Temple: పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు గుడికి వెళ్తే ఆధ్యాత్మిక భావనతో దేవుడిని దర్శించుకొని దండం పెడుతుంటారు. ఇలా గుడికి వెళ్లిన సందర్భంలో గుడి ప్రవేశ ద్వారం మొదలుకొని ప్రదక్షిణలు చేసే ప్రాంతం, ధ్వజస్తంభం, మూలవిరాట్టు, పరిసరాల్లో వివిధ దేవుళ్ల ప్రతిమలతో వర్ధిల్లుతుంటాయి ఆలయాలు. ఈ క్రమంలో అన్నింటినీ దర్శించుకుంటుంటారు భక్తులు. ఇదే సమయంలో ఆలయం వెనుకభాగాన ఉన్న ప్రాంతాన్ని కూడా మొక్కుతుంటారు. (Temple)
గుడికి ఎవరైనా ఎందుకు వెళ్తారు. ప్రశాంతత కోసం చాలా మంది గుడిలో అడుగు పెడుతుంటారు. ఆధ్యాత్మిక భావనతో మనసు హాయిగా ఉంటుందని చాలా మంది భావిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం దేవాలయాలకు విశిష్ట ప్రాధాన్యం ఉంటుంది. భక్తికి, ప్రశాంతతకు నిలయాలుగా అనాదిగా వర్ధిల్లుతున్నాయి. ఆలయానికి వెళ్లే భక్తుల మనసు చాలా ప్రశాంతతను కలిగి ఉంటుంది. అందుకే భగవంతుడి సన్నిధిలో గడపడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు.
ఆలయం వెనుక భాగంలో మొక్కడం గురించి చాలా మందికి ఆంతర్యం తెలియదు. చాలా మంది మొక్కుతున్నారు కాబట్టి మనం కూడా మొక్కుదాం.. అనే ధోరణిలో భక్తులు వ్యవహరిస్తుంటారు. అయితే, ఇలా చేయడం వెనుక చారిత్రక నేపథ్యం ఉందంటున్నారు జ్యోతిష్యులు. గర్భగుడిలోని మూలవిరాట్టును నాలుగు గోడల మధ్య వెనుక గోడకు దగ్గరగా ప్రతిష్టింపజేస్తుంటారు.
దేవతామూర్తికి దగ్గరగా ఉన్న ప్రాంతం ఆలయంలో వెనుక భాగమే. నిత్యం పూజలు, హోమాలతో జపించడం వల్ల దేవతామూర్తి ఉన్న చోట మంత్ర శక్తి ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఇలా నలుదిశలా ఆ మంత్రశక్తి వ్యాప్తి చెందుతూ ఉంటుంది.
దీంతో దేవతామూర్తికి దగ్గరగా ఉన్న ప్రాంతం కాబట్టి వెనుక భాగంలో మంత్రశక్తి, దేవతామూర్తి అనుగ్రహం పొందడానికి వీలుగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇందుకే అనాదిగా గర్భగుడి వెనుక భాగాన భక్తులు మొక్కుతుండడం కొనసాగుతోందని చెబుతున్నారు. దాంతోపాటు గర్భాలయం నుంచి పాజిటివ్ వైబ్రేషన్ ప్రసరిస్తుంటాయని, అది తమకు మేలు చేస్తుందని భక్తులు నమ్ముతారు.
మూలవిరాట్‌ను ఎలా ప్రతిష్టిస్తారంటే..
శబ్దాన్ని బట్టి రాయి జాతిని నిర్ణయించి దానిని మూలవిరాట్టుగా మలిచి యంత్ర సహితంగా గర్భాలయములో ప్రతిష్ఠ చేస్తారని పెద్దలు చెబుతున్నారు. ఆలయం ఎంత విశాలంగా ఉన్నప్పటికీ గర్భగుడి మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. ఆలయం బయటంతా శిల్ప సంపద, విద్యుత్ కాంతులు దర్శనమిస్తాయి. కానీ గర్భాలయంలో అలాంటివేమీ కనిపించవు. దైవం కేవలం తన ఎదురుగా ఉండే ‘దీపారాధన’ వెలుగులో మాత్రమే కనిపిస్తుంది.
గర్భాలయం పైన గల విమానం ఎత్తు చాలా తక్కువగా ఉంటుంది. ఈ విమానంపై ఒక కలశం మాత్రమే ఉంచుతారు. రాగితో చేసిన ఈ కలశం బంగారు పూతను కలిగి ఉంటుంది. నవగ్రహాలు, 27 నక్షత్రాల నుంచి వచ్చే శక్తివంతమైన కిరణాలను ఈ కలశం గ్రహించి శక్తిని గర్భాలయంలో ఉన్న యంత్రాలనే రాగిరేకులకు చేరవేస్తుంది. అప్పుడు ఆ శక్తిని వాటి నుంచి విగ్రహం గ్రహిస్తుంది. దేవాలయానికి వెళ్లి అక్కడి దైవాన్ని దర్శించినప్పుడు ఈ శక్తి సహజంగానే భక్తుల దేహంపై ప్రభావం చూపి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.
గర్భాలయం ఒక శక్తి కేంద్రంగా పనిచేస్తుంది కనుకనే ఆ శక్తి అన్ని దిక్కులకు వెళ్లకుండా ఒక వైపుకు మాత్రమే వెళ్లాలని ‘ఆగమ శాస్త్రం’చెబుతోంది. ఈ కారణంగానే గర్భాలయానికి కిటికీలు కూడా లేకుండా, ఒకే ఒక ద్వారం మాత్రమే ఏర్పాటు చేస్తారు. ఆ వైపు నుంచి మాత్రమే భక్తులు దైవాన్ని దర్శించి ఆయన నుంచి తమకి కావలసిన శక్తిని పొందుతుంటారు.
Read Also : Temple Visit Rules: దేవాలయానికి వెళ్లేటప్పుడు ఇలాంటి తప్పులు చేయకండి.. పాటించాల్సినవి ఇవీ..!