బుధవారం, 16 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

YS Jagan on Disha: దిశ ఉపసంహరణ మహిళలు, చిన్నారులకు చీకటి రోజు: వైఎస్‌ జగన్‌

Keerthanaa News Deskప్రచురణ తేదీ: శనివారం, 8 ఆగస్టు 2026

YS Jagan on Disha: మహిళలు, చిన్నారుల భద్రత కోసం గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ వ్యవస్థను ఉపసంహరించుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి చీకటి రోజని వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. మహిళలకు రక్షణ కవచంగా నిలిచిన సమగ్ర వ్యవస్థను రాజకీయ ఈర్ష్యతో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’ వేదికగా సుదీర్ఘ పోస్టు చేశారు.

మహిళలు, చిన్నారులపై నేరాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన, బాధితులకు రక్షణ, వేగవంతమైన దర్యాప్తు, ఫోరెన్సిక్‌ ఆధారాల సేకరణ, ఛార్జిషీటు దాఖలు, ప్రత్యేక కోర్టుల ద్వారా సత్వర న్యాయం వరకు అన్ని దశలను అనుసంధానిస్తూ తమ ప్రభుత్వం ‘దిశ’ వ్యవస్థను నిర్మించిందని జగన్‌ వివరించారు.

నిమిషాల వ్యవధిలో పోలీసుల స్పందన

ప్రమాదంలో ఉన్న మహిళ దిశ యాప్‌లోని SOS బటన్‌ నొక్కినా, మొబైల్‌ ఫోన్‌ను ఐదుసార్లు షేక్‌ చేసినా నిమిషాల వ్యవధిలో పోలీసులు స్పందించే వ్యవస్థను తీసుకొచ్చామని జగన్‌ గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1.51 కోట్ల మంది దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని, దిశ ద్వారా వచ్చిన 31,607 అత్యవసర కాల్స్‌ను తమ ప్రభుత్వ హయాంలో పోలీసులు పరిష్కరించారని వెల్లడించారు.

దిశలో భాగంగా రాష్ట్రంలో 18 ప్రత్యేక మహిళా పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో మహిళా పోలీసులను నియమించి 13,500 మందితో క్షేత్రస్థాయి భద్రత, రిపోర్టింగ్‌ వ్యవస్థను నిర్మించామన్నారు. మహిళల భద్రత కోసం 900 ద్విచక్ర వాహనాలు, 163 నాలుగు చక్రాల వాహనాలతో ప్రత్యేక పెట్రోలింగ్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఆరు నగరాల్లో బలోపేతమైన ఫోరెన్సిక్‌ వ్యవస్థ

మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో నిందితులు తప్పించుకోకుండా శాస్త్రీయ ఆధారాలకు ప్రాధాన్యం ఇచ్చామని జగన్‌ తెలిపారు. ఆరు నగరాల్లో ఫోరెన్సిక్‌ వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు 13 ప్రత్యేక పోక్సో కోర్టులు, 12 మహిళా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. లైంగిక నేరాలకు పాల్పడిన 2,17,467 మంది వివరాలతో ప్రత్యేక డేటాబేస్‌ను రూపొందించామని వెల్లడించారు. గతంలో డీఎన్‌ఏ నివేదికలు రావడానికి నెలల సమయం పట్టేదని, దిశ ఫోరెన్సిక్‌ వ్యవస్థ ద్వారా ఆ నివేదికలను కొద్ది రోజుల్లోనే అందించే పరిస్థితి తీసుకొచ్చామని తెలిపారు.

156 రోజుల నుంచి 28 రోజులకు తగ్గిన దర్యాప్తు సమయం

2017లో మహిళలపై నేరాల దర్యాప్తునకు సగటున 156 రోజులు పట్టగా, 2022 నాటికి దానిని 28 రోజులకు తగ్గించగలిగామని జగన్‌ పేర్కొన్నారు. 164 అత్యాచార కేసులు, 378 లైంగిక నేరాల కేసుల్లో కేవలం ఏడు రోజుల్లోనే ఛార్జిషీట్లు దాఖలు చేసినట్లు వెల్లడించారు. తీవ్రమైన కేసుల్లో 51 శాతానికిపైగా నిందితులను 48 గంటల్లోనే అరెస్టు చేశామని తెలిపారు. దిశ వ్యవస్థ ద్వారా సమర్థంగా దర్యాప్తు జరిపిన కేసుల్లో 214 మంది నిందితులకు శిక్షలు పడ్డాయని పేర్కొన్నారు.

