TDP MP Candidates: ఏపీలో ఎన్నికల కోలాహలం మొదలవుతోంది. ఇప్పటికే రా కదలిరా పేరిట టీడీపీ అధినేత చంద్రబాబు, సిద్ధం.. అంటూ సీఎం వైయస్ జగన్ సభలు నిర్వహిస్తున్నారు. భారీ జనసమీకరణ చేస్తూ బలప్రదర్శన చేస్తున్నారు. మరోవైపు ఫ్లెక్సీల వార్ కూడా కొనసాగుతోంది. సిద్ధం అంటే సంసిద్ధం.. సై అంటే మేము కూడా సై.. అంటూ ఏపీలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అటు వైసీపీ, ఇటు జనసేన, టీడీపీ నేతలు హోరాహోరీగా బ్రాండింగ్ చేసుకుంటున్నారు. (TDP MP Candidates)
అభ్యర్థుల ప్రకటనలో అధికార పార్టీ ముందుంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తోంది. నియోజకవర్గ సమన్వయకర్తల నియామకం చేస్తూ సీఎం జగన్ దూసుకెళ్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే క్యాండేట్ల లిస్టులు ఇప్పటికి 5 విడుదలయ్యాయి. ఇంకా వెలువడే అవకాశం ఉంది. మరోవైపు చంద్రబాబు కొన్ని స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఇద్దరు కేండేట్లను ప్రకటించారు.
టీడీపీ ఎంపీ కేండేట్ల విషయంలో కసరత్తు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 13 స్థానాలకు అభ్యర్థులను రేపో మాపో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో 12 స్థానాలపై కసరత్తు జరుగుతోందట. రెండు మూడు చోట్ల ఎన్ఆర్ఐ అభ్యర్థుల పేర్లను అధినేత చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీల్లో శ్రీకాకుళం నుంచి మళ్లీ రామ్మోహన్ నాయుడుకు అవకాశం దక్కనుంది. వైసీపీ సిట్టింగ్ ఎంపీలకూ టీడీపీ-జనసేన టికెట్లు ఇచ్చేలా చంద్రబాబు వ్యూహ రచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వైసీపీ రెబల్ ఎంపీలైన రఘురామకృష్ణంరాజు, బాలశౌరి, శ్రీకృష్ణదేవరాయులు, సంజయ్ కుమార్‌లకు ఎంపీ సీట్లు ఇచ్చే విషయం పరిశీలిస్తున్నట్లు సమాచారం. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని సోదరుడు శివనాథ్ (చిన్ని) ఆల్‌మోస్ట్ టికెట్ కన్ఫం అయ్యింది. విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా గీతం విద్యా సంస్థల అధినేత భరత్‌కు చాన్స్ దక్కనుంది. బాలకృష్ణ రెండో అల్లుడు భరత్ కు విశాఖ ఎంపీ సీటు ఖాయమని చెబుతున్నారు.
నరసాపురం ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు పేరు పరిశీలిస్తున్నారు. పొత్తుల్లో ఏ పార్టీకి కేటాయించినా రఘురామకృష్ణంరాజే అభ్యర్థిగా ఉండేలా ఆయన పావులు కదుపుతున్నారు. ఏలూరు నుంచి ఎన్ఆర్ఐ గోపాలకృష్ణ యాదవ్ పేరు పరిశీలిస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన గోపాలకృష్ణ యాదవ్ పేరును చంద్రబాబు ఫైనల్ చేసే అవకాశం ఉంది.
మచిలీపట్నం జనసేన అభ్యర్థిగా ఎంపీ వల్లభనేని బాలశౌరి పేరు తెరపైకి వచ్చింది. ఆయన ఇటీవలే వైసీపీకి రాజీనామా చేశారు. నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారట ఈ వైసీపీ సిట్టింగ్ ఎంపీ. విజయనగరం ఎంపీ అభ్యర్థిగా అశోకజగపతిరాజు లేదా కళావెంకట్రావు కుమారుడు రామ్ మల్లిక్ నాయుడు పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారు.
విజయనగరంలో బీసీకి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నారు. అరకు పార్లమెంట్‌కు మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పేరును పరిశీలిస్తున్నారట. మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడైన శ్రావణ్ కుమార్‌కు టీడీపీ ఆఖరి ఆరు నెలలు మంత్రి పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే. అనకాపల్లి నుంచి ప్రముఖ వ్యాపారవేత్త బైరా దిలీప్ పేరు ఆల్‌మోస్ట్ కన్ఫం అయినట్లు తెలుస్తోంది. అనకాపల్లి నుంచి బుద్ధా వెంకన్న, చింతకాయల విజయ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయట.
గుంటూరులో ఎంపీ గల్లా జయదేవ్ ఇటీవల రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్, భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బాపట్ల ఎంపీ అభ్యర్థిగా ఉండవల్లి శ్రీదేవి లేదా మాదిగ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతకు అవకాశం దక్కే చాన్స్ ఉంది. మరోవైపు ఒంగోలు లేదా నెల్లూరు స్థానాల నుంచి మాగుంట శ్రీనివాసులురెడ్డికి అవకాశం దక్కుతుందని చర్చ జోరుగా కొనసాగుతోంది.
తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి, మాజీ ఐఏఎస్ రత్నప్రభ కుమార్తె అంగలకుర్తి నిహారిక పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. చిత్తూరు నుంచి సత్యవేడు మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య లేదా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలం పేర్లను గమనిస్తున్నారు. మరోవైపు రాజంపేట నుంచి రాయచోటి మాజీ ఎమ్మెల్యే పాలకొండ రాయుడు కుమారుడు సుబ్రహ్మణ్యం పేరు తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో కీలకమైన కడప నుంచి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డికి టికెట్ దక్కే చాన్స్ కనిపిస్తోంది.
కర్నూలు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ సిట్టింగ్ ఎంపీ సంజీవ్ కుమార్ లేదా బీజేపీ నేత పార్థసారథి పేర్లు పరిశీలనలో ఉన్నాయట. నంద్యాల నుంచి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లేదా ఆయన కుమార్తె శబరిని బరిలోకి దింపాలని టీడీపీ అధినేత లెక్కలేసుకుంటున్నారు. నంద్యాల సీటుకు రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రసాద్ రెడ్డి, పారిశ్రామికవేత్త గోగిశెట్టి నరసింహారావు పేర్లను పరిశీలిస్తున్నారు. అనంతపురం ఎంపీ కేండేట్‌గా పూల నాగరాజు లేదా కాల్వ శ్రీనివాసులు పేర్లు వినిపిస్తున్నాయి. హిందూపురం నుంచి బీకే పార్థసారథికి టికెట్ దక్కుతుందని ఆశిస్తున్నారు.
ఇక ఎమ్మెల్యే టికెట్ల విషయంలో, జనసేనతో పొత్తు విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే ఈ వివాదానికి ముగింపు పలకాలని, సీట్లపై స్పష్టత ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
