెట్టింది జగన్‌ సర్కార్‌.

నియోజకవర్గ గత చరిత్ర ఇదీ..
పెనమలూరు నియోజకవర్గం 2009లో ఏర్పడింది. మొదటి నుంచి టీడీపీకి కాస్త ఎక్కువ పట్టున్న ప్రాంతం. 2009లో కాంగ్రెస్ తరఫున కొలుసు పార్థసారథి గెలిచారు. 2014లో వైయస్సార్‌సీపీ అభ్యర్థి కుక్కల విద్యాసాగర్‌ ఓడారు. టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ 30,000 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2019లో వైయస్సార్‌సీపీ అభ్యర్థిగా కొలుసు పార్థసారథి 11,000 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.

ఇక్కడ కమ్మ సామాజికవర్గం, కాపులు ఎక్కువ శాతం టీడీపీకి మద్దతుగా నిలుస్తుంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్లు, మైనార్టీలు వైయస్సార్‌సీపీ వైపు మొగ్గు చూపుతుంటారు. ఇటీవల సామాజిక సాధికార యాత్ర సందర్భంగా కొలుసు పార్థ సారథి తనను వైయస్‌ జగన్‌ పట్టించుకోవడం లేదని చేసిన వ్యాఖ్యలు కాకరేపాయి. అనంతరం పార్థకు టికెట్‌ నిరాకరించడంతో ఆయన మరో మార్గం చూసుకున్నారు. టీడీపీలో చేరారు. నూజివీడు టికెట్‌ ఆయనకు చంద్రబాబు ప్రకటించారు.

వైయస్సార్‌సీపీ తరఫున పెడన నియోజకవర్గం నుంచి నెగ్గిన మంత్రి జోగి రమేష్‌ను పెనమలూరు అభ్యర్థిగా ప్రకటించారు సీఎం జగన్‌. ఇక్కడ బీసీలకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్న సంకేతాలిచ్చారు. అయితే, అధికార పార్టీలో నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల్లో రెండు మూడు వర్గాలు ఉన్నాయి. సమన్వయం పెద్దగా లేదు. గతంలో పార్థసారథి.. వ్యాపారవేత్తలకు, కమ్మ సామాజికవర్గానికి ఎక్కువగా పనులు చేసిపెడుతున్నారని నేతలు ఆరోపణలు గుప్పించారు.

తొలి నుంచి పార్టీలో ఉన్న వారిని పట్టించుకోడనే ఆరోపణలున్నాయి. కంకిపాడులో ఫైర్ స్టేషన్ నిర్మించాలని చాలా ఏళ్లుగా జనం కోరుతున్నారు. యనమలకుదురులో వంతెన పనులు పెండింగ్‌లో ఉన్నాయి. కానూరులో కాలేజీ రోడ్డు ఫ్లై ఓవర్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని గ్రామాలకు ప్రధాన రహదారులు అధ్వానంగా ఉన్నాయి.

నియోజకవర్గంలో 30 వేల మందికి ఇంటి స్థలాలు ఇచ్చారు. వీటిలో 30 శాతం వరకు కొందరు నాయకులు ఇచ్చిన లిస్ట్ ప్రకారం మంజూరు చేశారనే ఆరోపణలున్నాయి. పార్థసారథి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మొక్కుబడిగా చేశారు. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం ఎక్కడా జరగలేదు. ఫొటోలకు పోజులిచ్చి వెళ్లిపోయారంటూ ప్రజలు బహిరంగంగానే ఆరోపణలు చేసిన సందర్భాలున్నాయి.

వైయస్సార్‌సీపీ బలాలు..
కంకిపాడు మండలంలో వైయస్సార్‌సీపీకి పట్టుంది. ఉయ్యూరు మండలంలో టీడీపీకి, వైయస్సార్‌సీపీకి పోటాపోటీ ఉంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం అధికార పార్టీకి కలిసొచ్చే అంశం. మహిళా ఓటర్లు అధికార పార్టీకే మద్దతు పలికే అవకాశాలున్నాయి.

టీడీపీ పరిస్థితి ఏంటంటే..
టీడీపీలో అభ్యర్థిపై క్లారిటీ లేదు. పార్టీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తనకే టికెట్ వస్తుందని దీమాగా ఉన్నారు. చంద్రబాబు తనకు టికెట్ ఇస్తానని 2014లోనే మాట ఇచ్చారంటూ దేవినేని స్మిత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, గద్దె రామ్మోహన్ లాంటి వారు పోటీలో ఉండే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. జనసేన పార్టీ తరఫున ఇక్కడ ముప్పారాజా వర్గం ఉంది. బోడె ప్రసాద్ అనుచరుడిగా ఇతనికి పేరుంది. మరో జనసేన నాయకుడు పులి కామేశ్వరరావు దేవినేని స్మిత వర్గానికి సపోర్ట్ చేస్తున్నారు.

వీరందరితోపాటు మాజీ మంత్రి దేవినేని ఉమ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉమ పోటీ చేసే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతోంది. బోడె ప్రసాద్‌కు, దేవినేని ఉమకు విభేదాలున్నాయి. పెనమలూరు మండలంలో టీడీపీకి పట్టుంది.

ప్రస్తుతం టీడీపీ, జనసే, బీజేపీ పొత్తు ఖాయం అయిన నేపథ్యంలో ఎవరికి టికెట్‌ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. బీసీల బలంతో తామే గెలుస్తామన్న దీమాలో అధికార పార్టీ ఉంది. అయితే, కమ్మ సామాజికవర్గం ఓట్లు, కూటమి తమను గెలిపిస్తుందని టీడీపీ భావిస్తోంది. ఎవరు గెలుస్తారన్నది వేచి చూడాల్సిందే.

ఇవీ చదవండి: YS Jagan vs All: పిక్చర్‌ క్లియర్‌.. ఒక్క జగన్‌ వర్సెస్‌ టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు