Gokarna temple: కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో గోకర్ణ క్షేత్రం ఉంది. గోకర్ణం అనగా ఆవు చెవి అని అర్థం. ఇక్కడ ఒక ఆవు (పృథ్వి, భూమి తల్లి) చెవి నుంచి శివుడు ఉద్భవించాడని ప్రజలు నమ్ముతారు. ఇది గంగావళి, అఘనాశిని అనే రెండు నదుల చెవి ఆకారపు సంగమం వద్ద ఉందని, అందుకే దీన్ని గోకర్ణం అని పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి.
మీ జీవితంలో ఎప్పుడైనా నాలుగు ఒక్కసారి దొరికితే మీ అంత ధన్యాత్ముడు ఎవరూ ఉండరు.
1. మీరు గోకర్ణ క్షేత్రం వెళ్లాలి.
2. మీరు మారేడు దళాన్ని చేత్తో పుచ్చుకోవాలి.
3. మీకు అక్కడ ఏ రాయి అయినా శివలింగమే. ఓ శివలింగంగా అక్కడ భావన చేయాలి. అక్కడున్న స్వామికి మహాబలేశ్వరుడని పేరుంది. మహాబలేశ్వరుడిని దర్శనం చేసుకోవాలి.
4. మీ అదృష్టం బాగుండి అది కృష్ణ చతుర్దశి అయి ఉండాలి. అంటే మాస శివరాత్రి గానీ, మహాశివరాత్రి గానీ అయ్యి ఉండాలి.
ఈ నాలుగూ జీవితంలో ఎప్పుడైనా దొరికితే.. మీరు అక్కడ మారేడు దళాన్ని ఒక రాయి మీద వేసినా అలాంటి వారు మోక్షాన్ని పొందుతాడని పురాణాలు చెబుతున్నాయి.
త్రేతాయుగంలోని కథ ఏం చెబుతోందంటే..
త్రేతాయుగంలో రావణాసురుడు, శివుని గురించి అకుంఠిత తపస్సు చేస్తాడు. పరమశివుడిని మెప్పించి ఆత్మలింగాన్ని భూమికి తీసుకొస్తుంటాడు. కానీ, శివుడిచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం భూమిమీద ఆనితే, ఎక్కడ పెడితే అక్కడ స్థాపితం అయిపోతుంది. అక్కడి నుంచి తిరిగి ఎత్తడం ఎవరితరం కాదని పరమేశ్వరుడు చెబుతాడు. రావణుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి దేవతలు విష్ణువును వేడుకుంటారు. దీంతో శ్రీమహా విష్ణువు తనమాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు వాతావరణం సృష్టిస్తాడు.
అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయిందని భావించి సంధ్యావందనం కోసం సిద్ధమవుతాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న నారదమునీంద్రుడు వినాయకుని వద్దకు వెళ్లి రావణుడి వద్ద నుంచి ఆత్మలింగం తీసుకొని భూమి మీద పెట్టాలని సూచిస్తాడు. దీంతో గణపతి.. రావణుడు సంధ్యావందనం సమయానికి ఓ బాల బ్రాహ్మణుడి వేషంలో వెడతాడు. అతడిని చూసిన వెంటనే రావణుడు తాను సంధ్యవార్చుకోవాల్సిన కారణంగా ఆత్మలింగాన్ని కాసేపు పట్టుకోవాలి, భూమిపై ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టవద్దని కోరతాడు. అప్పుడు వినాయకుడు లింగం చాలా బరువు ఉంటే తాను ఎక్కువ సేపు మోయలేనని చెబుతాడు.
బరువు అయిపోయినప్పుడు కింద పెట్టేస్తానంటూ హెచ్చరిస్తాడు. మూడు సార్లు పిలుస్తా.. వెంటనే రావాలి. లేదంటే కింద పెట్టేస్తానంటాటడు. రావణుడు అందుకు అంగీకరించి సంధ్యావందనం కోసం వెళ్తాడు. అటు వెళ్లగానే ఇటు గణపతి లింగాన్ని మోయలేక పోతున్నట్లు మూడు సార్లు పిలుస్తాడు. సంధ్య మధ్యలో ఉండడంతో రావణాసురుడు అక్కడకు వచ్చేటప్పటికే బాలబ్రాహ్మణుడు లింగాన్ని నేలపై పెట్టేస్తాడు. రావణుడు వచ్చి లింగాన్ని భూమి మీద నిలిపినందుకు గణపతి నెత్తిమీద మొట్టుతాడు, గణపటి నెత్తికి గుంట పడుతుంది. వినాయకుడు భూమి మీద నిలిపిన స్థలం గోకర్ణ, మురుడేశ్వర లింగం పడిన భాగాలలో ఒక ప్రదేశంగా చరిత్ర చెబుతోంది. శ్రీమహావిష్ణువు తన మాయని తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్లీ దర్శనమిస్తాడు.
ఈ విషయాన్ని గ్రహించిన రావణుడు ఎంతో కోపోద్రిక్తుడవుతాడు. ఆత్మలింగాన్ని తన చేతులతో ఎత్తేందుకు శక్తినంతా ధారపోస్తాడు. ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరివేస్తే గోకర్ణకు 23 కిలోమీటర్ల దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడుతుందని చరిత్ర చెబుతోంది. లింగంపై ఉన్న మూత తొలగించి విసిరి వేస్తే అది గోకర్ణకు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుణేశ్వరలో పడుతుందట. లింగం పైనున్న వస్త్రాన్ని విసిరివేస్తే అది కందుక పర్వతంపై ఉన్న మృదేశ్వరలో పడుతుందని, ఆపేరు కాలక్రమంలో మురుడేశ్వర్‌గా మారిందని చరిత్ర చెబుతోంది.
read also: Temple: గర్భగుడి వెనుక భాగంలో బలీయమైన శక్తి ఉంటుందా? ఆశ్చర్యపరిచే విషయాలు..