మహిళలపై నేరాలు 27 శాతం తగ్గాయి

దిశ వ్యవస్థ అమలుతో 2024 మే నాటికి రాష్ట్రంలో మహిళలపై నేరాలు 27 శాతం తగ్గాయని జగన్‌ తెలిపారు. గతంలో మహిళలపై నమోదయ్యే వార్షిక సగటు కేసుల సంఖ్య 14,338గా ఉండగా, అది 10,426కు తగ్గిందన్నారు. ఇవే దిశ సాధించిన ఫలితాలని, మహిళలకు దిశ కల్పించిన భరోసా ఇదేనని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం అమలు చేసిన దిశ వ్యవస్థకు తమ ప్రభుత్వ హయాంలో 19 జాతీయ అవార్డులు వచ్చాయని గుర్తుచేశారు. ‘దిశ’ అనేది కాగితాల మీద ఉన్న పేరు కాదని జగన్‌ స్పష్టం చేశారు. ప్రమాదంలో ఉన్న మహిళ SOS బటన్‌ నొక్కిన క్షణం నుంచి నిందితుడికి శిక్ష పడే వరకు బాధితురాలికి అండగా నిలిచే సజీవ మహిళా రక్షణ నెట్‌వర్క్‌ అని అభివర్ణించారు.

BNS.. దిశకు ప్రత్యామ్నాయం ఎలా అవుతుంది?

“భారతీయ న్యాయ సంహిత–BNS అమల్లోకి వచ్చినందున దిశ అవసరం లేదు” అనే ప్రభుత్వ వాదనను జగన్‌ తప్పుపట్టారు. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన SOS వ్యవస్థ, ప్రత్యేక మహిళా పోలీస్‌స్టేషన్లు, గ్రామస్థాయి మహిళా పోలీసులు, ప్రత్యేక పెట్రోలింగ్‌, లైంగిక నేరస్తుల డేటాబేస్‌, వేగవంతమైన ఫోరెన్సిక్‌ వ్యవస్థ, ప్రత్యేక ప్రాసిక్యూషన్‌, ప్రత్యేక కోర్టులు, నిర్ణీత సమయంలో దర్యాప్తు, న్యాయం అనే లక్ష్యాలకు BNS ప్రత్యామ్నాయం ఎలా అవుతుందని ప్రశ్నించారు.

21 రోజుల్లో న్యాయమే దిశ లక్ష్యం

మహిళలు, చిన్నారులపై తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు ఏడు పని రోజుల్లో పోలీసు దర్యాప్తు పూర్తి చేసి, ఛార్జిషీటు దాఖలైన తర్వాత 14 పని రోజుల్లో కోర్టు విచారణ ముగించేలా దిశ ద్వారా లక్ష్యాన్ని నిర్దేశించినట్లు జగన్‌ వివరించారు. మొత్తం 21 రోజుల్లో బాధితులకు న్యాయం అందించాలన్న లక్ష్యాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం విమర్శించడం బాధాకరమన్నారు.

దర్యాప్తులో జాప్యం, కోర్టు విచారణలో ఆలస్యం లేకుండా మహిళలు, చిన్నారులపై నేరాలను అత్యంత ప్రాధాన్యంతో విచారించాలన్నదే ఆ లక్ష్యం వెనుక ఉద్దేశమని చెప్పారు. నేరం చేస్తే చట్టం వేగంగా, కఠినంగా స్పందిస్తుందనే భయం నేరస్తుల్లో కలిగించడానికే దిశ వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. వేగంగా న్యాయం అందించే వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సింది పోయి, ఆ లక్ష్యాన్నే తప్పుపట్టడం ద్వారా ప్రభుత్వం మహిళలకు ఎలాంటి సందేశం పంపుతోందని నిలదీశారు. మహిళలు, చిన్నారులకు సకాలంలో న్యాయం జరగాలని కోరుకోవడమే ప్రభుత్వానికి అభ్యంతరమా అని ప్రశ్నించారు.

నేరస్తుల్లో చట్టంపై భయాన్ని తగ్గిస్తున్నారు

దిశను ఉపసంహరించుకోవడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం నేరస్తుల్లో చట్టంపై ఉన్న భయాన్ని తగ్గిస్తోందని జగన్‌ ఆరోపించారు. బాధిత మహిళల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తూ, వారు రక్షణ కవచంగా భావించిన వ్యవస్థను లేకుండా చేస్తోందని విమర్శించారు. దిశ ఉపసంహరణ నిర్ణయాన్ని రాష్ట్ర మంత్రివర్గం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. “దిశను రద్దు చేయడం కాదు.. రక్షించాలి. నిర్వీర్యం చేయడం కాదు.. మరింత బలోపేతం చేయాలి” అని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

Read also: YS Jagan: నేతన్న నేస్తాన్ని రెండేళ్లు నిలిపేశారు.. చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్‌ జగన్‌ విమర్శలు
YS Jagan: మీ కుమారుడిని కాపాడేందుకు ఇంకా ఎంత దిగజారుతారు? : జ‌గ‌న్ ట్వీట్
YS Jagan in Devarapalli: చంద్రబాబు పాలనలో ఒక్క గంజాయి పంట‌కే ధర.. దాన్ని సాగు చేస్తోంది వెన్నుపోటు పార్టీ వారే: వైఎస్ జ‌గ‌న్

ట్యాగ్స్: , , , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading