Tadikonda: రాజధాని అమరావతి ప్రాంతంలో హోరాహోరీగా పోటీ కొనసాగే వీలున్న నియోజకవర్గం తాడికొండ. అమరావతి ప్రాంతంలోనే సమ్మిళితమైన ఈ ప్రాంతంలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, అధికార పార్టీ వైయస్సార్‌సీపీ పోటాపోటీగా ఉన్నాయి. ప్రచార హోరును పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నాయి. ఇక్కడ అధికార పార్టీ తరఫున మాజీ హోంమంత్రి, ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత బరిలో నిలిచారు. మరోవైపు టీడీపీ నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ పోటీలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో గెలిచేదెవరు? జెండా పాతేదెవరు? ఈ కథనంలో ఓ లుక్కేద్దాం రండి..
ఏ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయంటే..
తాడికొండ నియోజకవర్గంలో 2.06 లక్షల పైచిలుకు ఓట్లు ఉన్నాయి. కమ్మ సామాజికవర్గం ఓట్లు 33,000 వేల పైచిలుకు ఉంటాయి. మాల సామాజికవర్గం 12,000 పైగా, మాదిగ సామాజికవర్గీయులు 21,000కుపైగా, తెలగ, కాపుల ఓట్లు 14,000 పైచిలుకు ఉంటాయి. యాదవులు 11,000కుపైగా, రజకులు 7,500 మందికిపైగా, ఎరుకల ఓట్లు 5,000కుపైగా ఉంటాయి. నియోజకవర్గంలో మొత్తం 47 కులాలు ఉన్నాయి.
అధికార పార్టీ ఐదేళ్లలో ఏం చేసింది?
గ్రామ సచివాలయాల నిర్మాణం నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో బిల్లులు మంజూరు కాక నిర్మాణాలు ఆపేసిన పరిస్థితి గతంలో ఉండేది. అయితే, ఇప్పుడు వాటిని దాదాపు 90 శాతం మేర పూర్తి చేశారు. మరో పది శాతం మాత్రమే పెండింగ్ పనులు ఉన్నాయి. నాడు-నేడు స్కూళ్ల అభివృద్ధి అనుకున్న స్థాయిలో జరిగింది. తాడికొండలో అగ్రిటెస్టింగ్ ల్యాబ్ రూ.55 లక్షలతో నిర్మించారు. ఇది రైతులకు ఉపయోగంగా ఉంది. రోడ్ల అభివృద్ధి పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు.
వైయస్సార్‌సీపీ బలాబలాలు ఏంటంటే..
తాడికొండ నియోజకవర్గంలో మాల సామాజికవర్గం ఓట్లు దాదాపు అధికార పార్టీకే పడే వీలుంది. ఇక్కడ సమన్వయకర్తగా పని చేసిన కత్తెర సురేష్ కుమార్ ఇటీవలి కాలం వరకు తన వర్గాన్ని కొనసాగించారు. పార్టీ కమిటీల నియామకంలో ఆయన ఏకపక్షంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజధానికి భూములు ఇచ్చిన వారికి ఉపాధి లేకపోవడం, పక్క ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకొనే పరిస్థితి ఉండటం ఇక్కడ అధికార పార్టీకి మైనస్.
రైతులు తమ భూముల రేట్లు తగ్గిపోయాయనే అసంతృప్తిలో ఉన్నారు. కమ్మ సామాజికవర్గంలో అసంతృప్తి బాగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల డొంక రోడ్ల నిర్మాణం జరగలేదు. ఇళ్ల స్థలాలు సైతం కొన్ని ప్రాంతాల్లో అనర్హులకు ఇచ్చారనే ఆరోపణలు బహిరంగంగానే వినిపించాయి. నిధులు రాలేదని సర్పంచులు అసంతృప్తిగా ఉన్నారు.
ఇటీవల సుచరితను పార్టీ అధిష్టానం సమన్వయకర్తగా నియమించింది. ఈమె స్థానికురాలు. నాలుగు సార్లు ఎన్నికలను చూస్తున్నారు. జెడ్పీటీసీగా పోటీ చేసిన చరిత్ర ఈమెది. నియోజకవర్గంలో తొలిసారి అభ్యర్థి సామాజికవర్గం మార్పు చేశారు. ఎస్సీ నుంచి మాలలకు అవకాశం దక్కింది. సుచరిత ద్వితీయశ్రేణి నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ, వారితో సమన్వయం చేసుకుంటూ పని చేస్తున్నారు. తాడికొండ మండలంలో వైయస్సార్‌సీపీకి పట్టు ఉంది. సామాజిక పింఛన్ల మాదిరిగానే 1వ తేదీన ఉదయాన్నే వాలంటీర్లు వచ్చి రాజధానిలో భూమిలేని నిరుపేదలకు పెన్షన్లు ఇస్తున్నారు. ఇటీవలే సీఎం జగన్ ఈ పెన్షన్లను రూ.5 వేలకు పెంచిన సంగతి తెలిసిందే.
టీడీపీ పరిస్థితి ఏంటంటే..
తాడికొండ నియోజకవర్గంలో టీడీపీ తరఫున తెనాలి శ్రావణ్ కుమార్ బరిలో నిలిచారు. టీడీపీకి కమ్మ సామాజికవర్గం ఓట్లే అధికంగా బలం. తుళ్లూరు, ఫిరంగిపురం, మేడికొండూరు మండలాల్లో టీడీపీకి పట్టు ఉంది. గత ఎన్నికల్లో కూడా తెనాలి శ్రావణ్ కుమార్ పోటీ చేశారు. అతని వ్యతిరేకవర్గం వైయస్సార్‌సీపీకి సపోర్టు చేయడంతో ఉండవల్లి శ్రీదేవి ఇక్కడ గెలుపొందారు. ఆ తర్వాత పరిణామాలతో ఇటీవల ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.
రాజధానిలో అసైన్డ్ భూముల కుంభకోణం, కమ్మ సామాజికవర్గం వారు మిగతా కులాలను అణగదొక్కుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో గత ఎన్నికల్లో వైయస్సార్‌సీపీకి మెజార్టీ దక్కింది. అమరావతి ఉద్యమంలో ఇప్పుడు కేవలం ఒక సామాజికవర్గం వారే పాల్గొంటున్నారనే వాదన ఉంది. రాజధాని అభివృద్ధి జరిగి ఉంటే బాగుండేదనే భావన కొన్ని వర్గాల్లో ఉంది. ఇలాంటి ఓటర్లందరూ టీడీపీకి సపోర్ట్ చేసే అవకాశం లేకపోలేదు. జనసేన ప్రభావం ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో ఏమీ లేదు. గత ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పని పోటీ చేయడంతో 4,600 ఓట్ల పైచిలుకు జనసేన అభ్యర్థికి వచ్చాయి. టీడీపీ-జనసేన-బీజేపీ అలయన్స్ నేపథ్యంలో ఇక్కడ కాపుల ఓట్లు కూటమివైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.
మొత్తంగా చూస్తే.. రాజధాని అభివృద్ధి ప్రాతిపదికన చూస్తే టీడీపీకి కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి, రాజధానిలో పెన్షన్లు పెంపు, ఇంటింటికీ సంక్షేమం దృష్ట్యా వైయస్సార్ సీపీకి పడే ఓట్లు కూడా తక్కకువేమీ లేదు. ఈసారి హోరాహోరీ పోరు తప్పదని విశ్లేషణలు వస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.
ఇవీ చదవండి: Penamaluru: పెనమలూరులో గెలిచేది ఆ పార్టీ అభ్యర్థేనా? సామాజిక సమీకరణాల్లో పైచేయి ఎవరిది?
YS Jagan vs All: పిక్చర్ క్లియర్.. ఒక్క జగన్ వర్సెస్ టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్..!
Input Subsidy to Farmers: రైతన్నలకు ఇన్‌పుట్ సబ్సిడీ రిలీజ్.. అందాల్సిన సాయం అందాల్సిన సమయానికే!
